ఇతిహాసములు రంగనాథరామాయణము బాలకాండము
విశ్వామిత్రాగమనము
గొడుకుల పెండిండ్లు కొమరొప్పఁజేయ
నడరి చింతింప విశ్వామిత్రమౌని
వచ్చి నిల్చుటయు దౌవారికుల్‌ సూచి
వచ్చి యా దశరథవసుధేశుతోడ
“నవధారు దేవ! విశ్వామిత్రమౌని
దివిరి వాకిట నేఁగుదెంచియున్నాఁడు.”
అనవుడు దశరథుం డాప్తులతోడ
ముని వసిష్ఠుఁడుఁదాను ముదమొప్ప నపుడు
పరమేష్టి కెదురేఁగు పాకశాసనుని
కరణి నెదుర్కొని కడుభక్తి నెఱఁగి
యమ్మునిఁగొనిపోయి యర్ఘ్యపాద్యముల
నెమ్మితో నిచ్చిన నృపుఁజూచి యతఁడు
“కుశలమే ప్రజలకుఁ? 163గుశలమే నీకుఁ?
గుశలమే నీ ముద్దుఁగొడుకుఁగుఱ్ఱలకు?
విశదవ్రతాచారవినుత! వసిష్ఠ!
కుశలమే? మునులార!కుశలమే?”యనిన
“నే వెంటఁగొఱఁతలే;దేము ధన్యులము;
నీవు విచ్చేసితి నేఁడు మా కడకుఁ
గాన లోకములఁబ్రఖ్యాతుండనైతి;
మానవాధిపులలో మాన్యుండ నైతి;
వచ్చినకార్యంబు వలనొప్పఁజెప్పుఁ
డిచ్చమైఁ జేసెద నే కార్యమైన.”
ననిన విశ్వామిత్రుఁడారాజుఁజూచి
“జననాథ! దశరాత్రసవనంబుఁదొడరి[వా.రా. సర్గ 19]
కోరి యేఁ జేయుచోఁగ్రూరరాక్షసులు
దారుణాకారులిద్దఱు వచ్చిపేర్చి
మా యాగశాలలో మాంసరక్తములు
పాయక కురియించి ప్రబలవిఘ్నములు
సేయుచునున్నారు క్షితిపాల! మాకు
నా యాగమధ్యంబునం దల్గరాదు;
అటుగాన నీ పుత్త్రు నభిరాము రాముఁ
బటుసత్త్వుఁగ్రతు వొప్పఁబాలించుకొఱకుఁ
గొనిపోవ వచ్చితిఁ; గ్రూరు లద్దనుజు
లనిఁజావ రొరులచే నతనిచేఁగాని;
యితనిమహత్త్వమే నెఱుఁగుదు; బ్రహ్మ
సుతుఁడైన యీ వసిష్ఠుండును నెఱుఁగు;
ననఘ! రాముఁడు బాలుఁడనుబుద్ధిమాను;
మనఘ! నీ పుత్త్రకుండను లోభముడుగు;
క్రతుకర్త క్రతుమూర్తి క్రతుభాగభోక్త
యతఁడు లోకారాధ్యుఁడతనిఁబుత్తెమ్ము;
అతులశస్త్రాస్త్రంబులతని కే నిత్తు;
నతనిచేఁ గ్రతురక్ష యగు మాకు.” ననుడుఁ
బెలుకుఱి మూర్ఛిల్లి పెద్దవ్రొద్దునకుఁ
దెలిసి వెల్వెలఁబాఱి దీనుఁడై మిగులఁ[వా.రా. సర్గ 20]
గలఁగి కంపించి గద్గదకంఠుఁడగుచుఁ
బలికె విశ్వామిత్రుఁబ్రార్థించి నృపతి:
రాముఁడు ముగ్ధుండు; రాముఁడు నిసువు;
రాముఁడెఱుంగఁడు రణ164కౌశలంబు
పదియునునైదేండ్లప్రాయంబువాఁడు;
కదలెడు చిప్పకూఁకటిగలవాఁడు;
పరికించి తనయందుఁ బగవారియందు
నురుబలాబలగతు లూహింపలేఁడు.
ఇటువంటి పసిబిడ్డ నెట్లు వేఁడితివి
కటకటా! ఘనదయాకలితుండవయ్యు!
బహు165చిత్రశస్త్రాస్త్ర 166పతులు రాక్షసులు
మహితమాయోపాయమతులు రాక్షసులు,
నిపుణసంగరకళా167నిధులు రాక్షసులు,
విపుల బాహా 168టోపవిధులు రాక్షసులు,
వారితోఁ169బోరాడ వశమె రామునకు?
వారేడ?యితఁడేడ?వరమునిచంద్ర!
అఱువదివేలేఁడు లవనిఁబాలించి
తఱి దప్పి ముదిసి యీతనిఁగంటి నేను;
ఇతనిఁబుత్తేరఁగా నేఁజాలనయ్య
క్రతురక్షకై విచారములేల మీకు?
నేను సేనలఁగూడి యీ ప్రొద్దె కదలి
పూనివచ్చెద నిదె 170పొదఁడు మీ వెనుక.
మునినాథ! మీ యాగమున విఘ్నకర్త
లను రాక్షసులశక్తులవి యెంతగలవు?
వారెవ్వరెవ్వరు? వారిపేరేమి?
యీ రాఘవుఁడు వారి నెబ్భంగి గెలుచు?”
ననినవిశ్వామిత్రుఁడనియె భూపతికి:
171మును పులస్త్యబ్రహ్మమునిమనుమండు
ఆ విశ్రవసు కొడుకఖిలకంటకుఁడు
రావణుఁడుగ్రసంరంభుఁడై పనుప
బలిమి మారీచసుబాహు లన్వారు
నలిరేఁగి యాగవిఘ్నములు సేయుదురు.
172రాముఁడొక్కఁడుఁదక్క రణభూమి వారి
నేమిచందంబున నెదుర లేరొరులు.”
173అనిపల్క నమ్మక యధిపతి మఱియు
మునినాథుతోఁబల్కె మోమోటలేక:
“బ్రహ్మనాలవవాఁడు పరమసాహసుఁడు
బ్రహ్మచే వరములఁబడసినవాఁడు;
అట్టిరావణుచేత నట 174పంపువడసి
నట్టివారల గెల్వ నతఁడేమిచాలు?”
ననవుడు రోషతామ్రాక్షుఁడై చూచి
కనలుచుఁగటము లుత్కటములై యదర[వా.రా. సర్గ 21]
నొడలెల్లఁగంపింప నుదరుచుఁబలికె
నడరి విశ్వామిత్రుఁ 175డారాజుఁజూచి:
“కాకుత్స్థకులజులగతి విచారింప
కీ కష్టదుర్భాష లేలభాషింప?
నేను వచ్చినపని యెఱిఁగింపు మంటి;
పూని చేసెదనంటి; బొంకెద విపుడు.
క్రతురక్షకై రాముఁగడఁగి వేఁడుటయు
ధృతి 176దూలి యీనని 177తెగిపల్కెదీవు;
సూనృతేతర! నిన్నుఁజూడఁగా 178రాదు;
కాన పోయెద.” నని కడఁగి పల్కుటయు
జలనిధులింకె; భూచక్రంబుగ్రుంకెఁ;
గలఁగెలోకములు; దిగ్గజములు మలఁగె,
దివిజులు వెఱచిరి; దిశలు గీడ్వడియె;
నవశముల్‌ గాఁజొచ్చె నఖిలభూతములు.
అప్పుడు మౌనికోపాటోపవృత్తి
దప్పక భావించి దశరథుఁజూచి
యా వసిష్ఠుఁడు వల్కె: “నర్కవంశజులు
భూవలయంబున బొంక రెన్నఁడును;
మిన్నందు నీ కీర్తి మీ వారికీర్తు
లన్నియుఁ జెడుఁగల్లలాడితివేని.
‘నిచ్చెద’నని పల్కి యీకున్నఁబొలియు
నచ్చుగాఁ జేసినయఖిలధర్మములు.
‘దశరథాధీశుండు ధర్మాత్ముఁ’డనఁగ
విశదకీర్తుల నీవు వినఁ బ్రసిద్ధుఁడవు.
పుడమిలో నవనీశ! భువనరక్షణముఁ
గడవంగ ధర్మముల్‌ గలవె రాజులకు?
గాన రాముని నిచ్చి గాధినందనుని
మాననీయునిఁ బంపు మానవాధీశ!
‘ఘనబలోన్న179తులు రాక్షసులీకుమారుఁ
డనికి దక్షుండు గాఁ’ డనుచు నీ కొడుకు
శైశవంబున కింత శంకింపనేల?
కౌశికుఁడుండంగఁ గలుగునే భయము?
అధిప! విశ్వామిత్రు నత్యుగ్రతపము
లధికసామర్థ్యంబు లతివిచిత్రములు.
భూనాథ! యిమ్మహాపుణ్యుండు దేవ
దానవ గంధర్వదైత్యులకంటె
నెఱుఁగు దివ్యాస్త్రంబు; లిమ్మహాబాహుఁ
డెఱుఁగనివిషయంబు లెందును లేవు.
జనలోకనాయక! జయయు సుప్రభయు
ననఁగ దక్షునికూఁతు; లాజయవలన
సుప్రభవలన రక్షోవధార్థముగ
సుప్రభుండగుభృశాశ్వుండు వేర్వేర
నస్త్రాకృతులఁబుత్త్రులరయ నేఁబండ్రఁ
శస్త్రాకృతులఁ దనూజన్ములేఁబండ్రఁ
గామరూపంబులు గలవారిఁగాంచి
భూమీశ! యిచ్చె నీ పుణ్యాత్మకునకు.
నది గారణంబుగా నఖిలశస్త్రాస్త్ర,
విదుఁడిమ్మునియు; నీవు వెఱవంగవలవ.
దీ ముని మహిమ పెంపెఱుఁగలేవకట!
యీ మునితో నాడి యేలతప్పెదవు?
ఈ మునిచంద్రుతో నేఁగ రామునకు
సేమంబు జయమును సిద్ధమ్ము సుమ్ము!
ఇతఁడు రక్కసుల జయింపఁగాలేఁడె?
హితమతి నీ పుత్త్రు నిద్ధచారిత్రు
నలఘుశస్త్రాస్త్రవిద్యలఁబెద్దసేయ
వలసి యిచ్చటికి భూవర! వచ్చెఁగాక;
180కాన రామునిఁబంపు క్రతువు రక్షింప;
నీ నిర్మలాత్ముని కిచ్చుట 181మేలు.”
అని వసిష్ఠుఁడు వల్క 182నాత్మలో నమ్మి
జననాథుఁడా రామచంద్రునిఁబిలిచి[వా.రా. సర్గ 22]
బాలభావముఁజూచి బాష్పముల్‌ నించి
యాలింగనముసేసి యర్థి దీవించి
చిప్పకూఁకటి దువ్వి చెక్కిలి వుడికి
తప్పక యొక్కింత దడవు సింతించి
పుణ్యాహవాచనపూర్వంబు 183గాఁగఁ
బుణ్యవ్రతంబులుఁబుణ్యహోమములు
గ్రహపూజనలు సేసి కమనీయవస్త్ర
మహితభూషణములు మనమార నిచ్చి
యొగిఁదానుఁ గౌసల్యయును వసిష్ఠుండు
దగిన దీవనలిచ్చి దశరథేశ్వరుఁడు
పుణ్యలగ్నంబునఁ బుత్త్రరత్నంబుఁ
బుణ్మాతుఁడగు గాధిపుత్త్రునకిచ్చి
నెమ్మియుఁ దెగువయు నెఱిఁబిరిగొనఁగ
“నమ్మునిఁగొలిచి పొ”మ్మని వీడుకొలిపె.

  1. గువలయంబునకుఁ-గుశలమే దశరథక్షోణీశ నీకు?
  2. కళాకేళి
  3. దివ్య
  4. పరులు
  5. న్వితులు
  6. బలాన్వితులు, బలవిభులు
  7. ర నెవ్వడు (నోపఁడు) రాముఁడనఁగ (ఘ!)
  8. పొండు
  9. మనుపులస్త్యబ్రహ్మమనుమండు ఖలుఁడు!
  10. రామునిఁదప్పించి రణములో
  11. అనిన నమ్మక్కని
  12. పంపఁబడిన-యట్టి
  13. డవనీశుతోడ
  14. మాలి
  15. తెగనాడెదీవు
  16. గాదు
  17. లరాక్షసులఁ బెక్కండ్ర-నని దక్షుఁడైత్రుంచు నచట నీ కొడుకు
  18. మానవాధీశ్వర! మఖరక్షణకును
  19. లెస్స
  20. నౌఁగాకయనుచు
  21. లైన-పుణ్య
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )