ఇతిహాసములు రంగనాథరామాయణము బాలకాండము
సంగ్రహరామాయణము
ఘనుఁదపస్స్వాధ్యాయకమనీయశీలు[వా.రా. సర్గ 1]
మునినాథు నారదముని లోకవంద్యు
ననఘతపోనిధియైన వాల్మీకి
గనుఁగొని యొకనాఁడు గరమర్థి నడిగె:
“నెవ్వఁడు శ్రీమంతుఁ, డెవ్వఁడు దాంతుఁ
డెవ్వఁడు సువ్రతుం, డెవ్వఁడున్నతుఁడు;
ఎవ్వఁడు నీతిజ్ఞుఁ,డెవ్వఁడు ప్రాజ్ఞుఁ,
డెవ్వఁడు దుర్దముం,డెవ్వఁడుత్తముఁడు;
ఎవ్వఁడు జితకోపుఁ, డెవ్వఁడజేయుఁ
డెవ్వఁడు నిరసూయుఁ, డెవ్వఁ డాఢ్యుండు
ఎవ్వఁడు ఘనపుణ్యుఁ,డెవ్వఁడు దారుఁ
డెవ్వఁడు సుచరిత్రుఁ, డెవ్వఁడు సముఁడు
ఎవ్వనికిన్కకు నింద్రాదిసురలు
దవ్వుదవ్వులయందుఁ దలఁకుచుండుదురు
అట్టివాఁడిలఁబుట్టి యరిగెనో యిపుడు
పుట్టెనో యిటమీఁదఁ బుట్టనున్నాఁడొ”
అనినఁ ద్రిలోకజ్ఞుఁడైన నారదుఁడు
దన బుద్ధినెంతయుఁదలపోసి చూచి
“ఈ మహిపై విష్ణుఁ55డిపుడు జన్మించె
రాముఁడై దశరథరాజున;56కతఁడు
నియతాత్ముఁడతిశౌర్యనిధి, కృపాజలధి,
జయశాలి, స్వజనరక్షణవిచక్షణుఁడు,
కంబుకంధరుఁడు, సక్కనిమేనివాఁడు,
బింబారుణోష్ఠుండు, పీనవక్షుండు,
వెడఁదకన్నులవాఁడు,విపులాంసతలుఁడు,
నిడుదచేతులవాఁడు, నియతవర్తనుఁడు,
వేదవేదాంగకోవిదుఁడు, కోదండ
వేదవిదుండు వివేక భూషణుఁడు
కమలాప్తు తేజంబుఁ, గడలిగాంభీర్య
మమరాద్రిధైర్యంబు, నవనిసైరణయు,
ధనదునిత్యాగంబుఁ దనయందు మిగుల
ననువొందునిత్యకల్యాణవిగ్రహుఁడు
కౌసల్య కానందకరుఁడట్టి రాము
నాసక్తి యౌవరాజ్యాభిషిక్తునిఁగఁ
బట్టంబుగట్ట భూపతి సమకట్టఁ
గట్టిఁడి కైక సంగరమునఁ దొల్లి
రెండువరంబు లర్థించిన దౌటఁ
జండించి కాననస్థలికి రాఘవునిఁ
బనిచిన జనకునిప్రతినకై పూని
జనకజాలక్ష్మణసహితుఁడై 57వెడలి
తేవనంబునను నెంతేవనంబునను
బావనమునిచర్యఁబరగుసంయములఁ
గరుణమైఁగాపాడి ఖరదూషణాది
శిరములు శరములఁజెండుబెండాడి
ఋశ్యమూకంబున నినజుఁజేపట్టి
వశ్యత నొకకోల వాలిఁదూలించి
సీతకై చలపట్టి సేతువు గట్టి
పాతకి దశకంఠుఁ బరిమార్చి యంత
సీతతోఁగూడి యాశ్రితలోకపారి
జాతంబు వనచరజాతంబు గొలువ
నింద్రాదివినుతుఁడై యేతెంచి రామ
చంద్రుండు నిజపూజ్యసామ్రాజ్యలక్ష్మిఁ
బాలించుచున్నాఁడు ప్రజలకు వేడ్కఁ
గీలించుచును గృతకృత్యుఁడై” యనుచు
నా రాముచరిత మాద్యంతంబుసెప్పి
నారదముని వోయె నలినజుపురికి[వా.రా. సర్గ 2]
మునిపతి వాల్మీకి ముదముతో నంతఁ
దన శిష్యుఁడగు భరద్వాజుండుఁదానుఁ
బ్రకటింప సజ్జనభావంబపోలె
నకలుషజీవనంబై కరంబలరు
తమసానదికిఁ బోయి తన్నదిఁదోఁగి
తమయనుష్ఠానముల్‌దగఁ 58జేయుచుండి
యా యేటిదరిఁ 59గొంచలర్థిమై రెండు
గాయజుకేళిమైఁగవయుచో నొకటి
నొక బోయ సంపిన నున్నక్రౌంచంబు
ప్రకటశోకంబునఁ 60బనవుట సూచి61
“యోరినిషాదుండ! యోరి పాపాత్మ!
యోరి, నీ కెగ్గేమి యొనరించెఁదొల్లి?
కామించి క్రౌంచముల్‌ గవయుచో నొకటి
నేమిటికై చంపి తిబ్భంగిఁగడఁగి?
ఈ పాపమున నీ వనేక దుఃఖములు
ప్రాపించి తిరుగుము బహువత్సరంబు”
లని బోయ శపియించి యంత వాల్మీకి
దన శిష్యుఁడగు భరద్వాజునిఁజూచి
“ఛందోనిబద్ధమై సమవర్ణపంక్తిఁ
బొంది నాలుగుపాదముల హృద్యమగుచు
నిది చాలవిస్మయం బీ శాపవాక్య
పదములు దమయంతఁ బద్యమై పొలిచె”
ననిన భరద్వాజుఁడాదిగా శిష్యు
లనురక్తిఁబఠియించి రా పద్యమంత;
ననఘుండు వాల్మీకి యాశ్రమంబునకుఁ
62జనియున్నచో బ్రహ్మసనుదెంచుటయును
నెదురేఁగి పదముల కెఱఁగి తోడ్తెచ్చి
కుదురుగాఁ గుశపీఠిఁగూర్చుండఁబెట్టి
కరమర్థిఁబూజించి కరములు మొగిచి
పరగ శాపాక్షర పద్యంబుఁజదువ
విని బ్రహ్మనగి “పద్యవిషయమై వాణి
యనఘ! నీ ముఖమున నవతరించినది.
శ్రీరాముచరిత మశేషంబు నీకుఁ
63గోరి నారదుఁడు సంకోచించి చెప్పె
నది విస్తరించి నీ వర్థితోఁజెప్పు
మది సర్వమును దోచు” నని చెప్పిచనియె
నీ రీతిఁగృపవరంబిచ్చి మన్నించి
సారసగర్భుండు సనినపిమ్మటను[వా.రా. సర్గ 3]
మఱి నిర్మలధ్యానమతిఁబూని మౌని
దఱిగొని సకలంబుఁ దలపోసి 64పోసి
రఘుచరిత్రము దశరథుచరిత్రంబు
రఘురాముజన్మంబు రామువర్తనము
తాటకవధయు నుద్దండరాక్షసుల
యాటోపహరణంబు యజ్ఞరక్షణముఁ
దనరుగంగామహత్త్వమును గౌతముని
వనితను శాపంబువలనఁ బాపుటయు
ధనువు ద్రుంచుటయు సీతావివాహంబుఁ
జనుచోట జమదగ్నిజాతునాగ్రహము
రామాభిషేకసంరంభంబు 65దుష్ట
కామిని కైకేయి కష్టభాషణము
నభిషేకవిఘ్నంబు నడవికి రామ
విభుఁడు వోవుటయు భూవిభుఁడడలుటయుఁ
దశరథుమరణంబు దశరథరాముఁ
గుశలసంభాషియై గుహుఁడు గాంచుటయు
నురుపుణ్యులట గంగ నుత్తరించుటయు
వరమునీశ్వరు భరద్వాజుఁగాంచుటయు
నరిగి యా చిత్రకూటాద్రి నిల్చుటయు
భరతుండు రఘురాముపజ్జ వచ్చుటయు
నన్నచేఁబాదుక లర్థిమైఁబడసి
మన్ననలింపొంద మరలిపోవుటయు
దండకా గమనంబుఁ దగిలి విరాధుఁ
జండవిక్రమమున సంహరించుటయుఁ
బరమపుణ్యుఁడు శరభంగుదర్శనముఁ
బరువడి మునులకుఁ బ్రతిన లిచ్చుటయుఁ
జని యా యగస్త్యునాశ్రమముఁజొచ్చుటయు
మునిచేత దివ్యాస్త్రములు వడయుటయు
స్రుక్కక రామానుజుండు శూర్పణఖ
ముక్కును జెవులును మ్రోడుసేయుటయు
నది వోయి ఖరదూషణాదిరాక్షసుల
కది సెప్ప వారంత నలిగి వచ్చుటయు
నురువడి రఘురాముఁడొక్కఁడే కడఁగి
ఖరదూషణాదిరాక్షసులఁ జంపుటయు
నట రావణునిబుద్ధి నలుక వుట్టుటయుఁ
గుటిలమారీచుండు గ్రొవ్విసచ్చుటయు
నసురాధిపతి సీత నపహరించుటయు
విసువక రాముండు విలపించుటయును
నని జటాయువుచావు నవలఁగబంధుఁ
గనుటయు మఱి పంపకడకుఁబోవుటయుఁ
గరమర్థి ఋశ్యమూకమున సుగ్రీవుఁ
డరుదెంచి కనుటయు నతనిసఖ్యంబు
వాలిసుగ్రీవుల 66వైరంబు తెఱఁగు
వాలి నొక్కమ్మున వధియించుటయును
దారా విలాపంబు దశరథసూనుఁ
డా రవిసూను రాజ్యమున నిల్పుటయు
మానవపతి యంత మాల్యవంతమున
వానకాలంబెల్ల వసియించుటయును
గాకుత్స్థుకోపంబుఁ గపిసమాగమము
నేకతంబున 67ముద్రయిచ్చిపుచ్చుటయు
నలయక కపులు సీతాన్వేషణంబు
సలుపుటయును బిలసందర్శనంబు
68నక్షతంబుగ మహేంద్రాద్రి యెక్కుటయుఁ
బక్షీంద్రుఁడైన సంపాతిఁగాంచుటయు
వనధిలంఘనమును వనధిమధ్యమునఁ
జనుచోట మైనాక సందర్శనంబు
మదమెత్తి సింహిక మారుతసూనుఁ
గదిసి చచ్చుటయు లంకాప్రవేశంబు
నంతఃపురంబెల్ల నతఁడరయుటయు
69నంత నశోకవనావలోకనముఁ
దెఱఁగొప్ప నందు వైదేహిఁగాంచుటయు
నెఱుకకు నానవాలిచ్చి తేర్చుటయుఁ
భూనాథుకుశల మింపుగఁ దెల్పుటయును
మానినీమణి శిరోమణి యిచ్చుటయును
బెనఁచి యా వనమెల్లఁ బెఱికివైచుటయు
హనుమంతుఁడత్తఱి నక్షుఁజంపుటయుఁ
బవనజుఁడటు పట్టుపడిపోవుటయును
గవిసి లంకాపురిఁ గలయఁ గాల్చుటయు
మారుతాత్మజుఁడబ్ధి మరల దాఁటుటయు
వారక కపులతో వచ్చి కూడుటయు
మధువనహరణంబు మణి ప్రీతినొసగ
నధిపతి మారుతి 70నగ్గలించుటయు
నినకులాధిపుఁడు దండెత్తి పోవుటయు
వననిధితటమున వచ్చి నిల్చుటయు71
నంత విభీషణుఁడధిపుఁగాంచుటయుఁ
జింతించుటయు మఱి సేతుబంధనముఁ
జడధి దాఁటుటయును జని లంకమీఁద
విడిసి పేర్చుటయు దోర్వీర్యంబు మెఱసి
కర 72ముగ్రులగు కుంభకర్ణాది వీర
వరులఁజంపుటయు రావణునిఁ ద్రుంచుటయు
నా విభీషణుని లంకాధినాయకునిఁ
గావించి పట్టంబు గరుణఁ గట్టుటయు
ననుపమ 73శుద్ధి బ్రహ్మాదులు మెచ్చ
జనకజ రఘురామచంద్రుఁ 74జేరుటయు
నెలమిఁబుష్పకమెక్కి యెందును గీర్తు
లలర నయోధ్యకు నరుగుదెంచుటయు
భరతుఁగాంచుటయును బట్టాభిషేక
మరుదార రఘురాముఁడవధరించుటయుఁ
గపి 75దైత్యపతుల నర్కజవిభీషణుల
విపులసంపద లిచ్చి వీడుకొల్పుటయుఁ
బరికించి ప్రజల నాపదలొందకుండఁ
గరుణఁబ్రోచుట యనుకథలెల్లఁ 76దెలిసి
వెలయ నిర్వదినాల్గువేల శ్లోకములు
గలిగి యేనూఱుసర్గల విస్తరిల్లి[వా.రా. సర్గ 4]
కాండంబు లాఱింటఁ 77గర మొప్పుమిగిలి
యుండ రామాయణ 78మోలిఁగావించి
యొనరఁ దక్కిన కథ లుత్తరకాండ
మునఁ జెప్పి వాల్మీకి 79ముదముతో నంత
“నీ కథఁ బఠియింప నెవ్వరునేర్తు?
రీ కథ జగముల నెబ్భంగిఁ 80బరగు?”
ననుచుండఁ గుశలవు లనఘమానసులు
మనసిజాకారులు మంజుభాషణులు
జననుతుల్‌ సంగీతసాహిత్యనిధులు
మునివేషధారు లిమ్ముల వచ్చి మ్రొక్కి
“యనఘ! రామాయణ మర్థితోఁజదువఁ
జనుదెంచితిమి మమ్ముఁజదివింపవలయు”
ననిన సంతోషించి యమ్మునీశ్వరుఁడు
తన మనోరథమెల్లఁ దలకూడె ననుచు
గేయమై పాఠ్యమై కేవల పుణ్య
దాయకంబగు రఘూత్తముచరిత్రంబు
ననుపమ తంత్రీలయాన్విత ఫణితి
మునిపతి సదివింప ముదమొప్పఁజదివి
రమణ శృంగారాది రసములుప్పొంగ
సమవృత్తభేదముల్‌ సంధిసమాస
సమధికశబ్దార్థ సంగతులెఱిఁగి
క్రమమొప్పఁ బాడుచుఁగవగూడి వారు
మునిజనసభల నిమ్ములఁబూజనములు
గొని వినోదింపఁ గాకుత్స్థవల్లభుఁడు
వెలయఁదమ్ములుఁ దాను వేడ్కలింపొందఁ
గొలు 81విచ్చి వారలఁగోరి 82రావించి
వారి రూపంబులు వారి నిల్కడలు
వారి నిర్మలతర 83స్వరవిశేషములుఁ
దనకు నింపొదవింపఁ దత్కథాక్రమము
వినుచుండె రాముఁడవ్విధ మెట్టిదనిన:

  1. డింకజన్మించు
  2. కనుచు
  3. పోయి
  4. దీర్చివచ్చి
  5. గ్రౌంచయమళంబుప్రేమఁ
  6. బనువుట
  7. తగవును ధర్మంబుఁ దలపోసిమౌని-పగదాయ నబ్చోయపై నల్క వొడమి- యోరినిషాదుండ…
  8. జనినయచ్చో
  9. జేరి నారదుఁడు సంక్షేపించి
  10. చూచి
  11. దోష…
  12. వైరవర్తనము
  13. నుంగ్రమిచ్చి
  14. నక్షయంబగు, నక్షణంబున
  15. వంతుకెక్కు నశోకవనముఁజొచ్చుటయు
  16. నాశ్వసించుటయు
  17. పనివడి వారిధిఁబ్రార్థించుటయును-గొనకొని రావణుఁగోపించుటయును, నిన కులా…
  18. ముగ్రముగఁగుంభ
  19. స్థితిని
  20. బొందుటయు, గూడుటయు
  21. సైన్య
  22. దెలియ
  23. గడునింపు
  24. మొప్పఁ
  25. మునినాథుఁడంత
  26. నెగడు
  27. వుకు,వుండి
  28. రప్పించి
  29. వాగ్విశేషములు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )