ఇతిహాసములు రంగనాథరామాయణము బాలకాండము
శ్రీరామావతారము
వర్ణితమధుమాస వరశుక్లపక్ష
151పూర్ణయౌ నవమిని బుధవాసరమున
మహిఁబునర్వసుతార మధ్యాహ్నవేళ
గ్రహపంచకము 152నుదగ్రస్థితిఁదనరఁ
దొలఁగక గురుఁడుఁజంద్రుఁడుఁగూడియుండ
లలితమౌ కర్కట లగ్నంబునందు
సర్వలోకాధారు జగదేకవీరు
శర్వాదిదేవతా సంస్తూయమాను
దివ్యలక్షణకళా దేదీప్యమాను
నవ్యయు నసమాను నార్తార్తిహరణు
నా కమలోదరు నర్ధాంశ 153మయిన
కాకుత్స్థకులు రాముఁగనియెఁగౌసల్య
యదితి యింద్రునిఁగన్నయనువునఁ,దూర్పు
సుదతి చంద్రునిఁగన్న 154చొప్పున. నంత
భూలోక వినుతమౌ పుష్యనక్షత్ర
లాలితంబగు మీనలగ్నంబునందుఁ
గమలాప్తసమతేజుఁ గమలాప్తవంశుఁ
155గమలాక్షు భరతునిఁ 156గైకయి గనియెఁ.
బ్రణుతింపఁదగినట్టి ఫణితారయందు
గణితకర్కటకలగ్నంబునఁ గవలఁ
దరళలోచన సుమిత్రాదేవి మిత్ర
చరితుల 157లక్ష్మణశత్రుఘ్నులఁగనె.
దివి మ్రోసె నప్పుడు దేవదుందుభులు;
దివినాడి రప్పుడు దేవకామినులు
సొరిదిఁ బువ్వులవాన సోనయై కురిసెఁ;
బరితోషమందిరి బ్రహ్మాది సురలుఁ;
గలయ నయోధ్యలోఁ గలవారలెల్ల
వెలసి రుత్సవముల వీరు వారనక.
అప్పుడు దశరథుఁ డనఘు వసిష్ఠు
రప్పించి జాతకర్మములు సేయించెఁ;
బుత్రోత్సవంబును బొరయించె నెలమి
నేత్రోత్సవంబుగా నిఖిలపౌరులకుఁ.
బురుడు దీఱినయంతఁ బుణ్యాహవేళ
వరుస నా సుతులకు వంశోన్నతులకు
లక్ష్మీసమన్వితులకు రామభరత
లక్ష్మణశత్రుఘ్నలలితాఖ్య లెసఁగ
నొగి నామకరణంబు లొప్పఁ జేయించి
తగ నర్థికోట్లకు దానముల్‌ సేసె.
వారును దల్లులు వరుస దాదులును
బోరామిఁదము నర్థిఁబోషింపఁబెరిగి,

  1. పూర్ణంపు
  2. శుభగ్రహదృష్టి
  3. మునను
  4. సొంపున
  5. కమలాక్షి (ప్తు)
  6. గైకేయి
  7. లక్ష్మణు శత్రుఘ్నుఁగనియె
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )