| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
ఘనపుణ్యులందుండి కదలి మిన్నంది తనరుప్రాకారయూధముల సౌధముల[వా.రా. సర్గ 50] నమరినరత్న గేహముల వాహముల రమణీయ రాజమార్గముల దుర్గముల వలనొప్పుశృంగార వనుల జవ్వనులఁ బొలుచు సంతతశుభంబుల నిభంబులను ననువొందువైరివర్గాశిథిలకును జనకుని మిథిలకుఁజనుదెంచి. రంతఁ గాళింగ నేపాళ కర్ణాట లాట మాళ సౌవీర మగధ పాంచాల కురు పాండ్య బర్బర కుంత లావంతి మరుతురుష్కాభీరమనుజవల్లభుల ఘనతరయాగోపకరణ భాగముల ననురూపపశుగణాయతనయూపముల భూరి దధి క్షీర పూర్ణకుంభముల సారసమిద్భారచారుదేశములఁ దగుపంక్తులై యున్న దర్భాసనములఁ దగు పీఠములనున్న తాపసోత్తముల లలిఁగ్రాలురత్నపల్లవతోరణముల మలఁగి పై చేసాచు మదవారణముల నడరి ఘోషించు సామాదివేదముల నుడుగక చనుదెంచుచున్న తాపసుల నుడువీధి నుప్పొంగు హోమధూమముల నడరెడుదేవతాహ్వాన రావములఁ బూజలు గైకొను పుణ్యసంయములఁ బూజింప సొలయని భూసురోత్తముల నరుదారు జనకుని యజ్ఞవాటంబుఁ గరమర్థితోఁజొచ్చె, గాధినందనుఁడు. అంత నా జనక మహారాజవరుఁడు నెంతయుఁబ్రియముతో నెదురుగా వచ్చి మునినాథునకుఁజాగి మ్రొక్కి తాఁ దోడు కొనిపోయి పూజించి కుశలంబు లడిగి: “నీవు విచ్చేసితి; నేఁడు నేఁ బరమ పావనాత్ముఁడనైతిఁ; బ్రబలె నా క్రతువు.” నని చాలఁగొనియాడి యమ్మునిచంద్రు వెనుకనె వినతులై విలసిల్లుచున్న గురుతరస్ఫీతవక్షులఁ గాక పక్ష ధరుల మహాధనుర్ధరుల శ్రీకరులఁ గోమలాంగుల నభంగుర యశోనిధుల భూమిఁజరించు వేల్పులఁబోలుఘనుల సదయాంతరంగుల సతతప్రసన్న వదనుల భువనపావన చరిత్రులను జారుప్రభాభానుచంద్ర సన్నిభుల ధీరుల 477నాశ్విన దేవతాకృతుల నాజానుబాహుల నతులవిక్రముల రాజీవనేత్రుల రామలక్ష్మణులఁ జూచి:“యీ శరచాపశోభితహస్తు లీ చతురాత్మకు లెవ్వరివారు? ఈ పల్లవారుణమృదుపాదపద్ము లే పగిదిని వచ్చి రిచటికి నడచి?” యనుడు విశ్వామిత్రుఁ:“డనఘులు వీరు జననాథ! దశరథజననాథసుతులు; ఆయతశక్తి నా యాగంబుఁగాచి యా యహల్యనుబ్రోచి యనుకంప నేచి నిరుపమతరశక్తి నీ యింటనున్న హరునిచాపముఁజూడ నరుదెంచి” రనుడుఁ గౌశికుఁగనుఁగొని గౌతమసూనుఁ డాశతానందుఁడిట్లనియె రాగిల్లి:[వా.రా. సర్గ 51] “నీవు రాఘవుఁదెచ్చి నెమ్మి మమ్మేలి; తీ విశ్వవిభుఁ దేర నెవ్వరితరము? అడరి మా తల్లి యహల్యపాపములు గడిగె రాఘవుపాదకమల రేణువులు; గౌతమశాపదుర్గము నిస్తరించి గౌతముఁగ్రమ్మఱఁ గలసె మా తల్లి; రామచంద్రునిపాద రాజీవమహిమ లేమందు!” నని రాము నీక్షించి పలికె: “నీ కౌశికుఁడు పుణ్యుఁ డీ క్షితిమీఁద నీకు రక్షకుఁడట! నీ కేమికొఱఁత? |