ఇతిహాసములు రంగనాథరామాయణము అయోధ్యాకాండము
దశరథ నిర్యాణము
ధీరత సెడి బుద్ధి దిరుగు408డువడియె;
నో రెండఁజొచ్చెఁ;గన్నులుగాన409రావు;
పలుకులు వినరావు; ప్రాణంబు లింక
నిలువ వీ యొడలిలో;410నిలువంగలేను.
నా పాలికల్పద్రు నా ధీసముద్రు
నా పరాక్రమరుద్రు నా గుణోన్నిద్రు
నా భాగ్యపదభద్రు నా రామభద్రు
శోభనగుణముద్రుఁ జూడలే నైతి.
నీ రాత్రితోఁగూడ నేడు నా ళ్లయ్యె
శ్రీరాముఁబాసి నా జీవమెట్లుండు?”
నని ప్రలాపించుచు“హారామ! రామ!”
యనుచు నంతనె మృతుండయ్యె నా రాజు.
“వనటల డస్సి భూవరుఁడు నిద్రించె.”
నని తాను నిద్రించె నంతఁ గౌసల్య.
411పరికింప నంతఁబ్రభాతమౌటయును
గరమర్థి వందిమాగధులు గీర్తింప[వా.రా. సర్గ 65]
దొరకొని మంగళతూర్యముల్‌ మ్రోయఁ
బురి412నెల్లరు ని 413యోగములవారు వచ్చి
ధరణీశదర్శనోత్కంఠులై యుండ:
“నిరవొప్ప నేఁ డేల యిన్నాళ్ళరీతి
దొర మేలుకొనఁ.”డంచు దొరకొన్నచింతఁ
బరిచారికలు వచ్చి పతి414సెజ్జడాసి:
“ధరణీశుఁడున్న చందము వోల.”దనుచు
నురుభయంబునఁబొంది యూరుపు లరసి
యడుగులుఁజేతులు415నంట్లంటిచూచి
యొడలఁబ్రాణములు లేకునికి భావించి
యందఱుఁ బెలుచ మహారోదనంబు
లందందసేయ 416దిగ్గన మేలుకాంచి
యదరి కౌసల్యయు 417నా సుమిత్రయును
బెదరి యందఱఁజూచి పృథివీశుఁజూచి
“హా”యని యెలుఁగెత్తి: హానాథ! నాథ!
పోయితే దశరథభూనాథ!” యనుచు
విలపింపఁగైకేయి విని రాఁగఁ జూచి
పలుమాఱు418నాపె పైఁబడి మోఁదుకొనుచు:
“గైక! నీ కోర్కులు గడముట్టె నేఁడు.
కైకేయి!419కలఁచితే కాకుత్స్థకులము?[వా.రా. సర్గ 66]
“నడవులపాలు గ.”మ్మని రాముఁద్రోచి
సడి కోర్చి దశరథేశ్వరుఁజంపుకొంటి.
నెలకొని యిటమీఁద నీవు నీ కొడుకు
నిలయెల్లఁ గైకొని యెలమి భోగింపుఁ.”
డనుచు నా కౌసల్య యాదిగా సతులు
తనుఁబేరుకొని యేడ్వఁ దలవాంచికొనుచు
నలిఁదూలి చనుదెంచి నాథుపై వ్రాలి
పలుదెఱంగులఁగైక పలవించుచుండె.
నా సమయంబున నడలు దీపింపఁ
గౌసల్య దశరథుఁ గనువిచ్చి చూచి:
“ధరణీశ! నీ యట్టి ధర్మానురూప
చరితున కీ చావు సమకూరఁదగునె?
మోసపోయితి నిన్ను ముదలింపలేక;
నీ సత్యసంపద నిన్నింతసేసెఁ.
గడుఁగష్టమతియైన కైకేయి 420గడఁగి
యడవికి రాముఁబోనడచిన వగపు
పరికించి నీ కేను బరిచర్య 421సేసి
422తరియింపఁజూచితి; దైవ మీదయ్యె.
నీ యిచ్చ 423నోకుండ నీ పంపు సేసి
పోయి సత్కీర్తులు పొందె రాఘవుఁడు;
నెల424కొన్న సత్యంబు నీవు వాటించి
బలిసి నిలింపసంపదలు గైకొంటి;
ధరణీశ! నాకు నుత్తముఁడైన నిన్నుఁ!
బరుసంబులాడినపాపంబు దక్కె.”
నని నాథుఁబలవింప నా సుమిత్రాది
వనితలు నెలుఁగెత్తి వాపోవుచుండి.
రంతంత నీ వార్తలంతట మ్రోసె
నంతసూర్యోదయంబయ్యె;నౌటయును[వా.రా. సర్గ 67, 68]
జేరువనృపులు వసిష్ఠాదిమునులు
ధారుణీసురులుఁబ్రధానులు వచ్చి
భూరిశోకంబునఁబొగుల వసిష్ఠుఁ
డారూఢమతి మంత్రులనుమతిసేయఁ
దడయక దశరథధరణీశు మేనుఁ
గడఁకతోఁదైలపక్వంబు సేయించి
చెలువైన మణిమయ సింహాసనమునఁ
గొలువున్న తెఱఁగునఁగూర్చుండఁబెట్టి
మంత్రుల సకలసామంతుల రాజ
తంత్రజ్ఞు425లను గూర్చి తగవొప్పఁబలికె:
“నీ రాజు సామ్రాజ్యమెల్లఁబాలించి
స్వా రాజునగరికిఁజనియె నేఁడకట!
యితనిపూనికిఁదీర్ప నింతియుఁ దాను
హిత426మతి427మఱి రాముఁడేఁగె గానలకు;
భరతుండుఁదమమామ పట్టణంబునకు
నరిగె శత్రుఘ్నసహాయుఁడై మున్నె.
మనము రామునిఁబిల్వ మగుడిరాఁడతఁడు
తన పూన్కి దీర్పక ధర్మ 428వర్తనుఁడు.

  1. చున్నదియు
  2. వయ్యె
  3. నిలువలే నేను
  4. పరికించియంత
  5. నెల్లవిని
  6. మంత్రిపుంగవుల్‌
  7. సజ్జ
  8. నంటంటి
  9. చయ్యనఁ
  10. నంతరంగమున
  11. ఁగైకేయిపై మోదు
  12. చెఱచితే
  13. ఁజూచి
  14. సేయ
  15. భరియింపలే నైతిఁ బార్థివోత్తంస!
  16. లోనుండ, చెడకుండ
  17. కొని
  18. ఁడపుడు మంతనమునఁ
  19. వృత్తిమై
  20. యై
  21. వర్ధనుఁడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )