ఇతిహాసములు రంగనాథరామాయణము బాలకాండము
పుత్త్రకామేష్టిచింత
ప్రకట రాజ్యాంగ 90సంపదఁదేలితేలి
యొకనాఁడు దశరథుండుల్లంబులోనఁ[వా.రా. సర్గ 8]
దనకు సంతతి లేమిఁదలపోసి 91వగచి
తన మంత్రివరులనందఱఁజూచి పలికెఁ:
“బెక్కుదానంబులుఁబెక్కు ధర్మములుఁ
బెక్కుయాగంబులుఁబెక్కువఁజేసి
పెక్కేండ్లు మంటి;92శోభితకీర్తిఁగంటి;
మక్కువ మీవంటిమంత్రులు గలుగఁ
గొదవలే దేమిటఁ గొడుకులులేని
కొదవ యొక్కటిగాని; కుల ముద్ధరించు
కొడుకులు లేకున్నఁగోటిపుణ్యములఁ
బడయరుత్తమలోక 93పదములెవ్వారుఁ;
గాన పుత్త్రులఁగానఁగా నాకు వలయుఁ
గాన యేనింక లోకములెల్ల మెచ్చఁ
దలకొని యశ్వమేధము సేసి పిదప
నెలమితోఁబుత్త్రకామేష్టి 94సేసెదను.”
అని తగుపనులకు నందఱఁబనుప
ననఘులు మఱి వసిష్ఠాదులు వచ్చి
“యలవడ నీచేయు హయమేధమఖము
నెలకొని యే మింక నిర్వహించెదము;
మది నెన్నశక్యమే మఖరాజమహిమ.
యిదిగాక పుత్రకామేష్టియుఁ జేయఁ
దనయులఁగాంచెదు ధన్యమానసుల.”
ననవుడు హర్షించి యవనినాయకుఁడు
నందఱఁబనిచి శుద్ధాంతంబు సొచ్చి
సుందరీమణుల కా శుభవార్తఁదెలిపి
యనురక్తి నేకాంతమై యున్నవేళ
ననఘుండు సూతుఁడిట్లనియె భూపతికి:[వా.రా. సర్గ 9, 10]
“ధరణీశ! నీకు సంతానసంప్రాప్తి
వెరవైన కథ మున్ను విన్నాఁడ నేను;

  1. సంపన్నుఁడైయుండి
  2. పోసి
  3. ప్రబ్బినకీర్తులంటె
  4. పదవు, పథము
  5. వేల్చెదను
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )