| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 011. లైలామజ్నూన్ |
| 11. లైలామజ్నూన్ |
| "లైలనోయీ ప్రియా, కన్నులార గనవె!" యనుచు పిలిచిన గొంతుక నానవాలు బట్టినట్లుగ కనులిట్టె పైకినెత్తి చటుకునను మూసి, మజ్నూను సంచలింప కుండ జపమాలికం ద్రిప్పుచుండ జూచి, |
| లైల యనురాగ పవనసంచాల యౌచు గద్గద క్లాంతి నిట్లను కరుణదోప, "గట్టులను పుట్టలను దాటి కాననముల గడచి యేళ్ళెన్నియో యీది, కట్టకడకు సన్నిధిం జేర ఫల మిదా కన్నులకును? |
| మరచితో గాఢవైరాగ్య పరవశతను లైలమున్నుండె నీ ప్రియురా లటంచు లేక ద్రోహాత్మనౌ నాదు రాకచేత భగ్న ప్రణయంపుగాథ జ్ఞాపకము వచ్చి పాపినౌ నన్నుగాంచగా నోపలేవొ? |
| విధివశత చాపలమ్మున\న్, వేరొకనిని పెండ్లియాడితినేగాని హృదయమెల్ల నిండియుంటివి, నీవె నా నిశ్చలంపు ప్రేమ, సర్వేశ్వరుండును నే మెఱుంగు? |
| నాథ! మన్నింపవే దయన్నాదు పాప చయము, నెల్లప్పు డింక నీ చరణదాసి నౌచు జీవమ్ము గడపెద నాథ, కనవె! |
| ప్రాణముల మరపించెడు ప్రాణమిచ్చి దివ్య దివ్యామృతముకన్న దివ్యమైన నీదు గానామృతము గ్రోలి, నిన్నుగూడి నిభృత నికుంజ గృహముల నెల్లకాల మీ నవోద్యానమున విహరింపనీవె?" |
| అనగ, మజ్నూను సూర్యునియట్లు వెలుగు వదనమున గ్రమ్ము జడల నావలకు ద్రోసి, కన్నులను విప్పి, లైలను గాంచి, నవ్వి "లైలవా! కల్ల; నీ వెట్లు లైల వౌదు? |
| విశ్వమెల్లను దానయై వెలుగునామె స్వచ్ఛ కాంతిదౌ సంఛిన్న శకలి వేమొ? అంతియేగాని లైల వీవన్న నమ్మ నిదిగో నాలైల నీకు జూపింతు గాంచు" |
| మంచు లైలా యనుచు గౌగిలించి లతల పూవులను లైలా యంచు ముద్దుగొనుచు పక్షులను లైలా యంచు పలుకరించి పలుదిశల లైలా యంచు పరుగు లిడుచు బోయె మజ్నూను ఆనందపురము జేర. |