ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
కాకాసుర కథ
303నొగిఁగంద304మూలాదు లుపహారమునకుఁ
దగ నాయితము సేయుతఱి నొక్కనాఁడు
కడఁకతో నొకదుష్టకాకంబు 305సేరి
యొడియుచు గాసిసేయుచు నున్నఁజూచి
సీత యా కాకిఁజెచ్చెరఁజోఁపఁజోఁప
నే తెఱంగునఁ బోవ కీడాడఁజూచి
కడునల్గి రాముఁడా కాకంబుమీఁద
వడి నిషీకముఁ306బుచ్చి వైచె; వైచుటయు
విడువక యది దానివెనువెంటఁదగులఁ
దడయక యది జగత్త్రయమును దిరిగి
“కావు కా,”వనుచు దిక్పాలుర బ్రహ్మ
దేవుని నమ్మహాదేవుఁ బ్రార్థింప
వారలు దమచేత వారింపఁ307బడక:
“శ్రీరాముశరణంబుఁజేరు.”మటన్నఁ
జనుదెంచి 308మఱి తనశరణుసొచ్చుటయు
ఘనమైనకృపతోడఁగాకంబుఁజూచి:
“నా యస్త్రమెందు నెన్నఁడు రిత్తవోదు;
నీ యంగ మొకటి దానికి నిచ్చిపొమ్ము.”
అనవుడుఁదననేత్ర మా యస్త్రమునకు
ఘనభక్తితో నిచ్చి కాకంబు వోయెఁ.
జెలఁగి రాఘవుఁడంత సీతచే నున్న
ఫలములు దేవతార్పణములు సేసి
యా యున్నఫలముల నందఱుఁదృప్తు
లైయుండి రిమ్ముల. నంత నక్కడను[వా.రా. సర్గ 57-60]

  1. ఁదనతోడ యొకనాఁడు తలయంపి(గడ)గాఁగ - నునిచి రాముఁడు గూర్క నుర్వీతనూజ, చనుఁగవ నడుచక్కిఁజంచునఁ బొడువ - ఘనశోణితం బొల్కఁగా నిద్రదేఱి; కడునల్గి… (ఇది మూలము ననుసరించినది. ఈ కాకాసురవృత్తాంతము మూలమున 95-వ సర్గయందుఁగలదు
  2. మూలంబు లాహార
  3. వచ్చి
  4. బట్టి
  5. బడునె-శ్రీరాముశరమన్న శ్రీఘ్రంబె మగుడఁ
  6. యది
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )