ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
సుమంత్రుఁ డయోధ్యకు వచ్చుట
రామువర్తనము లారయ మూఁడునాళ్లు
నేమించి గుహుచెంత నిలిచి మర్నాఁడు
309మలఁగనివగల సుమంత్రుండు సాల
నలయుచుఁజని యయోధ్యాపురంబునకు
సహజవైభవములు సర్వంబు310నెడలి
రహి సెడియున్న యా రాజమార్గమున
నరుగుచోఁబురజను లా రథధ్వనులు
పరికించి:“యిదె రామభద్రుండు వచ్చె.”
నని సుమంత్రునిఁజేర నరుదెంచి రథముఁ
గనుఁగొని రఘురాముఁగానక వగచి:
“క్రూరకర్ముఁడు రాముఁగొనిరాక311డించి
యీ రిత్తరథమేల యిటదెచ్చె.”ననుచు
గుంపులుగుంపులుగొని తన్నుదూఱ
సొంపేది రామునిసుద్ది సెప్పుచును
రాజగేహము సేరి రథమటు డిగ్గి
రాజున్న యంతఃపురంబున కరిగి
ధూళిగప్పిన మేనితో బాష్పపూర
లోలనేత్రములతో లోలోనఁ బొదలు
కడలేనివగలతోఁగౌసల్యయింటఁ
బడి ప్రలాపించుభూపతిఁ312గాంచి మ్రొక్కి:
“భూమీశ! మీ పుణ్యపుత్త్రరత్నంబు
రాముఁడు సత్యపరాక్రమశాలి
సౌమిత్రియును దాను జడలొప్పఁదాల్చి
తామసింపక గంగదాటి కాల్నడల
ననఘుఁడై చిత్రకూటాద్రికిఁబోయె.”
ననవుడు దశరథుఁడాత్మ శోకించి:
“యనఘ!సుమంత్ర!ర.”మ్మని చేరఁబిల్చి
తనయుచరిత్రమంతయుఁజాల నడిగి:
“గౌరవమతి నీవు గల్గితిగాన
మా రామ313చంద్రుసేమములెల్ల వింటిఁ.
గన్నుల కఱవు శోకంబును దీరఁ
జెన్నార నతనిఁజూచినఁగాని యకట!
తనువునఁబ్రాణముల్‌ ధరియింపఁజాలఁ;
గొనిపోయిరఘురాముఁగూర్పవే.”యనుడు:
“విను నీవు శ్రీరాము వెనుకొనిపోవఁ
గని ప్రజశోకించుఁ;గైక314దూషించు;
నిది విచారంబు గా;దిది బుద్ధిగాదు;
మది నింత వగువకు మనుజేశ! నీవు;
ధైర్యంబు315వదలకు; ధర్మంబు316నిలుపు;
మార్యులు గొనియాడననఘుండవగుము;
అఱలేక యడవుల నఖిలభోగములు
మఱచి నీ సుతులు నెమ్మది నున్నవార.’
లని పల్కిలక్ష్మణుఁడన్న వాక్యములు
వినిపించుటయును భూవిభుఁడు, శోకించి:
“సౌమిత్రిమాట నిజంబు; నేనట్టి
కామాంధుఁడను, క్రూరకర్ముండ,ఖలుఁడ.”
నని సుమంత్రుని317ఁబల్కి 318యటు వీడుకొల్పి
తనమది శోకించు319ధరణీశుఁజూచి:
“హారామ!హారామ!హారామ! యనుచు
శ్రీరాముఁబలుమాఱుఁజింతింపనేల?[వా.రా. సర్గ 61, 62]
యేల నటించెద? వీ లేనిశోక
మేల320తాల్చెద? వింతయెఱుఁగనే యేను?
నీవు లోకములలో నిందకు వెఱచి
యావలఁగైకేయి కన్నియుఁగఱపి
“రాముఁబట్టముగట్టి రాజుఁగావించి
భూమి యేలించెదఁబొగడొంద.”ననుచు
నడవులఁద్రోయించి తాలిచేఁబనిచి,
కడు321దుష్టుఁడవు; నీకుఁగలవె ధర్మములు?
తిట్టుపాటున కోడి తివిఱి నా కొడుకు
పట్టంబు మాన్పింపఁబనిచెఁగా కధిప!
సొంపేది రాముని స్రుక్కక కైక
చంపుమన్నను బట్టి చంపవే 322నీవు?
పెద్దగాలము నాకు బిడ్డలు లేక
పెద్దయు శోకించి పెక్కులు నోఁచి
కడపట నొక్కనిఁగని యేను గొంత
యుడుకాఱి యున్నచో నుండ నీవైతి.”

  1. మలుఁగని
  2. నుడిగి
  3. మరల-నీ
  4. జేరి
  5. చంద్రునిమాటలు
  6. కోపించు
  7. పరికింపు
  8. ఁబూను
  9. వేగ
  10. యతని
  11. దశరథు
  12. ప్రలాపించె దెఱుఁగవే నీవు
  13. గష్టుఁ
  14. యకట
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )