ఇతిహాసములు రంగనాథరామాయణము బాలకాండము
దశరథ యజ్ఞదీక్ష
యాగవాటముసొచ్చి హయమువచ్చుటయు
యాగ 117దీక్షవహించి యతిశుద్ధిఁబొంది
మును వసిష్ఠాదుల మునిజనోత్తముల
ఘనుల ఋత్విక్కులుగా వరియించి
సవనత్రయం118బభిషవము నొనర్చి
ప్రవిమలయూపాగ్రబద్ధంబులైన
జలచరంబు లరణ్యచరములు విహగ
ములు నురగంబులు మొదలుగా నొప్పు
పశువుల మున్నూటిఁబ్రథితాశ్వ మొకటి
విశసించి క్రతుకర్మవేదులు వ్రీతి
నే మంత్రములతోడ నే పలలములు
గామించి వేలువఁగాఁజెప్పు శ్రుతులు
నా మంత్రములతోడ నా పలలములు
గామించి వేల్చిరి ఘనులు ఋత్విజులు;
అనలుండు సప్తజిహ్వలఁబ్రజ్వరిల్లె;
ననిమిషుల్‌ దనిసి రాహవిరాదికముల;
నా యాగదినముల నాఁకొన్నవాఁడు
నాయాసపడినవాఁ డరసినలేఁడు
సారమృష్టాన్న వస్త్ర పటీర కనక
హీరభూషాదిసంతృప్తులేకాని,
యే క్రియలందును నెడపడకుండ
నీ క్రియ హయమేధ మీ డేరుటయును
వెనుక జ్యోతిష్టోమ విశ్వజిదాది
ఘనయాగతతులు సాంగముగా నొనర్చి119
యధ్వరదక్షిణకై పూర్వదేశ
మధ్వర్యునకును బ్రహ్మకు దక్షిణంబుఁ
బొనరంగఁబశ్చిమభూమి హోతకును
దనర నుత్తరము నుద్గాతకు నిచ్చె.
నిల నయోధ్యయుఁదక్క నెల్లదేశములు
నలరి యిచ్చిన ముదమంది ఋత్విజులు
“నెప్పుడేలుదుము నీ విచ్చిన 120దేశ?
మెప్పుడనుష్ఠానమేము సేయుదుము?
121ఏ మేడ? దేశంబులేలుట యేడ?
భూమికి వెల యిమ్ము భూమీశ! మాకు.”
ననవుడుఁ బదిగోటులగు సువర్ణములుఁ
గనకంబు నలుమడిగల ధౌతచయముఁ
గోరంగఁదగు లక్షగోవులు నిచ్చె.
నా ఋశ్యశృంగాదులైన ఋత్విజులు
నవి వంచుకొని ముదమందిరి. మఱియుఁ
బ్రవిమలాధ్వరకర్మపరిచారకులకు
నరనాయకుఁడు సువర్ణములు గోటియును
వరభూషణంబులు వలయువారలకుఁ
గామితార్థంబులు గామించువారి
కేమి వాక్రుచ్చిన నింపార నిచ్చి
పరగ భూసురులకు భక్తితో మ్రొక్కి
వరుస వారిచ్చుదీవనలు గైకొనుచుఁ
బ్రకటదివ్యాంబరాభరణాదులొసగి
యకలంకచిత్తుఁడై యవభృథంబాడి
శ్రీమహితుఁడు ఋశ్యశృంగుచేఁబుత్త్ర
కామేష్టిఁజేయింపఁగా నంత వచ్చి[వా.రా. సర్గ 15, 16]
క్రమమొప్ప యాగభాగములు గైకొన్న
యమరులు రావణు నాత్మలోఁ దలఁచి
బ్రహ్మఁగనుంగొని ప్రణమిల్లి నిలిచి
“బ్రహ్మ! నీ వరశక్తిఁబంక్తికంధరుఁడు
ప్రవిమలాచారుల బ్రహ్మర్షివరుల
దివిజుల మునుల బాధించుచున్నాఁడు.
దారుణవరశక్తిఁ దగిలి మా చేత
వారిజాసన! వాఁడు వారింపఁబడఁడు.
సురగణంబులతోడ సుత్రాముఁబట్టి
పరిభవించుచు నేఁచు బాహుదర్పమున;
గంధర్వ122యక్షాదిగణముల మునుల
బంధించు; సాధులఁబట్టి బాధించు.
వాఁడన్నఁగులగిరుల్‌ వడవడ వడఁకు;
వేఁడిమి సూపఁగ వెఱచు భాస్కరుఁడు;
వీఁకతో ననలుండు వెలుఁగ శంకించుఁ
దేఁకువసెడి గాలి దిరుగంగ వెఱచు;
నన్నిశాచరుఁగన్న నాటోపమెసగ
మున్నీరు కడ123లెత్తి మ్రోయంగ వెఱచు;
నేపునఁగన్నప్పుడెల్ల మమ్మేఁచుఁ
బాపాత్ముఁడగు నట్టి పంక్తికంధరుని
నంతంబు నొందించు నా యుపాయంబుఁ
జింతింపవలయు నీ చిత్తంబులోన.”
ననవుడు నా తెఱంగంతరంగమునఁ
గని బ్రహ్మ మునిదేవగణము నీక్షించి:124
“యమరులచేఁజావఁ; డసురులచేత
సమయఁడు; గంధర్వసమితిచేఁజెడఁడు;
రజనీచరులచేతఁగ్రాఁగఁ డెన్నఁడును;
భుజగసంఘములచేఁబొలియడు వీఁడు;
యక్షులచేఁద్రెళ్లఁ డాలంబులోనఁ;
బక్షియూధంబుచేఁబడఁడు; వానికిని
వరమిచ్చునప్పుడు వాక్రువ్వఁడయ్యె
నరులఁ; గావున వాఁడు నరులచేఁజచ్చు
విశదంబుగా నింక వినుఁడు: హిరణ్య
కశిపుఁడు లోకముల్‌ గారించునాఁడు
నరసింహరూపంబు నారాయణుండు
ధరియించి వాని విదారించినాఁడు;
వాఁడెవీఁడై విశ్రవసునకుఁబుట్టి
నాఁడు గావున నేఁడు నారాయణుండు
వీని నిర్జించు; నవ్విష్ణుని నభయ
దానంబు 125మనకింకఁదగ వేఁడవలయు.”
నని దేవతలతోడ 126నటువల్కుతఱిని
వనజమిత్రునిమీఁది వనదంబుఁబోలి
గరుడాధిరూఢుఁడై కరపంకజముల
సరిసుదర్శనపాంచజన్యాదులమర,
నురమున శ్రీదేవి యొద్దికఁబరగ
స్థిరలీలఁగౌస్తుభశ్రీ సెన్నుమిగుల,
భువనకారణునకుఁ బుట్టినిల్లైన
నవవికసితనాభినలినంబు వెలుఁగఁ,
గుక్షి జగంబులు గొమరొప్పుచుండఁ,
బక్షీంద్రకేతువు పటుగతి మెఱయ,
సరిదివారాత్రముల్‌ సందడిఁబొరయఁ
గరమొప్పు రవిశశుల్‌ గన్నులై చెలఁగ,
ననిమిషవర్యు లందంద మ్రొక్కంగ,
సనకాదిమునివరుల్‌ సన్నుతుల్‌ సేయఁ,
గలసి విద్యాధర గంధర్వసంఘ
విలసితగానముల్‌ వేడుకఁ జెలఁగఁ,
బీతాంబరం బొగిఁబృథుతటిల్లతిక
భాతిమై నమరంగఁ బంకజోదరుఁడు
భానుకోటిప్రభా భాసితుండగుచు
మేనికాంతులు దిశల్‌ మిఱుమిట్లుగొలుపఁ
గువలయహితబింబ గురుకాంతిఁదెగడి
ధవళాతపత్రంబు దళతళ మెఱయ,
వినువీధిరాఁగ నవ్విష్ణునిఁ గాంచి
ఘనభక్తితో నమస్కారముల్‌ సేసి
వినయసంభ్రమములు వెలయ నిట్లనిరి:
“కనకాక్షశిక్ష! లోకత్రయాధ్యక్ష!
వనజాలయావక్ష! వసుమతీరక్ష!
వనజాక్ష! మాకు నెవ్వరు లేరు దిక్కు!
నీ వొకండవు దక్క; నిక్క మీ మాట.
గోవింద! పరిపూర్ణగుణ! చిదానంద!
దేవ! జగన్మయ! దేవాదిదేవ!
దేవనిస్తారక! దివ్యావతార!
శుభమూర్తి!శరణంబుఁజొచ్చినఁ127గరుణ
నభయమిచ్చితి 128గాదెయమృతాబ్ధిఁదొల్లి.129
తలపోయ దానవదళన! నీ బాహు
బలవిక్రమంబులఁ బరగు లోకములు.
భక్తవత్సల! నిన్నుఁ130బరికింప 131నగునె
భక్తియోగముదక్క బయలుమాటలను?
మధు నిషూదన! నిన్ను మదిలోనఁదలఁచు
నధికపుణ్యులకెందు నాపదల్‌ గలవె?
జగదుద్భవస్థితి సంహారకృతులు
దగ వినోదంబులై తనరు నీ మాయ.
నాధారభూతమై యఖిలలోకముల
మాధవ! తాల్చు నీ మహనీయతనువు.
అహిరాజతల్ప! నీ యమితవైభవము
మహిమ సూడఁగ నవాఙ్మానసగోచరము.
శరణాగతప్రియ! సర్వలోకేశ!
శరణార్థులగుమమ్ముఁ జనుఁగావ నీకుఁ
గావునఁ ద్రైలోక్యకంటకుండైన
రావణుఁబొలియించి రక్షింపు మమ్ము.
మా కొకకార్యంబు మసలక చేసి
లోకకీర్తులఁబొందు132 లోకైకవినుత.
నిర్మల 133చిత్తుండు నిశ్చలవ్రతుఁడు
ధర్మశీలుండు నుత్తమగుణాన్వితుఁడు
నగుచున్నదశరథుఁ డశ్వమేధంబుఁ
దగఁజేసి మఱి శుచిత్వమున నున్నాఁడు.
కాకుత్స్థతిలకునికాంతలు దలఁప
134హ్రీకి శ్రీకిని గీర్తి కెనవత్తు; రందు
నరమూర్తులొప్పంగ నాలుగంశముల
సరసిజోదర! నీవు జనియింపవలయు.
వరశక్తి సురల కవధ్యుఁడై లోక
పరితాపకరుఁడైన పంక్తికంధరుని
మునుల గంధర్వకింపురుషుల సురలఁ
బనివడి నొంచిన పాపాత్ముఁజంపి
సవనముల్‌ సేయింపు సకలసంయముల;
భువనముల్‌ రక్షింపు పుండరీక్షాక్ష!”
యని విన్నపముసేయు నమరులఁజూచి
135వనజనాభుండంత వారితో ననియె:
“సురలార! మీ రింక సుఖమున నుండుఁ
డరిగి మర్త్యమున నే నవతారమొంది
యాదట బంధు136పుత్త్రామాత్య పౌత్త్ర
సోదరయుతు దశాస్యుని గీటడంచి
నిండార నేలెద నియతితోఁ బదునొ
కొండు వేలేఁడులు గుంభినీతలము.”
ననుచు వరంబిచ్చి యజుని వీడ్కొలిపి
యనిమిషు137ల్‌ నుతియింప నసురారి సనియె.
నప్పుడు విమలహోమాగ్నిలోనుండి
యొప్పెడు పుణ్యాత్ముఁడొక దివ్యమూర్తి
హరినీలనీలాంగుఁ డరుణాంబరుండు
తరుణార్కతేజుఁ డుదగ్రవిక్రముఁడు138
పరగఁబాయసముతోఁబసిఁడిపాత్రంబుఁ
గరమున ధరియించి గ్రక్కున వెడలి
తనుఁజూచి యద్భుతాదరమున లేచి
వినయాఢ్యుఁడై యున్నవిభుని వీక్షించి:
“భూనాథ! విను యజ్ఞపురుషుండ; సుతుల
నేను నీ కీఁగోరి యేతెంచినాఁడ;
నాదట నీ పాయసాన్నంబు పంచి
నీ దేవులకుఁబెట్టు నిష్ఠతో.” నన్న
ననురాగమునఁబొంది యవనీశుఁడతని
ననయంబుఁబూజించి యా పాయసంబుఁ
దా నందుకొనియె సుధాకలశంబుఁ
జే నందుకొన్న శచీపతి మాడ్కి.
నంతఁబ్రాజాపత్యుఁడటుమాయమైన
నంతఃపురంబున కరిగి భూవిభుఁడు
రమణు లెదుర్కొని ప్రమదాబ్ధిఁదేల
నమరనిర్మితమైన యా పాయసంబు
సగము గౌసల్యకు సగములోఁబుచ్చి
సగము సుమిత్ర, కా సగములో సగముఁ
గైకకు నిచ్చి యుత్కంఠ నా సగముఁ
బ్రాకటంబుగ సుమిత్రకు నిచ్చె; మఱియు
నప్పాయసాన్నంబులర్థి భుజించి
యప్పుడు గర్భిణులైరి వారెలమిఁ.
దగిలి వారలఁజూచి దశరథేశ్వరుఁడు
మిగుల నానందించి 139మెచ్చుచు మఱియు
మొగి ఋశ్యశృంగాదిమునుల భూపతులఁ
దగునర్చనములిచ్చి తగ వీడుకొల్పి
పరమానురాగుఁడై పడఁతులుఁదాను
ధరణీశుఁడపు డయోధ్యకు నేఁగుదెంచెఁ.
దమ యాగభాగముల్‌ దగిలి గైకొన్న
యమరులు దమలోక మరిగెడుచోట[వా.రా. సర్గ 17]
నా కంజ140గర్భుఁడింద్రాదులఁజూచి:
“లోకరక్షణకళాలోలుఁడై శౌరి
ధారుణిపై నవతారంబు సేయ
మీరును దోడ్పాటు మేకొనవలయు;
నటుగాన లోకహితార్థవర్తనులఁ
బటుపరాక్రమరూపబల141పయోనిధుల
బలగర్వముల మిమ్ముఁబ్రతివోల్పఁజాలు
బలియుర వానరపతులఁబెక్కండ్రఁ
గిన్నర గంధర్వ ఖేచర యక్ష
పన్నగామర సిద్ధభామినులందుఁ
బుట్టింపుఁ; డే మున్ను పుట్టించినాఁడ
నెట్టన బలపయోనిధి జాంబవంతు.
నది యెట్టిదనిన: నే నావులించుటయు
నుదయించెఁజిరతరాయుష్మంతుఁడతఁడు”
అని బ్రహ్మ దమతోడ నానతిచ్చుటయు
విని 142సంతసిల్లి యా వేల్పులందఱును
అనిమిషపతి వాలి, ననలుండు నీలు,
నినుఁడు సుగ్రీవు, సురేజ్యుండు దారు,
సింధువల్లభుఁడు సుషేణు, గుహ్యకుఁడు
గంధమాదను, విశ్వకర్ముండు నలుని,
దివిజవైద్యయుగంబు ద్వివిదమైందులను
దివిరి పర్జన్యాధి దేవత శరభుఁ,
గరువలి హనుమంతుఁ, గడఁగి పుట్టింప
ధరణిఁబుట్టించిరి తక్కిన సురలుఁ
దమతమ 143యంశముల్‌ దగఁబుచ్చి పేర్చి
యమితశౌర్యుల వానరాధీశవరుల.
నా వానరులు జగ 144దాప్తవర్తనులు
దావాగ్నితుల్యు లుదగ్రవిక్రములు;
పర్వతాకారులై భాసిల్లువారు
145గర్వదుర్వారులై కడునొప్పువారు
భీమసాహసికులై పెంపారువారుఁ
గామరూపంబులఁ గరమొప్పువారుఁ
దఱిమి యంబుధులైన దాటెడువారు
మెఱమి కొండలనైన మీటెడువారు
నఖదంష్ట్రహేతులై నలిఁగ్రాలువారు
నఖిలలోకోత్తరులై యొప్పువారు
ధారుణినైన విదారించువారు
నై రూఢికెక్కి యుదాత్తులై 146వారు
కొందఱు సుగ్రీవుఁ,గొందఱు వాలిఁ
గొందఱు హనుమంతుఁ, గొందఱు నీలుఁ
గొందఱు నలమైందకుముదులఁ గొలిచి
యెందు నభేద్యులై యేపు 147దీపించి
మలయదర్దురగంధమాదన వింధ్య
ములు మొదలగుశైలములఁగాననముల
బహు నదీ జలనిధి ప్రాంతదేశముల
విహరించుచుండిరి వేడ్కతో. నంత
మహనీయ పాయస మహిమచేఁజేసి
యహిమాంశుకులు పత్నులందు గర్భంబు[వా.రా. సర్గ 18]
లలవడ నాధానమైనది మొదలు
కలిమిఁగైకొనెఁ బేదకౌనులెంతయును;
నమృతాన్నరుచి లోన నడఁగక వెలికి
గమకించె నన దేహకళ వెల్కఁబాఱె;
రావణుసామ్రాజ్యరమముక్కు నల్పు
గావించుటకు సూచకము లివి యనఁగ
ననపత్యతాదోష మంతయు వెడల
మొనసెనాఁదగెఁ జన్ను ముక్కుల నల్పు;
చెక్కులు 148పలుకెక్కెఁ; జిట్టుముల్‌ బలిసె;
నిక్కెనాభులు; వళుల్‌ నెఱులకుఁబాసెఁ;
దలచూపెఁ149గోర్కు;లంతటఁగ్రమంబునను
150నెలలోలిఁబండ్రెండునిండె; నిండుటయు

  1. దీక్షాయుక్తుఁడై శుద్ధిఁ
  2. బభిష్టవము
  3. అప్పుడు దశరథుం డా ఋత్విజులకు- నొప్పుగా దక్షిణ లొసగంగఁ దలఁచి. యధ్వర…
  4. భూమి
  5. ఏమిటి కీ దేశమేలంగమాకు
  6. సురయక్షగణములనెల్ల
  7. లొత్తి
  8. దేవదానవయక్షదివిజులచేతఁ- జావక యుండంగ సమరంబునందు; నాచేతఁ బడయుచో నరులఁజింతింపఁ - డాచలపలాత్మకుండటుగాన వాఁడు; మనుజులచేఁజచ్చు మనుజుఁడై పుట్ట- వనజోదరుని విష్ణు వలయుఁబ్రార్థింప; ననవుడు దేవత లా విష్ణుఁగాంచి - వనజాక్షు మాకు…
  9. మనమింక
  10. నా బ్రహ్మపలుక, ఈ ద్విపదలోని - నటువల్కు తఱిని, ఆదిగా నొక పదము, పది ద్విపదలు, నొక ప్రతిలోని యధికపాఠము
  11. మాకు
  12. మాకు నమృ
  13. మానవాకృతి నేఁడు మర్త్యంబునందు - భానువంశంబునఁ బరమ పుణ్యునకు; దశరథేశునకు నందనుఁడవై పుట్టి - దశకంఠుఁద్రుంచి దుర్దశ మాన్పుదేవ; అనవుడు సురలతో నటుసేయనియ్య- కొని యేఁగె నంత వైకుంఠవల్లభుఁడు; అప్పుడు విమల…
  14. బ్రణుతింపఁ
  15. దరమె
  16. లోకేశ నీవు
  17. చరితుండు
  18. నేకాంతలను వారికెనసేయరాదు
  19. వనదగర్జితగతి వనజాక్షుఁడనియె
  20. మిత్రా
  21. లనుబంపియు
  22. భ్రాజితబహురత్నపంక్తుల మెఱసి- రాజిల్లు రజతపాత్రముమీఁద మూసి; పరగఁ…
  23. మెఱసె జూడ్కులకు
  24. గర్భుండు నమరులఁ
  25. వయో
  26. కడంకలు పెల్లువిలసిల్లఁబోయి, ర
  27. సత్త్వ
  28. దంత
  29. సర్వలోకములందు సరిలేని వారు
  30. మించి
  31. దీపింప
  32. పలచె (కె)క్కె, తెలుపెక్కె
  33. నంతఁగోర్కులు
  34. నెలలు దొమ్మిదియును నిండినపిదప
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )