| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
“రామ! నీ విక్రమ రణకేళి సూచి యేము మెచ్చితిమి నీ కిచ్చెద మింక[వా.రా. సర్గ 27] నమరోరగాసుర యక్షయుద్ధముల 221సమధికమగునస్త్రశస్త్రంబు” లనుచుఁ దనుశుద్ధితోడ సుస్థలిని గూర్చుండి మునిపతి రాముఁబ్రాఙ్ముఖునిఁ గావించి యమలమనస్కుఁడై యఖిలంబుఁదలఁచి క్రమమునఁ దండచక్రంబును ధర్మ చక్రంబు మఱికాలచక్రంబు విష్ణు చక్రంబు శక్రువజ్రంబును నసియుఁ బాశిపాశము ధర్మపాశంబుఁ గాల పాశంబు నీశాను భయదశూలంబు నొగి శక్తియుగ్మంబు నుగ్రమై మిగుల నెగడు నుష్ణానుష్ణ నిర్మితాశనులు నఖిలదారుణమైనయమర మోదకియు శిఖరియు నన నుల్లసిలు గదల్ రెండు గంకాళమును ఘోర కాపాలముసల కంకణాఖ్యంబులుఁ గ్రౌంచ బాణాది శస్త్రంబులొగి నిచ్చి సమ్మదంబడర నస్త్రంబు లాగ్నేయ మన నొప్పునదియు బ్రాహ్మంబు తేజఃప్రభంబు నైంద్రంబు బ్రహ్మశిరంబును బ్రస్వాపనంబు నారాయణంబుఁ బైనాకంబు శిఖర దారుణసౌర సుదామనంబులును ప్రశమనమును విలాపనము సత్యంబు విశదప్రభలఁబొల్చు విద్యాధరంబు వాయవ్యసౌమ్య సంవర్తాస్త్రములును మాయాధరాస్త్రంబు మానవమదన శామన పైశాచ సంతాపనములుఁ దామస మౌసల 222ధర్షణాస్త్రములు హయశిరంబును మాయ 223లడరించి చాల జయమిచ్చుగాంధర్వసమ్మోహనములు సొరిది నైషికమును శోషణాస్త్రంబు నరుదుగ నాగ్నేయమను సాయకంబు నెలమి నిచ్చిన వానినెల్లఁ గైకొనుచు నలరి రాముండమ్మహాత్మునిఁజూచి[వా.రా. సర్గ 28] “మునినాథ! సకలాస్త్రములు భవత్కరుణఁ గని కృతార్థుఁడనైతిఁగావున నింక సలలితంబుగ నుపసంహరణాస్త్ర ములనొసగు” మటన్న ముదమంది యతఁడు సత్యవంతము రభసముఁ బరాఙ్ముఖము సత్యకీర్తియు దశాక్షము నవాఙ్ముఖముఁ బ్రతిహారతరము మారణమును శుచియు శతవక్త్రదైత్యధృష్టములు లక్ష్యములుఁ గ్రశనంబుఁ గరవీరకనికామరుచియు, దశశీర్షమును శతోదరము జ్యోతిషము విమలంబు మకరంబు విరుచి నిష్కులియుఁ బ్రమథనంబును సునాభంబును సర్వ నాభంబు మఱిదుందునాభంబుఁ బద్మ నాభంబు దృఢనాభనైరాశ్యములును గామరూపంబు యౌగంధరావరణ సౌమనస వినిద్రసంధానములును మోహనవిషమాక్షములు మహానాభ బాహువిధూతజృంభకములు ధాన్య ధనములు వృత్తిమంతము రుచిరంబు నెనయ నర్చిర్మాలి ధృతిమాలి యనఁగఁ గామరూపంబులు గల మహాస్త్రములు భూమీశునకుఁజెప్పి పొలుపొంద మఱియు నివియునుగాక యనేక శస్త్రాస్త్ర నివహముల్ రఘువంశనేతకు నొసఁగి తత్ప్రభావంబులుఁ దన్మంత్రములును దత్ప్రయోగంబులుఁ దదుప సంహృతులు విలసిల్లు శస్త్రాస్త్ర విద్యారహస్య ములు సర్వమునుఁదెల్ప మొగి రామునెదుట నంగారసదృశంబులై కొన్ని ఘోర భంగుల ధూమ నిభంబులై కొన్ని యనుపమదీప్తి రమ్యంబులై కొన్ని తనరారు బహుదివ్య తనువులై కొన్ని, పరువడిఁ జంద్రప్రభంబులైకొన్ని, పరికింప భానుదీప్తంబులై కొన్ని, బహుళాంధకార విభ్రమములైకొన్ని, మహితాట్టహాస భీమంబులైకొన్ని, యకలంకమూర్తులిట్లమర నేతెంచి ముకుళిత కరయుగ్మములతోడ నిలిచి “యే కార్యమొనరింతు? మేమిట వనుపు? మా కేమియానతి? మనుజలోకేశ!” యనుడు “నేఁదలఁచిన యప్పుడు మీరు చనుదెండుపొం.” డన్న సకలాస్త్రములును వలగొని భక్తి నవ్వసుమతీపతికి నెలమితో మ్రొక్కుచు నేఁగె. నంతటను- మునినాథుఁజూచి కేల్మొగిచి రాఘవుఁడు224 వినయంబు భక్తియు విశ్వాసమెసగ “ననఘ! కృతార్థుఁడనైతి మీ కరుణ.” నని వినుతించి విశ్వామిత్రువెంట నరుగుచో నట వామనాశ్రమభూమి గరమొప్పుటయుఁజూచి కాకుత్స్థకులుడు “ఈ పర్వతముచెంత నిది యొక్కవనము చూపుల కింపారి సొంపుల నలరి పొలుచు నానామృగంబులుఁగల ధ్వనులు గల పక్షికులములుఁగలిగి చెన్నగుచు నున్నది యాశ్రమం బోసంయమీంద్ర! యెన్ననెవ్వరిది? యిందెల్లజంతువులు సుఖలీల నున్నవి చూడ; నిక్కడికి నిఖిలజ్ఞ! యెక్కడ నీ యజ్ఞభూమి? ఎటనుండి చనుదెంతు రేచి రాక్షసులు? 225చటులోద్ధతంబు నీదు జన్నంబుసెఱుప? యాగరక్షణముగా నఖిలరాక్షసుల వేగంబె నిర్జింతు226విశిఖాళి.” ననిన నక్కౌశికుఁడు జగదభిరాము రాముఁ జెక్కిలి వుడికి సంస్నేహుఁడై పలికె: “ననఘ! నీవెఱుఁగనియర్థంబు గలదె? వినుము! నాచే విన వేడుకయేని.[వా.రా. సర్గ 29] |