| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 143. సహజలావణ్యము |
| 143. సహజలావణ్యము (సెలయేటిగానము నుండి) |
| మోముతీరు సామాన్యమే, ముగుద, కురులు ముడిచి, కుంకుమతిలకమ్ము మోమున నిడి నంతనే యింత సొగ సెట్టు లబ్బె, జెప్ప వే చెలి, వినంగ నామది వేడ్కపుట్టె. |
| తీగెదీపమ్ము దీప్తి నల్దెసల బర్వి చదల చీకటి నిటు నటు కదలబాఱ జేయుచుండ, నొయారమ్ము చెలగ నిలిచి మాటలాడెడి నీసౌరు మనము గొనియె చెలియరో! దేవలోకమ్ము చేడెల వగు లోపమేలేని యుత్తమరూపములను గంటిగాని, యదేమొ నా కన్నులకును నీదుమూర్తియె మోదమ్ము నించె, నిజము. |
| ఉత్తమాకృతి జీవసంపత్తి గలుగు సహజలావణ్యమున కెట్లు సాటివచ్చు? |