| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 004. నాగుల చవితి |
| 04. నాగుల చవితి |
| నీ పుట్టదరికి నాపాప లొచ్చేరు పాపపుణ్యమ్ముల వాసనే లేని బ్రహ్మస్వరూపులౌ పసికూనలోయి! కోపించి బుస్సలు కొట్టబోకోయి! నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి! |
| చీకటిలోన నీ శిరసు తొక్కేము కసితీర మమ్మల్ని కాటేయబోకు కోవపుట్టలోని కోడెనాగన్న పగలు సాధించి మాప్రాణాలు దీకు నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి! |
| అర్ధరాత్రీవేళ అపరాత్రీవేళ పాపమే యెఱగని పసులు తిరిగేని ధరణికి జీవనాధార మైనట్టి వాటిని రోషాన కాటేయబోకు నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి! |
| అటు కొండ యిటు కొండ ఆ రెంటినడుమ నాగులకొండలో నాట్యమాడేటి దివ్యసుందరనాగ! దేహియన్నాము కనిపెట్టి మమ్మెపుడు కాపాడవోయి! నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి! |
| పగలనక రేయనక పనిపాటలందు మునిగి తేలేటి నా మోహాలబరిణె కంచెలు కంపలూ గడచేటివేళ కంపచాటున వుండి కొంప దీకోయి! నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి! |