| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - తృతీయాశ్వాసము |
| సీత యగ్ని ప్రవేశము | ||
| వ. |
ఇట్లు గొనివచ్చి రామభూపాలుని సమ్ముఖంబున నునిచిన నద్ధరాతనూజాత పతికి వినయభక్తి తాత్పర్యంబులు వెలయఁ బ్రణమిల్లిన నతండు వనితారత్నం బగుసీతం గనుంగొని యిట్లనియె. |
114 |
| క. |
కులసతిఁ జెఱ గొనిపోయిన యలశాత్రవు గెలువ నోపఁ డనుపలుకులకున్ గెలిచితిఁ బగ చంపితి నిఁక నెలఁతా! నీయిచ్చఁ జనుము నే నిన్నొల్లన్. |
115 |
| ఆ. |
అనుచుఁ బలుకుపలుకు లవనీతనూజాత కర్ణములకు వాఁడి గలుగునట్టి నారసములు సోఁకి నాటిన యట్లైన సరసిజాక్షి మూర్ఛఁ జాలి నొంది. |
116 |
| చ. |
నరవర! నాదుచిత్తము మనంబున నీవ యెఱింగియుండియున్ బరుషము లాడ నేమిటికిఁ బాపము నాయెడ లేదు కాదుపో సురలు నుతింప మేటిసొదఁ జొచ్చెద మెచ్చుఁ డటన్న రామభూ వరునిమనం బొడంబడిన వారిజలోచన సీత యాతఱిన్. |
117 |
| క. |
హృదయేశుఁ డలర నప్పుడ సొదఁ జొచ్చెను భూమిపుత్త్రి సురలు నుతింపన్ ముద మంది పద్మభవుఁడా యదనం బ్రత్యక్ష మయ్యె నౌ నౌ ననుచున్. |
118 |