| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 118. కామిని |
| 118. కామిని (కల) |
| మల్లికలారా, యేటికి మీకీ యుల్లాసము నా కెఱుగంజెపుడీ ఉల్లమ యేటికి నిట్టులు దడ దడ నూరక కొట్టుకొనంగన్. |
| అది యేమో నా కనులకు గన్పడు నతివ యొకో లే కచ్చరయో? పస దిలకించగ నీ చెలి యప్సర భామలనుం దలదన్నున్. |
| వనిత సొగసు నా హృదయరాజ్యమును వశము గొనియె బలవంతముగా, నీ సతిప్రేమ గాంచుకంటెను మేలౌ సౌఖ్యము కలదే జగతిన్? |
| ఇంతీ! నీవేలోకముదానవొ యెరుగ నొకించుక యైననుగానీ నిను గన్న నిముసమందె నామది నీయందే తగిలెన్. |
| పున్నమచందురు సాక్షిగ నిపుడో పొలతీ నను చేపట్టంగదవే నిన్నే వలచితి నిజము నమ్ముమో కన్నెరొ నామాటల్. |
| మిన్నున చుక్కలు మినుకుమినుకు మని మివులన్ కులుకుచు చోద్యము జూచెడు కనుమా, పూదావుల గొని చల్లని గాలి వీచు మది యలరన్. |
| చందమామ యా పిల్లమబ్బు జొఱు చందము నూఱక చూచెదవేలే? అందకత్తెరో అటు జూడకుమీ ఆలకించు నా పలుకుల్. |
| తెలియనిబాసల నడ్డు జెప్పెదవు నిలువం గలదే ప్రాణము చెలియా? మాటలతో జాగేల చేసెదే మంచిది ముద్దొక టీవే. |
| ఆహాహా! యీ ముద్దు తీపి కల యమృతమైనను సరియౌనే సకియా, యిన్నాళ్లకు నాజన్మము సార్థక మయ్యెంగాదె? |
| అది యేమే, ఒక ముద్దు తోడనే అంతమొందెనే మననెయ్యము చెలి? దయమాలి యెచటి కొంటిగ నను వీడి దాటి పోయినావే? |
| చందమామ యా నల్లమబ్బుజారు సందున నెచటికి మాయమైతివే? సుందరి, నిముసము మెఱపు మెఱసి కను లందు దుమ్మునిడిపోతే! |
| అదియేమే నా జనకురూపు గొని యడలించె దొడలు నీరై పోవగ ముదిత వింత దుష్టచరిత వెవతెవె? మోహినివా? అల కామినివా? |