| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 030. పాడుసిగ్గు |
| 30. పాడుసిగ్గు |
| దేవ! నా కనులముందు తేజరిల్లు మెప్పటట్లు దేవ! నా... |
| ప్రణయపూర్ణ హృదయుడవై భాసమాన దేహుడవై భావవీధి నన్ను గోరి వచ్చిన నిను గాంచనైతి దేవ! నా... |
| వెల్లివిరియు తేజముతో వెల్లమబ్బు నంచు వీడి మెల్లన దిగివచ్చు నిన్ను మేల్కొనియుం జూడనైతి దేవ! నా... |
| వలపున నాయిల్లు జేరి తలుపు మెల్ల తట్టు నీదు పిలుపు వినియు, ని న్నెఱిగియు వలపు నిలుప జాలనైతి దేవ! నా... |
| పాడుసిగ్గు వీడదాయె ప్రాణేశా! దేవా! నీ చూడచక్కనైన మోము చూడలేక వెఱగుపడితి దేవ! నా... |
| జీవితంపుమేలి ఫలము చేత జిక్కి జారిపోయె మండిపో వెడారిలోన నెండమావి యట్లదోచె దేవ! నా... |
| అస్తమిత దినేశంబై అంధకార బంధురమౌ మిన్నుపై హఠాత్తుగాను మెఱపు మెఱసినట్టులయ్యె దేవ! నా... |
| వలపునిండి వచ్చిన నీ వాంఛ దీర్పనైతి నంచు మెలవేసుకపోవు హృదయ మెట్లు బ్రతుకుదాన నింక ప్రణయపూర్ణ హృదయుడవై భాసమాన దేహుడవై |
| దేవ! నా కనుల యెదుట తేజరిల్లు మెప్పటట్లు. |