| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 099. సంవత్సరాది |
| 99. సంవత్సరాది |
| బాలభాస్కరా! అపుడే వచ్చితివ ఉగాదియంచు బంగరు కిరణాల దుస్తు లం గడు మెరయుచు కులుకుచు |
| గల గల మని వీచెడు చిఱు గాలిపాట కలరియాడు మావియాకులార! మఱచి పోవుదురే యింతలోనె |
| వెన్నెలలో నాయెదపై బన్నుండి భవద్దర్శన మ్మున బ్రహ్మానందమ్మును గను ముద్దుల నా బిడ్డను |
| తోరణాల దూర నేగు తొందరలో నున్న మిమ్ము నాపబోను, లోలోననె యావేదన నడచికొనెద! |
| వేపకొమ్మలార! నాల్గు వేళల నా బిడ్డపైని ప్రాణవాయువులను వీచి బ్రతికించెద రనుకొంటిని!! |
| కాని శాస్త్రసిద్ధాంతము కందని యొక మహాశక్తి నాదుబిడ్డ గొంపోయెను మీ దేమున్నది పాపము! |
| మినుకు మినుకు మినుకు మనుచు మింట మెరయు చుక్కలార! చెప్పరేల మీలో నా చిన్నితల్లి యెవ్వరొక్కొ! |
| చెప్పవద్దులే వరాల కుప్పను కాపాడి మరల వప్పగింపు డీ స్వర్గము నందున మా కంతెచాలు! |
| అమృతకిరణ కన్నె మంగ ళప్రద బ్రతికింపజాల నైతి నంచు సిగ్గు జెంది యథోగతిని బోయితివే? |
| చాలును నీలాంఛనమ్ము లేల? నేడుగాకయున్న రేపైనను రావొక్కో నీపస జగమెఱుగనిదే? |
| కన్నకడుప యేమి, నీకు కలుగు నెట్టు లహర్నిశలు కనలి పొక్క జేయు నాదు కడుపుమంటవలని తపన! |
| పోయినవత్సరపు సుఖము బుల్లితల్లి తోనె పోవ నూతనసంవత్సరాది నీతీరుగ వగవనాయె! |