| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 141. వెన్నెలరేయి |
| 141. వెన్నెలరేయి (వాయుసందేశము నుండి) |
| ఇంతలో చందురుం డుదయించె మింట, వెన్నెలలు జగమెల్లను వెల్లివిరియ పాలసంద్రంబువోలె ధావళ్య మంది ప్రకృతి వెలుగొందె కన్నులపండు వౌచు |
| మెత్తనౌ దూదిమబ్బులు మింట పర్వు లెత్తుచుండెను చందురుం డొత్తుకొంచు బోవుచును వెండి నునుపూత బూయుచుండ నంచులకు వినూతనశోభ లలముకొనగ |
| పల్లవ లతాతరు లవెల్ల తెల్లనయ్యె వెండిరేకులు నదిపైన విస్తరిల్లి అటునిటులు కదులుచుండెడు నలలతోడ నాటలాడుచు నది కెంతొ యంద మిచ్చె |
| అంతటను నల్లుకొని కాంతి నతిశయిల్లు నా విమలమైన వెన్నెల నడవిమల్లె పొదలపైనుండి కమ్మని పూలతావు లెల్లెడం జిమ్ముచును వీచె చల్లగాలి |
| చచ్చిపోయినవారికి సైత మట్టె జీవ మిచ్చి మేను నిమిరి సేద దీర్చు చల్లనౌ మలయపవనము మెల్ల వీవ మేనిపై, నెమ్మన మెల్ల మెలకువ గనె. |