| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 098. నిర్వాణ సుఖము |
| 98. నిర్వాణ సుఖము |
| నా మంగళప్రదా! నా చిన్ని తల్లీ! మరువలేదే నిన్ను మా కన్నతల్లి! ఉదయాన సూర్యుడీ వదనకాంతులలో బంగారు నీమేనిచాయలే గందు! |
| మలమలా మాడ్చేటి మధ్యాహ్న వేళా గలగలా గలమని క్రింద రాలేటి పండుటాకులు పాట పాడుతుండంగ చిట్టి! నీ యేడ్పు విని దద్దరిల్లేను! |
| పడమటా సూర్యుండు కుంకేటివేళా సందెకాంతులు కళ్ళ పండగౌవేళా వికసించి నవ్వేటి బీరపువ్వులలో చిరునవ్వు నీమోమె చూచిమురిసేను! |
| వెఱ్ఱిలోకము సద్దు మణిగిన్న వెనుక మెత్తన్ని మబ్బు పొత్తిళ్ళలో వొదిగి బజ్జుని మింట వుయ్యాల లూగేటి చెంద్రుణ్ణి నీ మేని పట్టబొయ్యేను! |
| మాయదారీ నిద్ర మచ్చు పొడిజల్లి మనసు గొని దివ్యలోకాలన్ని దిప్పి తుదకు దయచేసింది నా చిన్నితల్లి! నీ సన్నిధనియేటి నిర్వాణసుఖము! |