ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
రామాదుల యరణ్యప్రయాణము
నప్పుడరుంధతి:“యకట! యిక్ష్వాకు
లిప్పాటువడుచుండ నిటు సూడవలసె!’
నని వసిష్ఠునిఁ బల్క నమ్మహామౌని
తన బుద్ధి నెంతయుఁదలపోసి చూచి
“యే రూపమునఁబోవ దిది దైవయోగ
మూరకుండుము;సూచుచుండుద.”మనియె
నప్పుడు రఘురాముఁడడవికై 243పూని
తప్పక వెడలె.నా దశరథాధిపుఁడు
మదిలోన వగచి సుమంత్రునిఁజూచి:
“యిదె రాముఁడడవుల కేఁగుచున్నాఁడు;
కొనిపొమ్మురథ.”మన్నఁగువల244యాధీశు
పనుపునఁగొనిపోయి భక్తితోమ్రొక్కి:
“రథమిదె పుత్తెంచె రాజు245నీ కడకు;
రథమెక్కి విచ్చేయు రఘురామచంద్ర!”
యనవుడు దశరథునాజ్ఞకు వెఱచి
మును సీత నెక్కించి మొగి నాయుధములుఁ
246దనరుజోడునుబెట్టి తాను లక్ష్మణుఁడు
ఘనమైనరథమెక్కి కదలె రాఘవుఁడు.
అంతఁబౌరులు వృద్ధులాప్తులు మంత్రు
లింతులు బాలురు హితులు నాశ్రితులు
వంత బ్రాహ్మణరాజవైశ్యశూద్రాదు
లంతంత నలుగడ నడలుచు వెడలి
ముందట నిరుపార్శ్వములఁబిఱుందటను
సందడింపుచు మది జడిగొన్న వగలఁ
“గడఁగి యిక్ష్వాకుల గౌరవంబెల్ల
నడఁచెనే మంథర”యని తిట్టువారుఁ;
“దగవేది రఘురాముఁదపసిగాఁజేయ
నగునమ్మకైకేయి!”కని దూఱువారుఁ,
“దాలిమి దిగ247నాడి దశరథాధీశుఁ
డాలికి వెఱచెనే!”యని రోయువారుఁ,
“జనవెల్లఁజెడి రామసౌమిత్రులింత
యనదలై పోదురే!” యని వేఁగువారుఁ;
“బనుగొన్న సామ్రాజ్యభారంబు మాని
పొనుపడ నిట్లేల పోదు!”రన్వారు;
“నీ పదునాలుగేం డ్లెట్లు వీ రడవి
నాపద వేగింతు.”రని పొక్కువారు;
“నే నోము నోచెనో యీ మహీతనయ
తా.”నంచు మదిలోనఁదలపోయువారు;
“నతి దుఃఖమున రాముఁడడవికి నేఁగ
హితమతి భరతుఁడే యేలు.”నన్‌వారు;
“నతిమృదుగాత్రి యీ248యబల భూపుత్రి
పతిఁబాయలే.”దని ప్రణుతించువారు;
“నీ సుతుఁడడవుల కేఁగంగఁబూనఁ
గౌసల్య యెట్లోర్చెఁగా.”యనువారు;
నై రామునరదంబు నందంద కదిసి
భూరిశోకాగ్నులఁ బొగులుచుఁ బోవ
నంతఁగౌసల్యయు నా సుమిత్రయును
జింతాపరంపరఁ జిక్కి శోకింప
వారికరంబులు వలనొప్ప 249నూది
వారిపై వ్రాలుచు వగలఁదూలుచును
గలయ నంతఃపురకాంతలు దన్నుఁ
గొలిచి రా దశరథక్షోణిపాలకుఁడు
భూరిలోచనబాష్పపూరంబు దొరుగ
“హారామ! హారామ!”యని పలుమాఱు
నెలుఁగెత్తి యేడ్చుచు నేచిన వగల
నలిఁదూలి పొగులుచు నగరంబు వెడలె.
నప్పుడు రవిదీప్తులణఁగె; నల్‌దెసల
నుప్పొంగెఁదమము; వహ్నులు మండవయ్యె;
ధరణి బీఁటలువాఱెఁ; దారలు మాసె;
విరసించి గ్రహములు వినువీథిఁబోరె;
నెలసినమదధార లింకె దంతులకుఁ;
గలయ నశ్వములకుఁగన్నీరు రాలె;
వారు వీరన కెల్లవారుఁ బెల్లడలఁ
బౌరుల యేడ్పు లంబరమెల్ల నిండె.
సురవరకామినీశోకరావంబుఁ
బొరిఁబొరి వినవచ్చెఁబురజనంబులకు.
నప్పుడు దశరథుం డా రామురథము
చొప్పు బాష్పములచేఁజూడఁజొప్పడక:
“చంద్రబింబముతోడ సరియైన రామ
చంద్రునిమొగ మొకసారి చూచెదను.
ఓ సుమంత్రుండ! రథమునుపవే.”యనుచు
నా సుమంత్రుఁడు వినునట్లు చీఱుచును
వెనుకొని పురి దాటి వెస నేఁగుదేర
మను250జేశుఁగాంచి సుమంత్రుతో ననియె:
“నిదె వచ్చుచున్నవాఁడినకులేశ్వరుఁడు;
పొద,పొద,పోనిమ్ము,పోనిమ్ము రథము.”
ననియని రఘురాముఁడందంద పలుక
మొనసి యాతఁడురయంబునఁదేరుఁబఱప
నంత వసిష్ఠుఁడయ్యవనీశుఁ జూచి
యంతరంగంబున నడలుచుఁబలికె:
“ననఘ! శోకించుచు ననుపఁగా రాదు.
మనుజేశ! నీ వింక మఱలు మిచ్చోట.”
నన విని దశరథుఁ251డచ్చోట నిలిచి
తన252 సూను253రథమటు తప్పక చూచి,
యదియుఁగానక ధూళియటు సూచిచూచి,
యదియుఁగానక బయలటుసూచిచూచి,
“హా!”యని యెలుఁగెత్తి“హారామ!రామ!
హా!”యని 254యేడ్చుచు నవనిపైఁద్రెళ్లి
పొరలుచుఁగెంధూళి255బ్రుంగి కన్విచ్చి
కరముగ్రమగు దృష్టిఁ గైకేయిఁజూచి:
“నీ పాపమెఱుఁగక నిన్ను మన్నించి
నా పుత్త్రరత్నంబు నటు కోలుపోతి;
నిన్నుఁ బెండ్లాడి నే నీచుండ నైతి;
నన్నిట మేటినై యల్పుండ నైతి;
నడరునిందలకెల్ల నాధారమైతిఁ;
గడపటఁజెఱిచితిఁ గాకుత్స్థకులము.
నినుఁజూడఁగారాదు; నిను ముట్టరాదు;
చెనఁటి, నీ తోడ భాషింపఁగారాదు.”
అని దశరథుఁడాడ నా256రాజసతులు
కనుకనిఁదనుఁదిట్టఁగైకేయి వినుచుఁ
దల వాంచికొనియుండె.దశరథుండంత
నలయుచుఁజని యయోధ్యాపురిఁజొచ్చి
పాడు257వాఱినయట్టి పట్టణవీధి
నాడాడ నిలుచుచు258నపుడు కౌసల్య
నగరంతఁజొచ్చి యానన ధూళితోడఁ
బొగులుచు, సెజ్జపైఁ259బొరలుచు, మిగుల
నలయుచు,సొలయుచు,నసురుసురనుచు
నలుదెసల్‌ సూచుచు, నాలుక యెండ
“హారామ!హారామ!”యనుచు దైవంబు
దూఱుచుఁ,దనుఁదానెదూషించుకొనుచు,
నే పాటు నే దుఃఖమెఱుఁగని యట్టి
నా పుత్త్రరత్నంబు నాదు కోడలును
నెంతదవ్వరిగిరో?యెందున్నవారొ?
యెంతలోఁగుందిరో? యెట్టులేఁగెదరొ?
కందమూలములు శాకములు నేరీతిఁ
దిందురో? యెట్లు వర్తింతురో యడవి?
నని రామసీతలయాయాసములకుఁ
దనమది260నడలుచుఁదలఁపోయుచుండెఁ.
గౌసల్యయును నంతకంటె శోకింప
నా సుమిత్రాదేవి యడలార్పుచుండె.[వా.రా. సర్గ 43-45]
నంత రాముఁడు పౌరులందఱుఁగొలువఁ
గొంత దవ్వేఁగి పేర్కొని వారిఁ261బలికె:
“ననఘాత్ములార! మీరందఱు మగుడి
చనుఁడయోధ్యకు నాకు జయముగోరుండు
భరతుని యాజ్ఞలోపలను వర్తించి
పొరయుఁడు సౌఖ్యముల్‌.పొండు మీ.”రనిన
వారలందఱు నేకవాక్యులై పలికి.
“రో రామ! యిట్లాడ నుచితమే నీకు?
భరతుఁడు మా కేల? పట్టణంబేల?
వరమందిరము లేల వనుల కీ వరుగ!
వత్తుము నీ వెంట;వల 262దంటివేనిఁ
జత్తుము; దీనికై సందేహ మేల?”
యని263యని పలుకుచు నఖిలభూప్రజలు
దనుఁగొల్చి రా రఘూద్వహుఁడు264నాఁడేఁగి
తమసా నదీతీర 265తటమున విడిసి
తమసలో సాంధ్యకృత్యములెల్లఁదీర్చి[వా.రా. సర్గ 46]
తగుసౌధమున మృదుతల్పంబునందు
మొగిఁబవ్వళించు నా మోహనమూర్తి
తరుమూలమునఁబర్ణతల్పంబునందు
ధరణిజయును దానుఁదగ విశ్రమించి,
తనుఁజుట్టి పౌరులు దమయిండ్లు మఱచి
తనయుల భార్యలతగులు వోవిడిచి
వనములఁదనవెంట వచ్చువారగుచు
నినుపారు భక్తితో నిద్రింపఁ జూచి
వారల266మరలింప వలనొండు లేక
యా రాత్రి మధ్యంబునందు సుమంత్రుఁ
“దే రాయితముసేసి తెమ్మ”ని పలికి
పౌరుల వంచించు భావమాతనికిఁ
దెలిపి యయోధ్యకై267తేరు వోనిచ్చి
తలకొని మగుడించి తమస దాటించి
తృణశిలావృతభూమిఁదేరు దోలించి
గణుతింపరానివేగమునఁబోవుచును
దమరాకయును మహీధవునిచేఁతయును
దమకించి విని మనస్తాపంబు నొంది
తెరువుపల్లెలవారు ధృతిదూలి యేడ్చు
పరుసంపుటెలుఁగులు పలుమాఱు వినుచు
వనతతుల్‌ సీతకు వరుసఁజూపుచును
నినకులమణియైన యిక్ష్వాకునకును
మనువు మున్నొసగినమహిఁగనుంగొనుచుఁ
జని268వేగవతి దాటి సరయువు దాటి
నరనాథుఁడమ్మఱునాఁడు మాపటికిఁ
గరము వేగమున గంగానదిఁ జేరి
తడయక యింగుదీతరుసమీపమున
విడిసి యచ్చటఁబ్రీతి విశ్రాంతి నొందె.
నారయఁదమసలో నట నిద్రవోవు
పౌరులందఱును బ్రభాతంబునందుఁ[వా.రా. సర్గ 47-49]
గరమర్థితో మేలుకాంచి నల్‌దెసలు
పరికించి నివ్వెఱపడి శోకమెసగ
రామునిఁగానక రథము చొప్పరసి
“రాముఁడయోధ్యాపురమున కీ రాత్రి
యవనినాథుఁడు విల్వనంపిన మరల
భువనభారముఁబూనఁబోనోపు.”269ననుచు
నని యయోధ్యకు వచ్చి యచ్చట రాముఁ
గనుఁగొనఁ జాలక ఘనశోకవహ్ని
ననయంబుఁబొగులుచు“నకట!రాఘవుడు
మనలవంచించిక్రమ్మఱఁబోయె.”270ననుచు
నా రాముకృపయు సత్యంబు ధర్మంబుఁ
జారువర్తనము నిచ్చలు నుతించుచును
నితరవస్తువులపై నిచ్చలు మాని
యతనిఁదలంచుచు నతనిఁబాయుటకు
నంతరంగంబున271నడలుచునుండి.
రంత నక్కడ గుహుండను చెంచురాజు[వా.రా. సర్గ 50]

  1. పూన్కి
  2. యేశ్వరుని
  3. మీకొఱకు
  4. జనకనందనయు లక్ష్మణుఁడును దాను - జనులెల్ల (దముజూచి) దనుమూఁగి సందడింపఁగను
  5. ఁద్రావి
  6. యతివ
  7. ఁబూని
  8. జేశసుతుఁడు
  9. డటపోక
  10. దృష్టినిల్పి రథముఁజూచి చూచి
  11. రథము తప్పక చూచిచూచి
  12. మూర్ఛిల్లి యవనిపైఁ
  13. ఁబుడమికంపింపఁ-గర
  14. పౌరజనులు(సతులు)
  15. దేరి
  16. నడలు
  17. బొరలియాడుచును
  18. వేఁగుచు
  19. కనియె
  20. దన్నఁజత్తు మిత్తఱి మాకెల్ల నిదియచూ నిజము
  21. యిటు
  22. తానేఁగి
  23. తల
  24. మగుడింప
  25. తెరువు
  26. వేదవతి
  27. ఁదెలియ
  28. వనికి
  29. నలయుచు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )