| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 142. ఎడబాటు |
| 142. ఎడబాటు (వాయుసందేశము నుండి) |
| ఘోరచింతాగహనసీమ దారి గాన కటు నిటులు చీకటిని బ్రాకులాడుచుండి కడకు నిను గాంచు భాగ్యంబు గంటి నింక నీవె నా దిక్కు నా యాశ నీవె సఖుడ! |
| అతివతో తిన్నగా సౌఖ్య మనుభవింప లేదు లోకమోహనమగు లేమసొగసు మఱపు రాకుండ తిరముగా మదిని నాట హృదయఫలకమ్ముపైని చిత్రింపలేదు! ఇంతలోనె నా మురిపెపు టింతితోడ నేల నీ యెడబాటు జనించె సఖుడ! |
| చెవులపండువు సేసెడి చెలియవలపు పలుకుదేనెల తమి గ్రోలి పరవసమ్ము జెంద లే దింతలోనె నా చెలికి నాకు నేల నీ యెడబాటు జనించె సఖుడ! |
| నాతి నెయ్యంపుచిన్నెగా నాటినట్టి వలపుతీగె లేజివుళ్ళు మొలచి పూలు పూయలే దింతలోనె నా పొలతితోడ నేల నీ యెడబాటు జనించె సఖుడ! |
| కలలోనైనను నెడబాటు గలుగునంచు నించుకైనను మదిలోన నెంచ నకట! సకియతో నెల్లకాలము సకలసుఖము లనుభవించెదనం చెంతొ యాసపడితి. |