| కీర్తనలు | అన్నమాచార్య | బ్రహ్మ కడిగిన పాదము |
అధ్యాత్మ సంకీర్తన - రేకు 31 - సంపుటము 1 కీర్తన 191
| ముఖారి |
| పల్లవి: |
| బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానె నీ పాదము |
| చరణములు: |
| చెలఁగి వసుధ గొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము తలఁకక గగనము దన్నిన పాదము బలరిపుఁ గాచిన పాదము |
| కామిని పాపము గడిగిన పాదము పాము తల నిడిన పాదము ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము పామిడి తురగపుఁ బాదము |
| పరమ యోగులకుఁ బరిపరి విధముల వరమొసఁగెడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమపదము నీ పాదము |