ఇతిహాసములు రంగనాథరామాయణము బాలకాండము
తాటకా హననము
ధరణిఁదాటక యనుదానవురాలు
కరులు వేయింటికిఁ గలలావు గలిగి
పొలుపొందు నీ పురంబులు రెండు సొచ్చి
యలవుమై బాధించు” ననుడు రాఘవుఁడు
“ఎవ్వరు లావిచ్చి రీ యింతికింత?
యెవ్వరి నిజపుత్త్రి యీ దుష్టబుద్ధి?[వా.రా. సర్గ 25]
యీ పురంబులు రెండు నేల కారించు
నీ పాపకర్మురా? లెఱిఁగింపుఁ”డనిన
“నవని సుకేతుఁడన్‌ యక్షుండు దొల్లి
తవిలి పద్మజుఁగూర్చి తపమాచరించి
యడరెడునిష్ఠమై నతని మెప్పించి
కొడుకు వేఁడుటయును “గొడుకు నీ కీను
వెలసినగజముల వేయింటిలావు
గలకూఁతు నిచ్చితిఁగనుము పొ.”మ్మనిన
నా వరంబునఁగూఁతు నాతఁడు గాంచి
భావించి సుందుని భార్యగా నిచ్చె.
నతఁడవ్వధూటియందతి ఘోరసత్త్వ
పతుల మారీచ సుబాహులన్‌ సుతులఁ
బడసి లోకాంతరప్రాప్తుఁడౌటయును
గొడుకులుఁదానునుఁ గూడి గర్వించి
యా యింతి మఱి యగస్త్యాశ్రమంబునకుఁ
బోయి 207తపస్వులఁబొదివి కారింపఁ
గలశజుఁడా పాపకర్ములఁజూచి
యలిగి‘రాక్షసులు గం’డని శాపమిచ్చె.
నదియాదిగా రాక్షసాకృతుల్‌ పూని
208యదయత మానవాహారమున్‌ గొనుచుఁ
దానుఁబుత్త్రులుఁగూడి ధరణిఁగారించు;
దీనిఁజంపఁగలేరు తెగువ నెవ్వరును
నీవొక్కఁడవుఁదక్క; నీ చేతఁగాని
చావ; ‘దాటది’ యని చంపఁగాదనకు;
మెనయ గోబ్రాహ్మణహితమైనఁజాలుఁ
జనుఁజంపఁ గామినీజనుల రాజులకుఁ
దొల్లి ధారుణియెల్లఁ ద్రుంపఁజింతించు
ప్రల్లదురాలైన 209పడఁతి మంథరను
సంపన్నమతి విరోచనుకూఁతు210 వజ్రి
చంపఁడే యిది ప్ర211శస్తముగాదె యెందు
నెఱయ212లోకమ్ము లనిద్రముల్‌ గాఁగఁ
జెఱుపఁజిత్తంబునఁజింతించుటయును
నలిగి దృఢవ్రతయగు భృగుపత్నిఁ
జలమొప్ప విష్ణుండు సంపఁడే తొల్లి!
యదిగాన లోక 213రక్షార్థ మంగనలఁ
బొదివి చంపుటయును బుణ్యంబు లనఘ!”
యనిన విశ్వామిత్రు నతులవాక్యములుఁ
దన తండ్రిపనుపును దలఁచి రాఘవుఁడు[వా.రా. సర్గ 26]
“హాటకగర్భాభుఁడగు మౌనిమాటఁ
దాటక తాటక దండింతు” ననుచు
ఘనధనుర్ఘోషంబు గగనంబు నిండ
నినుచుటయును 214విని నిండఁగోపించి215
విదితాట్టహాసంబు వెలి దంష్ట్రరుచులు
వెదసల్ల దివియెల్ల వెసఁబెల్లగిల్లఁ
జరణఘట్టనములఁ జటులసత్త్వంబు
ధరణికిఁదెలుపుచుఁ దఱిమి యే తెంచు
తాటకఁజూచి యా దశరథరాముఁ
డాటోప ముప్పొంగ ననియెఁదమ్మునికి:
“చూచితే లక్ష్మణ! చూచితే దీని;
216నీ చంద మీ యంద మీ యుగ్రదృష్టి!
దీనిఁజూచిన గుండెదిగులేరికైన
మానునే? యటుగాన మర్దింతు దీని.”
ననుచుండ గర్జన నాకసం 217బద్రువఁ
జనుదెంచు పదధూళి సకలంబుఁగప్ప
నలి మీఱి218ఘోర దానవురాలు ఱాలు
గలఁగొని కురియ రాఘవుఁడు గోపించి
యనుపమాస్త్రంబుల నమ్మహాశిలలు
దునుమాడి దానిచేతులు రెండుఁద్రుంచె.
219నదియు విలూనభుజార్గళ యగుచుఁ
గదిరిన కినుకతో గర్జింపఁజూచి
ముక్కును జెవులును మ్రోడుగా నేసెఁ
దక్కక సౌమిత్రి దారుణాస్త్రముల,
మాయలుధరియించి మఱియుఁబెక్కమ్ము
లా యింతి గురియ విశ్వామిత్రుఁడనియె:
“ననఘ!సంధ్యాకాల మగుచునున్నదియు;
దనుజుల నెందు సంధ్యల గెల్వరాదు;
నీ వింకఁగృపమాలి నెలకొని దీని
నీ విశ్వహితముగా నిట సంపు.”మనుడు
గాధేయమునిమాట గడపక శబ్ద
వేధిబాణముల నవ్వెడమాయ లడఁచి
220పెడపెడ నార్చుచుఁబిడుగుచందమున
నడతెంచుచున్నదాన విని వీక్షించి
మహితాస్త్రమొకటి సన్మఱఁగాఁడనేయ
బహురక్తధారలు పర్వ నా వనిత
యసురశిక్షారంభమందది రాముఁ
డొసగెనో శరముల కుపహార మనఁగఁ
బ్రళయమారుతమునఁబగిలి సంధ్యాభ్ర
మిలఁగూలు తెఱఁగున నిలఁగూలెఁదూలి.
యప్పుడానందించిరమరులు మునులు;
నప్పుడానందించె నఖిలభూతములు.
నా రాము దీవించి యాలింగనంబు
గారవంబునఁ జేసెఁగౌశికుఁ. డంత-
దేవగంధర్వాది దివిజులతోడ
దేవేంద్రుఁడచటి కేతెంచి శ్రీరామ
దేవునిఁగాంచి ప్రార్థించి పూజించి
దేవవిధేయు గాధేయు నీక్షించి
“మమ్ము రక్షింపంగ మహిఁ బుట్టినట్టి
యిమ్మహాత్మునకు నీవిమ్మ భృశాశ్వు
సంతానమైన యస్త్రముల శస్త్రముల
నెంతయు.” నని చెప్పి యేఁగె నద్దివికి.
నినుఁడంతఁగ్రుంక నయ్యెడను నాఁడుండి
ముని మఱునాఁడు రామునిఁబ్రేమఁజీఱి

  1. మౌనుల సారెఁబొదివి
  2. యదనత
  3. ఁబర్జన్యుఁడలిగి (డడరి)
  4. ఁబట్టి
  5. సిద్ధము
  6. లోకంబు లనింద్రముల్‌ గాఁగ
  7. హితార్థమై సతుల
  8. మండి
  9. కర్ణకఠోరమౌకార్ముకధ్వనికి-ఘూర్ణితారుణనేత్ర కుటిలాస్యయగుచు, రెండు హస్తము లెత్తి ఱెక్కలతోడి - కొండ ఱివ్వునవచ్చు కొమరుదీపింప
  10. ఏ చందమేయందమే యుగ్రదృష్టి!
  11. బగల
  12. మీఱి
  13. నప్పుడు లక్ష్మణుం డసురేశుచెలియ-కిప్పాటు గావింతునని యన్నకరణి, ముక్కును జెవులును మొదలంటఁగోసె (నమ్మునఁజెక్కివైవ)-నక్కామ రూపిణి యక్కజం బొదవ
  14. వెడవెడనార్చుచు విపులకోపమున
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )