| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | అమ్మముద్ద; నాన్నముద్ద |

| అమ్మముద్ద; నాన్నముద్ద | ||
పసిపిల్లలు అప్పుడప్పుడు అన్నము తినక మారాము పట్టుతూ ఉంటారు. అప్పుడు అన్నము పెట్టేవాళ్లు ముచ్చట్లు చెప్పి ఆనందము కలిగించి మారాము మరపించి అన్నము తినిపిస్తారు. అట్టి ముచ్చట్లు కొన్ని -- "అమ్మా! నాన్న మంచివాడు కాదూ! ఇదిగో! ఇది నాన్నముద్ద! తిను, తినవూ? నాన్న మంచివాడు కాదూ? ఆవేళ నీకు మిఠాయి తెచ్చిపెట్టలేదూ? నీకు మంచి చొక్కాలు కుట్టించలేదూ?" అవునవు నని అంగీకరించును. "అయితే తినుమఱి. మళ్లీ మిఠాయి తెచ్చిపెట్టుతాడు!" తినును. తర్వాత, "ఇదిగో! ఇది అమ్మముద్ద," అంటూ తండ్రి ప్రేమ వలెనే తల్లి ప్రేమను జ్ఞాపకపరచి ఇంకొక ముద్దను తినిపిస్తారు. అట్లాగే ఆ తర్వాత, అత్తయ్యలముద్ద, మామయ్యలముద్ద అంటూ బంధువులపేర్లతో వారి వారి ప్రేమలను జ్ఞాపకపరుస్తూ అన్ని ముద్దలను తినిపిస్తారు. దీనివలన పిల్లలకు మారాము మానడము, తినవలసిన అన్నము తిన్నగా తినడము, బంధువులమీద ప్రేమబంధము మనసులో చక్కగా నిలుపుకొనడము కలుగుతుంది. | ||