| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
నప్పుడు లక్ష్మణుండా రాముఁగొలిచి తప్పనిభక్తితోఁ దానును జనియెఁ. బొదివి పువ్వులవాన బోరనఁగురిసె; వదలక యనుకూలవాయువుల్ వీచె; వరఘోషమంగళవాద్యముల్ మ్రోసె; సురలాకసము నిండి చూచిరి ప్రీతి;184 నక్షీణ తూణ గోధాంగుళిత్రాణ కక్షలంబి కృపాణకలితులై దివ్య శరచాపహస్తులై సంయమిపిఱుఁదఁ గరము సంప్రీతిమైఁగదలి రాఘవులు నా వనజాసను నర్థితోఁగొలిచి పోవు నాశ్వినులనఁబోవుచో వేడ్క. నురుపుణ్యమతు లర్ధయోజనంబరిగి సరయువు డగ్గఱి శ్రమముఁబొందుటయు రామసౌమిత్రుల రమ్మని యపుడు దా మున్ను దారుణతపముచేఁగన్న కనకగర్భునిపుత్త్రికల సర్వమంత్ర జననుల సర్వదాసౌఖ్యదాయినుల బల యతిబల యనఁబరగుమంత్రముల నెలమి185మై వారలకిచ్చెఁగౌశికుఁడు. ఆ రామలక్ష్మణు లా మంత్రశక్తి నారూఢ186రవితేజులై 187సొంపుమిగిలి నాఁకలి నీరువట్టాదిగా రుజలు సోఁకక బలవృద్ధి శోభిల్లి; రంత- సరయూనదీ తటస్థలి నాఁటిరాత్రి దరుణకోమలదర్భతల్పంబులందుఁ గౌశికుచేఁబుణ్యకథ లొప్ప వినుచు దాశరథులు ప్రమోదమున నిద్రింప నా గాధితనయుండు నా ప్రభాతమున వేగంబె మేల్కని వేడ్క చిత్తమునఁ[వా.రా. సర్గ 23] దనరంగ నట 188తృణతల్పంబులందుఁ గనుమోడ్చియున్న రాఘవుల నీక్షించి “యరుణోదయంబయ్యె ననఘాత్ములార ; నిరుపమపూర్వాహ్ణనిత్యకృత్యములు వలయునేమంబులు వరుసఁ గావింప వలయుట మేల్కనవలయు మీ.” రనినఁ దెలిసి 189సంధ్యావిధుల్ దీర్చి కౌశికున కలరుచిత్తములతో నతిభక్తి మ్రొక్కి తరణి వంశోత్తముల్ దారర్థిఁజనుచు సరయూసురాపగాసంగమంబునను బహుసహస్రాబ్దముల్ 190పాయని నియతి బహుతపంబులుసేయుపరమసంయములఁ గనుఁగొని సంతోషకలితులై గాధి తనయుతోఁబలికి రా దశరథాత్మజులు: “ఎవ్వరియాశ్రమంబిది సంయమీంద్ర? యెవ్వ191రుండుదురయ్య!యీతపోభూమి?” ననవుడు “192రామ! యనంగాశ్రమ మన వినఁబడు నిది లోకవిఖ్యాత మగుచు; నీ యాశ్రమంబున నెలమితోఁదపము సేయుచు లీలమై శివుఁడున్నఁజూచి కందర్పుఁ193డతి దర్పగర్వితుం డగుచు నిందు శేఖరుమీఁద 194నేయఁజూచుటయు195 నడరి యా దేవుఫాలాక్షానలమునఁ జెడుట ననంగాఖ్యఁ జెందె లోకముల. నంగసంగతిఁదదీయాశ్రమ భూమి యంగదేశంబయ్యె నంతనుండియును. అరుదారఁదపము లీయాశ్రమభూమిఁ జరియించుపుణ్యులు చరితార్థులెందు.”196 ననుచు విశ్వామిత్రుఁ డత్తెఱఁగెల్ల వినుపించి యా రఘువీరులుఁదాను నిలిచి నాఁడా వాహినీసంగమమున విలసిత స్నానాది విధులనుష్ఠింప నానందమంది రయ్యాశ్రమవాసు లైన మునీశ్వరు లాత్మల నెఱిఁగి రమణీయమూర్తుల రామలక్ష్మణుల నమిత తపోధనుఁడైన కౌశికునిఁ గొనిపోయి వేడ్కలు గొనలొత్త నపుడు వినుతార్ఘ్యపాద్యాదివిధులఁ బూజించి పుణ్యకథాగోష్టిఁబొదలి యా రాత్రి పుణ్యరాత్రముఁ జేసి పుణ్యసంయములు మఱునాఁడు నిత్యకర్మంబు లా యేటఁ దెఱఁగొప్ప నందఱుఁ దీర్చినపిదప[వా.రా. సర్గ 24] “నీ నావికుఁడు నేర్చు నీ యేఱు గడప; భానువంశజులకుఁబదిల మీ నావ;” యనుచు విశ్వామిత్రుఁ డలరంగఁ బలుక197 విని రామలక్ష్మణుల్ వెరవొప్ప నపుడు వారికిఁ బ్రణమిల్లి వారు దమ్మనుప నాఋషితోఁ గూడి యా నావయెక్కి సరయువు దాటుచో సరయువునడుమఁ గరము విస్మయయంది 198కౌశికుఁ జూచి “యివెమహాధ్వనులు వెల్లెసగుచున్నవియు; దివినుబ్బియిదియేమి తెలుపవే.”యనుడుఁ “గరమొప్పు మీఱుచుఁగైలాసశిఖరి సరయువు మానససరసి జన్మించి పొంగారి సాకేతపురి 199చుట్టుఁగవిసి గంగతోఁగూడెడు కరడులమ్రోఁత.” యని ముని సెప్పిన నర్థితోమ్రొక్కి యనఘులన్నది దాటి యరుగుచో200నెదుటఁ201 గరులు సూకరములుఁగాసరంబులును హరిణముల్ శరభంబు లజగరంబులును బులులుభల్లుకములుఁబొదలుసింగములు గలమహాటవిఁ202జొచ్చిఘనుఁడు రాఘవుఁడు “ఖదిరతిందుకపూగ ఖర్జూర నింబ బదరీ వట ప్లక్ష పాటలీ తరులు బహుళకంటక లతాపరివృతవృక్ష సహితంబు నిర్మానుషంబును నైన యివ్వనభూమి మునీశ్వరచంద్ర! యెవ్వరియాశ్రమంబెఱిఁగింపు.”మనుచు నడుగ విశ్వామిత్రుఁడంతయుఁ జెప్పఁ గడఁగి యా రామలక్ష్మణులతో ననియె: “నలుక నింద్రుండు వృత్రాసురుఁజంపి మలకలుషప్రాప్తి మలినాంగుఁడైన సురలును మునులును సుత్రాము నిటకు దురితముక్తునిఁజేయఁదోడ్కొనివచ్చి పుణ్యోదకమ్ములఁబుణ్యమంత్రములఁ బుణ్యాభిషేకముల్ పొలుపారఁజేయ నా మలకలుషంబు లనఘ! యీ రెండు 203భూముల నిడ శుద్ధిఁ 204బొంది వాసవుఁడు205 “మలయుక్తమైనది మలదంబుఁ; గలుష కలితమైనది యొప్పుగాఁగరూశంబు; 206ననియుఁ బాపఘ్నంబులనియుఁబేరొసగి నలవృత్రువధపాప మందుఁదీఱుటయు విలసితధనధాన్యవిభవముల్ వొదలఁ బొలుపార వరము లాపురములకిచ్చి వెలయించె; నిఁక నొండు విను రఘురామ! |