ఇతిహాసములు రంగనాథరామాయణము బాలకాండము
విశ్వామిత్రాశ్రమ గమనము
మును విష్ణుదేవుండు ముదమునఁదపము
గొనకొని కావించుకొఱకునై యిచట
యుగములనేకంబు లుండఁగా ననఘ!
మగువామనాశ్రమమందురు దీని;
మఱియును సిద్ధాశ్రమంబును ననఁగ
వఱలు నీ యాశ్రమవనము లోకముల.
జననాథ! బలి విరోచనతనూజుండు
ఘనరాజ్యమదమున 227గర్వంబు మిగిలి
యేచి మరుత్తుల నింద్రాదిసురుల
వేచి కారింపంగ విబుధులు మునులు
నీ యాశ్రమంబున కేతెంచి మ్రొక్కి
తోయజనాభునితో నిట్టులనిరి:
“శరణాగతప్రియ! సర్వలోకేశ!
సరసిజోదర! నీవ శరణంబు మాకుఁ.
బన్నుగా మమ్మేఁచు బలి యనువాఁడు;
చెన్నొంద జన్నంబు సేయుచున్నాఁడు;
అవ్వారి దాన మయ్యజ్ఞవాటమున;
నెవ్వరేమడిగిన నిచ్చు228చున్నాఁడు.
క్రతువు దీఱకమున్నె కావింపు మాకు
హిత.” మంచుఁబ్రార్థింప 229నెల్లదేవతలు;
నా సమయంబున నదితితోఁగూడ
భాసురవ్రతనిష్ఠఁ బరగు కశ్యపుఁడు
ఇమ్ములఁదపము వెయ్యేఁడులు సేయ
సమ్మదంబున విష్ణు సాక్షాత్కరించె.
నా వేళఁ గశ్యపుఁ డానందమంది
వేవేగ నుతులు గావించి “సర్వేశ!
నీ మహాతనువున నిఖిలలోకములు
సోమార్కలోచన! 230చూచుచున్నాఁడ;
నాద్యంతరహితుండవగు నిన్ను వేద
వేద్యుని శరణంబు వేఁడెద.” ననినఁ
గరుణ నా విష్ణుండు గశ్యపుఁజూచి:
“వరము నీకిచ్చెద వాంఛితం231బెద్ది?
యడుగుదుగా.” కన్న నలరి కశ్యపుడు
కడుభక్తితోఁగరకమలముల్‌ మొగిచి;
“యతి 232బలోద్ధతి నాకు నదితికి నీవు
సుతుఁడవై జన్మించి సురల రక్షింపు233
మిది కోర్కి నాకును నీ దేవతలకు;
మదిలోన మన్నింపు మమ్ము నందఱను.”
అనవుడు నా విష్ణువదితి గర్భమున
ననుపమంబగు తేజ 234మడర జన్మించి
వామనత్వముఁ దాల్చి వచ్చి యద్దనుజు
భూమి మూఁడడుగులు235 పొసఁగంగ నడిగి
రెండడుగులనే ధరిత్రియు దివియు
దండిమైఁగొలిచి యాదైత్యు బంధించి
“లోలత నీ మూఁడులోకముల్‌ 236వెలయ
నేలుము నీ.”వంచు నింద్రున కిచ్చె. 237
నదిమొద లిది వామనాశ్రమంబయ్యె.
238నిది మదీయాశ్రమం; 239బీ పుణ్యభూమి
సిద్ధించు నిటు తపస్సిద్ధులు గాన
సిద్ధాశ్రమంబునాఁజెల్లు 240నెల్లెడల;
నీవె వామనుఁడవై నెగడి త్రివిక్ర
మావతారముఁదాల్చినట్టి విష్ణుఁడవు;
నాఁడును నిది నీ వనంబు శ్రీరామ;
నేఁడును నా రీతి నీ 241వనంబయ్యె.”
ననుచుఁగౌశికుఁడు నిజాశ్రమంబునకుఁ
జని యందు రామలక్ష్మణులఁబూజించె.
నచ్చటి మునిజనంబంతయు మదిని
ముచ్చట మీఱ రామునిఁ బూజసేసె.

  1. గర్వించిమిగిలి
  2. నీవింక
  3. చిరెల్ల
  4. చూపుముమాకు
  5. బేమి
  6. లోకనాయక
  7. మిష్టసిద్ధులు గల్గి యీ యాశ్రమంబు- సృష్టి సిద్ధాఖ్యమై చెలువొందనొసగు, మిదియ కోరిక మాకు నీ దేవతలకు- మదిలోన మమ్మును మన్నింపవలయు, నని వేఁడుకొన నిచ్చి హరితేజమడరఁ-బనిపూని యదితిగర్భమున జన్మించి, వామనత్వము…
  8. మలర
  9. పోలంగ-పోలమున్నడిగి
  10. మెఱయ
  11. నట్టివామన మూర్తి హతదేవతార్తి-గట్టిగాఁజేసె నిక్కడ ఘోరతపము, అదిగాన… ; ఈ యాశ్రమంబున నినవంశ వర్య- పాయకరాక్షసబాధ వర్తించు, సర్వరాక్షసులను సమయింపవలయు- నుర్వీశ! యేము నేఁడుండుదు మిచట, అని యా వనంబున కరుగ నందున్న- మునివరు లేతెంచి మునివరోత్తమునిఁ గౌశికు రామలక్ష్మణులఁ బూజించి- యాశీర్వదించి రయ్యర్కవంశజుల, నంత రాఘవుడు…
  12. నిదియ మా యాశ్రమం
  13. బినవంశతిలక
  14. నీ వనము
  15. వశం
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )