| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 136. ఆంధ్రవీథి |
| 136. ఆంధ్రవీథి (వాయుసందేశమునుండి) |
| చుట్టు నున్నట్టి పర్వతాల్ పెట్టనట్టి కోటగానొప్పు బొబ్బిలికోటదరిని గాండ్రు గాండ్రని తీండ్రించు తాండ్రపాప రాయు బొబ్బిలిపులి యని ప్రథితకీర్తి గన్న వీరు దలచి మందగతిని బొమ్మ! |
| కళలకుం గవులకు హరికథకులకును గాయకులకు పండితులకు గణికలకును పుట్టిని ల్లదె! రణమున దిట్ట యయ్యు, దొంగపోటున శత్రుచే భంగపడిన విజయరాముని నగరంబు, నిజము జెప్ప దాని కీ డగు పురము నెందేని గనవు! |
| చెంత జేరి సముద్రమ్ము చిందులాడ ఇంపొసగు లతలతో సెలయేళ్ళతోడ రమ్య మైయొప్పు సింహాచలమ్ముపైన భక్తవరదు సింహాద్రియప్పని భజించి యచటి ప్రకృతివిచిత్రమ్ము లరసి చనుమ! |
| పావనక్షేత్రముల కెల్ల పావనమ్ము మీరి దక్షిణకాశియ\న్ పేర బరగు పాదగయతీర్థమున గ్రుంకి భక్తితోడ దగ్ధశవహవ్యధూపసంతర్పణమ్ము కుక్కుటేశ్వరునకు జేసి మ్రొక్కి చనుమ! |
| పరమసాధ్వి పతివ్రత భర్తతోడ సాగుమానము జేసిన సచ్చరిత్ర, కాపుకోడలు కామమ్మ, కలియుగాన బొందితోడ కైలాసము నందినట్టి పుణ్యభూమి దర్శింపక పోకుమోయి, కులము తీరెంచ నేటికి గుణము కల్గ! |
| కులుకులాడి, మాయావిని, క్రూరమదన బాణహత, మారుతల్లి, త న్వలచి విఫల యై నిజేశునితో కల్ల లాడి, తనదు కాలుసేతులు నరకింప, నేల గూలి నట్టి సారంగధరుమిట్ట యదియె! అచట చల్లగా వీచుమా, నీదు జాలితెలియ! |