ఇతిహాసములు రంగనాథరామాయణము బాలకాండము
మిథిలాప్రయాణము
“జలజాప్తకులవర్య! జనకభూవిభుఁడు
చెలువొప్ప జన్నంబు సేయుచున్నాఁడు;
మనమందుఁబోద; మమ్మనుజేశునింటఁ
267ద్రినయనుపాటించు దివ్యకార్ముకము
గంధాధిపూజలఁ గరమొప్పు;దేవ
గంధర్వ యక్ష రాక్షస వీరవరులు
మొదలైనవారికి మున్ననేకులకు
నది యెత్త నెక్కిడ నలవి గాకుండు;
జననాథ! యా శరాసనలలామంబు
జనకునిజన్నంబుఁజనుఁజూడ నీకు.”
ననుచు విశ్వామిత్రుఁడాదిగా సకల
మునులు నా 268వీరోత్తముల దాశరథుల
లలితపుణ్యుల మిథిలాపురంబునకుఁ
జెలువారఁ బయనంబు సేసి, సమ్మదము
నొంది భాగీరథి యుత్తరతటముఁ
జెంది, 269హిమాద్రియు సిద్ధాశ్రమంబు
వలపట నిడి, యక్షవల్లభుదిశకుఁ
బొలుపారఁ270జాగిన భూరిమార్గమున
మూఁడుయోజనములు మూఁడుజాములకు
నాఁ డేఁగి యట శోణనదముతీరమున
విడిసి తీర్థస్నానవిహితకృత్యములు
నడపి రమ్యస్థలి నరనాథసుతులు
సంతోషమున మునీశ్వరులతో నుండి.
రంతఁ గౌశికునితో నా రాముఁడనియెఁ:
“గరము ప్రజావృద్ధి గలుగు నీ దేశ
మరయ నెవ్వరిదేశ మనఘాత్మ!?” యనిన:
“భూనాథ, వినుబ్రహ్మపుత్త్రుండుకుశుఁడు
నా నొప్పు మునిమహోన్నతకీర్తి గలఁడు;
అతఁడును వైదర్భియను 271నింతివలన
సుతుల నల్వురఁ గాంచె సురుచిరాకృతులఁ
బ్రశమితాత్ము నధూర్తరజునిఁగుశాంబుఁ
గుశనాభు వసువు; నక్కొమరులు272మిగిలి
యనివార్యశౌర్యులై యనుపమ లీలఁ
273దనరుమహాక్షత్త్ర ధర్మంబు నడపఁ;
గొడుకులచరితంబు గుణములుఁజూచి
యడరుసంతసముతో నా కుశుం డనియె:
“నిలఁబ్రజాపాలనం బెలమిఁ గావింపుఁ
డలఘుకీర్తులుగల్గు.” నన ముదమంది
కౌశలంబున నొప్పుగాఁగుశాంబుండు
కౌశాంబి యనుపేరఁగావించెఁబురము;
దశరథాత్మజ! మహోదయమనుపురముఁ
గుశనాభుఁడొనరించెఁగుశలుఁడై ధరణి;
శూరుం డధూర్తరజుండు నిర్మించె
నారంగఁ బురము ధర్మారణ్యమనఁగ;
వసువు నిమ్ముల గిరివ్రజమనుపేరఁ
బసనుగా నిర్మించెఁ బట్టణంబొకటి.
యిది ప్రీతి నవ్వసువేలుదేశంబు;
ముదమంద గిరులైదు ముందట నొప్పు;
నా నగమధ్యంబునందును మాగ
ధా నామమున నొక్కతటిని సెన్నొందుఁ.
జాలి యమ్మగధదేశంబెల్ల వసువు
274పాలించుచుండును బరమధర్మమున.
నచ్చెరు 275వడరంగ నా కుశనాభుఁ
డచ్చరలేమ ఘృతాచియం దెలమిఁ
గన్నులు మరునంపగములు నా నొప్పు
కన్నెల నూర్వురఁ గడురూపవతులఁ
గనియె; నత్తరుణులు గమనీయకాంతి
వినుత యౌవనకళా విస్ఫూర్తులమర
మంజీరమేఖలా మధురవాచాల
మంజులకంకణమణిశింజితములు
గరమొప్పఁగాఁదాళగతు లనఁగూడి
మొరయ లీలాలాస్యములు సల్పువారు,
మురిపంబు లింపార మొగి మృదంగాది
వరవాద్యములు వేడ్క వాయించువారుఁ,
బాణిపల్లవ లఘు 276స్ఫాలితలలిత
వీణామృదుక్వాణవితతంబు గాఁగ
మాకందమంజరీ మధుపానమత్త
కోకిలధ్వనిఁగూడికొని పాడువారు277
నగుచు నుద్యానంబునందుఁగ్రీడింపఁ
దగిలి యా చెలువలఁదప్పక చూచి
కామాంధుఁడై సర్వగతుఁడైన పవనుఁ
డా మానినులఁజూచి యర్థితోఁబలికె:
“నన్ను వరింపుడు నలినాక్షులార!
చెన్నార నమరత్వసిద్ధి గైకొనుఁడు;[వా.రా. సర్గ 32]
ఎన్నఁడు జరలేని యెలజవ్వనంబు
278నున్నతయశము మీ కొప్పారఁగలుగు.”
ననిన నల్లన నవ్వి: “యనిలుండ! సకల
జనహృదయంబులఁజరియింతు వీవు;
నీ వెఱుంగవె మమ్ము? నీ మహత్త్వంబు
భావింప కిది యేమి పలికెద వకట!
నియతుఁడై వర్తించు నిర్మలధర్మ
నయశీలుఁడగు కుశనాభుకూఁతులము;
ఓడక మా తండ్రి యుండ మాయంతఁ
గూడునే యిటుసేయఁ గులహానిగాదె?
యిరవార మా తండ్రి యెవ్వరికిచ్చుఁ
బరికింప నాతండె పతి మాకు.” ననినఁ
బవనుండు గోపంబుఁబట్టలే కప్పు
డవయవంబులఁజొచ్చి యా తలోదరులఁ
గుదియంగఁదివిచినఁగుబ్జలై తండ్రి
కదియెల్ల నెఱిఁగింప నందఱు వచ్చి
విన్నని వదనారవిందముల్‌ వాంచి
సన్నిధి నిల్చి బాష్పములు నించుటయుఁ
గుశనాభుఁడప్పు డా కూఁతుల కైన
279దశఁజూచి వెఱఁగంది 280తా వారికనియె:
“నిట్టిరూపములు మీ కెలనాఁగలాఁర!
యెట్టువాటిలె? నెవ్వఁడిటు సేసె మిమ్ము?
మీ రేల పలుకరు? మీ కింత కేమి
కారణం?” బనవుడుఁగరములు మొగిచి
తమ తండ్రితోడ నా ధవళాక్షులనిరి:
“మముఁజూచిపవనుండుమానంబువిడిచి[వా.రా. సర్గ 33]
“తన్ను వరింపుఁడు 281దరళాక్షులార!”
యన్న నా మాటకు ‘నౌఁగాక.’ యనక
“మా తండ్రి నడుగు మీమాట నీ.”వనిన
నాతండు కామాంధుఁడై యల్గి మమ్ముఁ
గుబ్జలఁగాఁజేసెఁ గ్రూరాత్ముఁ.”డనిన
నబ్జలోచనలతో 282నవనీశుఁ డనియెఁ:
“దగవును ధర్మంబుఁ283 దలపోసి మీరు
తగదని 284కులసీమ దాట నోడితిరి;
కన్నియలార! మీ గౌరవంబునను
నున్నతసత్కీర్తి నొందె నాకులము;
దేవతావిషయమై 285తెగి యల్గరైతి
రీ విధి మీరు సహించుటే లెస్స;
క్షమయె సత్యంబును; క్షమయె శీలంబు;
క్షమయె తపంబును; క్షమయె కీర్తియును;
క్షమయె ధర్మంబును; క్షమయె లోకంబు
నమరంగ రక్షించు.” నని వారిఁబంచి
తన మంత్రివరులతోఁ దగ విచారించి
యనఘాత్ముఁడగు చూళియను మునీంద్రునకుఁ
దనుజన్ముఁడగు గుణోత్తరు బ్రహ్మదత్తు
ననువార రప్పించి యా మహాత్మునకు
ధర్మపత్నులుగాఁగఁ దనదు286కన్నియల
నిర్మలబుద్ధిమై నెమ్మి నిచ్చుటయుఁ
జూళిపుత్త్రుఁడు వారిఁజూచి కైకొనఁగ
వ్రీలె నా నూర్వురవికృత 287రూపములు.
అవనీశ! యదిమొద లాపురోత్తమము
నవనిఁ గన్యాకుబ్జ మనుపేరఁబరగె.
నా కుశనాభుండు నప్పుడొప్పారు
నా కృతుల్‌ గలతనయలఁ 288గనుంగొనుచు
నలరి యా కూఁతుల నల్లుని ననిచి
యెలమిమైఁ బుత్త్రకామేష్టి గావింపఁ[వా.రా. సర్గ 34]
గొడుకైన కుశనాభుఁ గుశుఁడు వీక్షించి:
“పడసెదు పుత్త్రునిఁబరమ ధార్మికుని
వినుతనిర్మలకీర్తి విఖ్యాతు గాధి
యనుపేరు గలపుణ్యు.” నని యెఱిఁగించి
పరమప్రియంబున బ్రహ్మలోకమున
కరిగె. నా కుశుమన్మఁడై గాధి వుట్టె.
దశరథాత్మజ! గాధితనయుండ నేను;
గుశవంశ మనికౌశికుం డండ్రు నన్ను.
289మతిధర్మ 290నిష్ణాత మా యక్క సత్య
వతి భక్తిమై సురేశ్వరలోకమునకు
291వేడుకఁ దన ప్రాణవిభుఁడైన రుచికు
292తోడ శరీరంబుతోడఁ దా293నరిగి
యీ లోకమున లోకహిత 294ము గావింపఁ
బ్రాలేయపర్వత ప్రాంతదేశమున
నలిఁగౌశికీనామ నది యయ్యెఁ దాను;
వెలయ నన్నది చెంత విహరింతు నేను;
సిద్ధాశ్ర 295మముఁబ్రవేశించినకతన
సిద్ధంబుగాఁ దపస్సిద్ధుండ నైతి.
నాది నుండియు మదీయాన్వయస్థితియు
నీ దేశవిధమును నేర్పడ వింటి
నడురాత్రి296యరు(గు?) దెంచె297నరలోకనాథ!;
కడుడస్సినాఁడవుకనుమోడ్తుగాక;
చలియింపకున్నవి సకలవృక్షములు;
మెలఁగవు వనభూమి మృగసమూహములు;
నెఱి విహంగంబులు నీడముల్‌ సేరి
మఱచియున్నవి తమ మంజులధ్వనులు;
యామినీచరులైన యక్షరాక్షసులు
భూమి విచ్చలవిడిఁబొరిఁ జరించెదరు;
298దీటుగాఁజీకటి దెసలు నాకసముఁ
గాటుక పూసినకరణి నున్నదియు;
నీలాంబరంబున 299నిండుముత్తెములు
గీలించి బ్రహ్మాండగేహ గోళమునఁ
గడునొప్పుగా మేలుక ట్లెత్తినట్టు
లుడుగణంబులతోడ నున్నది 300నభము;
అడరంగ జనులకు నానంద మొదవ
నుడురాజు వొడతెంచు 301చున్నవాఁ.”డనిన
నా మాటలకు మెచ్చి యఖిలసంయములు
నా మునీంద్రునితోడ 302నని రప్పు డలరి:
“నెఱయ నీ వంశంబు నిర్మలం బనఘ;
గుఱిలేని మహిమ నీ కులమువారెల్ల
బ్రహ్మసమానులు పరికింప; 303నీదు
బ్రహ్మవర్చసమును బ్రణుతింప నొప్పు;
నా కౌశికియు నీ నిజాన్వయంబునకు
దీకొని తా వన్నె దెచ్చె నీ జగతి.”
ననుచు విశ్వామిత్రు నమ్మునీశ్వరులు
వినుతించి; రంత భూవిభులు సంయములు
నా రాత్రి 304నిద్రింప నా ప్రభాతమున
నా ఋషిపుంగవు లా గాధిసుతుఁడు.[వా.రా. సర్గ 35]
“జననాథ! నిద్రలు సాలింపుఁ.” డనిన
విని 305తేఱి పూర్వాహ్ణవిధు 306లాచరించి
కౌశికుఁజూచి:“యగాధమై307చూడ
నీ శోణనద 308రత్న మింత యొప్పగునె?
యా కీర్ణమీనంబు నతిరమణీయ
సైకతంబును సుప్రసన్న తోయంబుఁ
బరిచితహంసాదిపక్షి సంఘంబుఁ
దరుణానిలోచ్చలత్తరళ తరంగ
మైయున్న దీయేఱు; 309ననఘాత్మ! మనము
నే యెడ దాటుద? 310మే తెఱం?”గనినఁ:
“దఱచుగా మునులెల్ల దాటెడుమార్గ
311మెఱిఁగి పోద.” మటంచు నెడదవ్వు వోవఁ
గలహంస సారసకారండవాది
జలపక్షిరవములు సరిదమ్ముఁ బిలుచు
విధమునఁ జెలఁగంగ వీనులింపార
నధిపుఁడాలించి మధ్యాహ్న కాలమున
సిద్ధమునీంద్రసంసేవ్యతీరమును
శుద్ధపుణ్యోదక సుప్రవాహమును
గలిగి నదీతిలకంబై ధరిత్రిఁ
బొలుపారు జాహ్నవిఁబొడగాంచి మ్రొక్కి:
“గాధేయ! చూడ నగాధమైతోచు
నా ధునీరత్నంబు నట దాటి పోవఁ
దెరువింక నెయ్యది తెలుపవే.” యనిన:
“నరనాథ!312యీశోణనద ముత్తరించి
మొగి మూఁడుయోజనంబులు దాటిపోవ
నగు నమ్మహానది; యందాఁక మనకుఁ
దోయఫలాదులు ద్రోవఁ బె”క్కనుచు
నా యేఱుదాటి వా రటుపోవు చోటఁ
జెలఁగుసారస గణసేవ్యమై పుణ్య
సలిలమై యుత్ఫుల్లజలజమై విమల
ఫేనమై నిత్యగంభీరమై చారు
మీనమై యతిపుణ్యమిళితమై యొప్పు
గంగాతటంబున ఘనలతా 313కుంజ
సంగతంబగు సమస్థలమున 314విడిసి
మనుజేంద్రతనయులు మాధ్యాహ్నికంబు
లొనరించి ముదమంది యుచితభోజ్యముల
నోజ 315మై మునిగోష్ఠి నొప్పుచున్నంత;
రాజన్యతిలక మా రామచంద్రుండు
రాజహంసోద్ధూత రాజీవరేణు
రాజీ విరాజిత రంగత్తరంగ
గంగ నాలోకించి కౌశికుఁజూచి:
“గంగ యీ వసుధ కే క్రమమున వచ్చె?
నే తెఱంగునఁబోయె నిట నాకమునకుఁ?
బాతాళమునకు నెబ్భంగిఁదా నరిగె?
నేచి పారావార మే గతిఁజొచ్చె?
నే చందమునఁ బుట్టె నిమ్మహాతటిని?
చెప్పవే.” యనవుడు శ్రీరాముఁజూచి
యప్పుణ్యధనుఁడు విశ్వామిత్రుఁడనియె;
“గమనీయకాంతులు గల రూపవతులు
హిమవంతునకుఁ గూఁతులిరువురు గలరు.
అమరులందఱుఁగూడి యాగంబుకొఱకు
హిమవంతు వేఁడి యా యిరువురిలోనఁ
గురుపుణ్య 316యగుపెద్దకూఁతురు గంగ
నరుదారఁగొనిపోయి 317రమరలోకమున;
కటమీఁదఁబార్వతియనుపిన్న 318కూఁతుఁ
బటుతపోనిష్ఠకుఁబరితృప్తుఁడగుచు
ఫాలలోచనునకుఁబత్నిగా నిచ్చె
నా లోలలోచన నా నగాధిపుఁడు.
సురుచిరగతి గంగ సురలోకమునకు
నరిగి తా సురనది యనుపేరఁబరగె.”
నని చెప్పిమునినాథుఁడవనీశుఁజూచి
“వినుము! వృత్తాంతంబు వెండియునొకటి.[వా.రా. సర్గ 36,37]
పార్వతి వరియించి పరమానురక్తి
సార్వకాలంబును జంద్రశేఖరుఁడు
నతిలోకగతిలోలుఁడై దివ్యవర్ష
శతము దా రతికేళి సలుపుచున్నెడను
కమలాసనుండాదిగా సర్వసురలుఁ
దమలోన నెంతయుఁదారు సింతించి:
“వెలయ నీ యిరువుర 319విషమ తేజంబు
తలఁప నెవ్వరి320 కైన ధరియింప వశమె?”
యనుచు నందఱు నమ్మహాదేవుకడకుఁ
జనుదెంచి వినతులై సద్భక్తి మ్రొక్కి:
321దేవదేవ! మహేశ! దేవ! సర్వేశ!
దేవనిస్తారక! దేవ! నీ మహిమ
సర్వగీర్వాణులు సంస్తుతించె 322దరు;
సర్వజ్ఞ! మాకుఁబ్రసన్నుండ వగుము;
ఏ పారు మీ తేజమెవ్వరు దాల్ప
నోపుదు?రటుగాన యుడుగు మీ విధము.
323కరుణఁదపోవృత్తిఁగైకొని మీరు
సరి బ్రహ్మచర్యంబుఁజరియింపవలయు.”
ననవుడు“నౌఁగాక.”యనుచు నా సురులఁ
గనుఁగొని ముదముతో గౌరీశుఁడనియెఁ
324“జలియించినది నిజస్థానంబువలన;
నెలకొని మీలోన నిర్జరులార!
యెవ్వరు దాల్చెద రీ తేజ?” మనిన
“నివ్వసుంధర దాల్చు నింపార.” ననిన
హరుఁడు నా సురలతో“నౌఁగాక” యనుచు
ధరణిపైఁగావించెఁ దద్విమోక్షణము.
దివిజు లయ్యెడ నగ్నిదేవు నీక్షించి:
“పవనునితోఁగూడి పావక! నీవు
ఇలమీఁదఁబడియున్న యిమ్మహాతేజ
మెలమిఁ 325బ్రవేశింపు మింపార” ననినఁ
బవనసఖుండు నబ్భంగిఁగావింప
నవనిపై శ్వేతాద్రియనఁ గడు నొప్పె.
నరయ నా శైలంబునందుఁగుమారుఁ
డరుదార జన్మించె హరునితేజమున;
జననప్రదేశంబు శరవణంబగుట
జననాథ! యతఁడొప్పె శరజన్ముఁడనఁగ;
326నిలఁగృత్తికలు సన్నులిచ్చుటఁజేసి
యలరుచుఁగార్తికేయాఖ్యఁ జెన్నొందె;
నారయ నమ్మాత లార్వురు గాన
వారు సంతోషింప వదనంబు లాఱు
ధరియించి సముచితస్తన్యపానంబు
సరినొప్పఁజేయుట షణ్ముఖుండయ్యెఁ;
దరుణేందుమౌళి రేతస్స్కందమునను
నరుదారఁగా స్కందుఁడన నొప్పె; నంతఁ
బరువడిఁదముసురల్‌ 327ప్రణుతింపనెఱిఁగి
గిరిపుత్రి కన్నులు గెంపారఁజూచి
“సురలార! సంతానశూన్యత మీకు,
నిరవంద ధరణికి నెల్లకాలంబు
బహునాయకత్వంబుఁ బాటిల్లనిమ్ము
బహువిధంబుల.” నని పలికెఁగోపించి.
కలఁగిరి సుర; లంత గౌరితోఁదపము
సలుప హిమాద్రికిఁజనియె నీశ్వరుఁడు.
నమరేంద్రుఁడాదిగా నఖిలదేవతలుఁ
గమలసంభవుఁడున్నకడకుఁ దా రేఁగి
“జలజసంభవ! భుజాసత్త్వసంపన్ను
నెలమి సేనాపతి నిమ్ము మా.”కనిన
వారిజగర్భుండు వారి నీక్షించి:
“గౌరీశుసుతుఁడైన కార్తికేయుండు
సేనాధిపత్యంబు సేయు 328మీ.” కనిన
నా నిలింపులు వేడ్క “నౌఁగాక.”యనుచుఁ
జేకొన నాఁతడు సేనాని యయ్యె
నాక నాయకున కున్నతసౌఖ్య 329మొదవ.”330
నని పల్క రఘురాముఁడధికసంతోష
మునఁబొంది మఱియునమ్మునినాథుఁజూచి:
“యీ మహానది సంయమీశ్వర! త్రిపథ
గామిని యగు టేమికారణం?” బనిన
ననఘుఁడు కౌశికుం డా రాముఁజూచి
వినుమని యా కథ 331వినుపింపఁదొడఁగె:
“ననఘుఁడయోధ్యకు నధిపుఁడు సగరుఁ
డనుచక్రవర్తి 332యుద్ధతకీర్తి గలఁడు.333[వా.రా. సర్గ 38]
హిమవంతమున నతఁ334డిచ్చలో సుతులఁ
దమకించి భృగునకుఁ దపమాచరింప;
నంత నా భృగుఁడును నా తపంబునకు
సంతుష్టహృదయుఁడై సగరు నీక్షించి:
“పృథివీశ! కొడుకులు పెక్కండ్రు నీకుఁ
బ్రథితోరుకీర్తులు పరగఁబుట్టెదరు;
అంచితకీర్తి నీ యతివలందొకతె
గాంచు నొక్కని వంశకరుఁడైన పుత్త్రు;
మఱియొక్కసతి గాంచు మానుగా సుతుల
నఱువదివేవుర 335నమితవిక్రముల.”
నని వరంబిచ్చిన నా రాజ336 సతులు
విని కరంబులు మోడ్చి వినయంబుతోడ
“మునినాథ! నీ యీగిముదమొప్పనొక్క
తనయుఁ337డేసతి? కున్నతనయులేసతికి?
ననవుడు “మీ కోరినట్టిద పుత్త్ర
జననంబు.” లనిపల్క సంతోషమంది
యందగ్రమహిషి నిజాన్వయకరుని
నందను నొక్కని నరనాథ! కోరె.
మఱికోరె నా యున్నమగువయు సుతుల
నఱువదివేవుర నధికమోదమున.
సగరుండు భృగునకు సతులతోఁగూడ
నొగిఁబ్రదక్షిణ మంత నొనరించి మ్రొక్కి
పురమున కేతెంచి పొలుపార నంతఁ
గరము వేడుకఁగొంతగాలంబు సనఁగ
మానుగాఁదన యగ్రమహిషి కేశినియు
సూనుని నసమంజసుండనువానిఁ
గనియె; నా సుమతి యన్‌ కాంతకుఁబుట్టె
ఘనతరంబైనట్టి గర్భతుంబంబు.
338 కఱకైన యా సొఱకాయలోఁబుట్టి
రఱువదివేవు రత్యద్భుత లీల.
నంత దాదులు వారి నాజ్యభాండములఁ
గొంతగాలము వెంపఁగొమరారి వారు
రూపయౌవనముల రూఢిగాఁబెరిగి;
రా పెద్దవాఁడం దుదగ్రదర్పమున
వాపోవఁదమ్ముల వడిఁబట్టిపట్టి
చాపలంబునఁగట్టి సరయువులోన
వైచుచు నవ్వుచు వచ్చిన మగుడఁ
ద్రోచుచు నుండు; నా దుష్టాత్ముఁడైన
యసమంజసున కంత నంశుమంతుండు
దెసలఁదేజంబులు దీపింపఁబుట్టె.
నా యసమంజసుం డతిదుష్టచిత్తుఁ
డై యుగ్రుఁడైనఁ బోనడఁచి యా రాజు
శాశ్వతధర్మ నిష్ఠాపరుండగుచు
నశ్వమేధము సేయ ననురక్తిఁదొడఁగె.”

  1. గననొప్పుఁగఱకంఠు ఘనకార్ముకంబు
  2. ధీరోత్తములు… రథులు… పుణ్యులు
  3. హేమాద్రియు
  4. బొందిన
  5. కాంత
  6. మీఱి
  7. దనరిమహోన్నత
  8. పాలించునెప్పుడుఁ
  9. వందంగ
  10. స్ఫారితలీల
  11. నెఱికప్పుగొప్పులు నిటలంబు లొప్పు-మఱి వాలుఁజూపులు మాటతీపులును, నిక్కినముక్కులు నిగ్గుఁజెక్కులును- జక్కెరమోవులు జారునీవులును, జక్కవకవనవ్వు చన్నులక్రొవ్వుఁ- జుక్క రాయల గోముసొబగు నెమ్మోము, దబ్బఱకౌనులుఁ దళుకు మేనులును - అబ్బురంబగుతొడ లంచలనడలు, నగుచు…
  12. నున్న తాయువును
  13. దెసఁ
  14. తెరవల
  15. ధవళాక్షులార!
  16. నతఁడప్పుడనియె
  17. దలఁచి మీరిపుడు
  18. శీలంబు
  19. తెగనొల్లరైతి
  20. కూఁతులను
  21. వేషములు
  22. ఁదగఁజూచి, యలరి
  23. నతి… నాయక్క
  24. నిష్ఠాత్మ
  25. విడువక
  26. ఁదొడరి
  27. నరిగె-నీ
  28. మాచరింప
  29. మంబుఁబ్రసేవించు
  30. యేతెంచె, చనుదెంచె
  31. నరనాథచంద్ర
  32. దీటుకొన్‌ చీ
  33. నిండ
  34. నింగి
  35. చున్నాఁడటన్న
  36. నపుడిట్టులనిరి
  37. నెందు- బ్రహ్మర్షివర, నీవు భవ్య శీలుఁడవు
  38. నిద్రించి యా విభాతమున- నా ఋషిపుంగవులట మేలుకాంచి
  39. లేచి
  40. లనుష్ఠించి- తోయఫలాదులఁదృప్తిఁబొందుచును, నా యేఱుదాఁటి వారటుపోవుచోట
  41. యున్న
  42. మాత్మకింత
  43. అనఘాత్ములార-యే
  44. మెఱిఁగింపుఁడనుడు
  45. మరసిపోవుదమంచునట
  46. యిట,యిదె
  47. సంఘ
  48. నిలిచి
  49. నమ్ముని
  50. వతిఁబెద్దకూఁతురి
  51. రటనాకమునకు
  52. కూఁతుపటు… తృప్తుఁడైన
  53. విమల
  54. కిది… వచ్చు-ననుచు
  55. దేవదేవుఁడ! పార్వతీనాథ! సకల-దేవనిస్తారక! దేవ! నీ మహిమ
  56. చెదము
  57. సురలకు నింపుగా సుముఖుండ వగుము- అరయ మా విన్నపంబాలించి యింక
  58. జలియించె నిదె
  59. బ్రాశింపుమి యింపార
  60. ఎలమిఁగృత్తికలు చన్నిచ్చుటఁ
  61. ప్రణతులుసేసి, సురత సౌఖ్యము మాన్ప సురలపై నలిగి-గిరిపుత్త్రి…
  62. ఁగాక
  63. మెసఁగ
  64. (1. ) కార్తికేయుని జన్మకథ యొప్ప వినినఁ- గీర్తియు సుకృతంబుఁ గెలుపును గలుగు, నొప్పుగా స్కందసాయుజ్యపదంబుఁ-దప్పక కాంతురెంతయును మీఁదటను, ననిపల్క…\n(2. ) కార్తికేయునిజన్మకథ లివి విన్నఁ-గీర్తియు సుకృతంబుఁ గెలుపునుగలుగు, గంగావతారప్రకార మా మీఁద- మంగళంబుగ వినుమనుచు నిట్లనియె, ననఘుఁడయోధ్యకు
  65. వివరింపఁ
  66. యున్నత
  67. అతఁడు సంతతిలేమి కనిశంబు వగచి- మతిలోనఁదలపోసి మంత్రుల నునిచి
  68. డింతులుఁ దానుఁ
  69. నతుల
  70. వరుఁడు
  71. డర్వదివేల తనయులే సతికి
  72. వేగంబె యఱువదివేవురు కొడుకు- లా గర్భమవియంగ నందువెల్వడిరి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )