| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 140. అడవిసీమ |
| 140. అడవిసీమ (వాయుసందేశము నుండి) |
| ఎండవేడిమి జగమెల్ల మండ జేసి, చండశాసనుడై ప్రజం జెండి తుదకు కాల మైపోవ నవసానగతిని జెందు క్రూరనరపాలునట్టుల కోష్ణకిరణు డయ్యె సూర్యుండు, ఎల్లెడ నాకసమున నెఱ్ఱనౌ కాంతితోడుత నెన్ని యెన్నొ వింతరంగులు కలియంగ వెల్లివిరిసె నిరుపమాద్భుతశోభలు, నేత్రపర్వ మయ్యె నాకాంతి బ్రకృతి యత్యంత మపుడు. |
| అది మిగుల నందమౌ నొక యడవిసీమ జానపద మెచ్చటను చెంత గానరాదు, నిర్మలంబును స్వచ్ఛమౌ నీటితోడ నిరుగెలంకుల మింటికి శిరసు లెత్తు నారికేళ వృక్షమ్ములనడుమ నుండి యెడతెగని పాట బాడుచు నేగుదెంచు నల నదీవాహమృదులగానమ్ము దక్క వేరు శబ్దమ్ము లేవియున్ వినబడ వట. |
| కఠిననియములుగాక సత్కర్మనిరతు లగు మహాఋషు లుండగా దగుప్రదేశ మచట దుర్మార్గులకు సైత మలవడెడిని సర్వసౌఖ్యంపుమూలమౌ శాంతగుణము. |