| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
ఆ విల్లుఁదెప్పింపు.” మనవుడు, జనక భూవరుండప్పు డద్భుతమంది పలికె: “భవుఁ డంధకాసుర భస్మాసురాది దివిజారివరుల మర్దించె నా వింట; విపులకోపాటోపవిభవుఁడై భవుఁడు త్రిపురదుర్గములు సాధించె నా వింట; నుల్లోకుఁడై రుద్రుఁ డుగ్రదానవులఁ దొల్లి యనేకులఁద్రుంచె నా వింట; నా వింట మఱి దక్షుయాగంబు నాఁడు దేవేంద్రముఖ్యులఁ ద్రిదశులఁదోలి నియతాత్మ! మాతాత నిమిచక్రవర్తి కయ నయాన్వితునకు నాఱవతరము నగు దేవరాతుచే హరుఁడిచ్చెఁదొల్లి యగణితబలమైన యా విల్లుఁబిదప; నదియాదిగానుండు ననఘ! మా యింట విదితమై యా విల్లు వినుతుల నొప్పి. జన్నంబు గావింప సమకట్టి యేను సన్నుతనియతి భూస్థలిశుద్ధికొఱకుఁ గ్రతుశాల దున్న నాఁగటిచాలిలోన నతివ యొక్కతె వుట్టె నాశ్చర్యలీలఁ. బ్రీతితో సీత యన్‌పేరొప్పఁ బెట్టి యాతన్వి నాకూఁతురని పెంచుచుండ; నిల వసంతంబున నెలదీగఁబోలి నలినారికళఁ బోలి నానాఁటఁ బొదలి యింతయై యంతయై యెలజవ్వనమున వింతగా నా యింతి వెలయుట దెలిసి తలకొని తరుణికై ధరణివల్లభులు బలియులై యేతెంచి పడుచును దమకు నడిగిన వారల కంటి నేనప్పు: “డుడురాజబింబాస్య కుంకువగాఁగ హరునివిల్లున్నది; యతిసత్త్వయుక్తిఁ బెరిగి యేతెంచి మోపెట్టినఁజాలు; నతనికి నాకూఁతు నబ్జాక్షి నిత్తు నతిమోదమున.”నన్న నా నరేశ్వరులు నెత్తినకడఁకతో నేతెంచి చాప మెత్త నోపకపోదు రెందఱేనియును. ధనువెత్తఁ జాలని ధరణీశులెల్లఁ దనరారు సిగ్గునఁ దలలెత్త లేక: “కూఁతునిచ్చెదనంచుఁ గోదండమొకటి బ్రాఁతిగా నెపమిడి భంగించె మనల జనకు; డాతని నింక సకలయత్నముల నని సేసి సాధింత.”మని విచారించి, చనుదెంచి కోటపై సంవత్సరంబు ఘనసైన్యములతోడఁగడిమిమై విడియఁ దగ మున్ను గూర్చినధాన్యాదులెల్ల నొగిఁదీఱఁ మదిలోన నొకటి సింతించి వడిఁదేవతలఁగొల్చి వారిచే నేను బడసినచతురంగబలముఁ గైకొనుచు విడిసినబలముపై వీఁకతో నడవఁ దొడరఁజాలక భీతితోఁగొందఱరుగఁ గొందఱు మా తోడ ఘోరాజిఁబెనఁగి చిందఱవందఱై చెడిపోయి రోడి; యక్కజమగుశక్తి నా విల్లు రాముఁ డెక్కువెట్టిన గూఁతు నిచ్చెద.” ననుచు[వా.రా. సర్గ 67] |