| కీర్తనలు | భద్రాచల రామదాసు | ఏతీరుగ నను దయజూచెదవో యినవంశోత్తమరామా |
| నాదనామక్రియ - ఆది |
| పల్లవి: |
| ఏతీరుగ నను దయజూచెదవో యినవంశోత్తమరామా నాతరమా భవసాగరమీదను నళినదళేక్షణరామా ఏ.. |
| చరణము(లు): |
| శ్రీరఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిను కన్నదికానుపు రామా.. |
| మురిపెముతో నాస్వామివి నీవని ముందుగ దెల్పితి రామా మరువక యిక నభిమానముంచు నీమరుగు జొచ్చితిని రామా ఏ.. |
| క్రూరకర్మములు నేరకచేసితి నేరములెంచకు రామా దారిద్ర్యము పరిహారముచేయవె దైవశిఖామణి రామా ఏ.. |
| గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా గురుదైవంబని యెరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా ఏ.. |
| నిండితి నీవఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా నిండుగ మది నీనామము దలచిన నిత్యానందము రామా ఏ.. |
| వాసవకమల భవాసురవందిత వారధి బంధన రామా భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా ఏ.. |
| వాసవనుత రామదాస పోషక వందన మయోధ్యరామా దాసార్చిత మాకభయ మొసంగవె దాశరథీ రఘురామా ఏ.. |