“విల్లున్న మందస వేగఁదెం.”డనుచు
బల్లిదులగువారిఁ బదివేలఁబనిచె
నది లోహమయమును నత్యాయతంబు
విదితాష్టచక్రంబు విపులంబునగుచు
నమరెడుమందస యా వింటితోడఁ
దమతమసత్త్వముల్ దలకొన వారుఁ
గనకాద్రితోఁగూడఁగమలజాండంబుఁ
గొనివచ్చుగతిఁద్రోచికొనివచ్చి దాని
జనకునంతఃపురచారులౌవారు పనివడి దాదులు పరతెంచి వేగ
జానకి నూర్మిళ జనకునిదేవి కానంగఁజనుదెంచి కని చెప్పి రెలమి
వినరమ్మ చెలులార! విన్నపంబొకటి మనరాజుసభలోన మరి మునులుండ
గాధినందనుఁడైన కౌశికువెనుక క్ష్మాధరోత్తముల నాజానుబాహువుల
నమరంగ దేవగంధర్వులకన్న కొమరైన తేజంబు కొమరొప్పువారి
చెలువైన తేజంబు చెలఁగి వీక్షించి యలవీరు లెవ్వారలని జనకుండు
అడిగినఁ గౌశికుఁ డతిహర్షమాత్మ నడరంగ దశరథునాత్మజుల్ వీరు
హరుచాప మెక్కిడ హర్షించి(నరుదెంచి)రిటకు ధరణీశ! తెప్పింపు తగువారిఁబనిచి
యన నిట్లు కౌశికుననుమతి మీఱ దన మంత్రులను బిల్చి ధనువు దేఁబనిచె
సోరణగండ్లలోఁజూఁడగవచ్చు నారయ వేగ రండని నాతి పిలువఁ
గులము శౌర్యము రూపు గుణమునుబొగడఁ జెలఁగి చెవుల సుధ చిలికినట్లుండఁ
బ్రేమ వెగ్గలమైనఁబృథివీజ కపుడు రోమాంచమయ్యె నారూఢమై మేనఁ
బ్రియమును భయమును బిరిగొని పొదల నయమెంచి తలవాంచి ననఁబోణి యుండె
అలివేణి సిగ్గున నట పల్కకున్నఁ జెలువకుఁబరిచర్య చేసిరి సఖులు
పన్నీటఁగుంకుమ పదనిచ్చి యొకతె చెన్నార మకరికల్ చెక్కిళ్ల వ్రాసెఁ
దట్టుపునుంగును దగుచందనంబు దట్టంబుగాఁబూసెఁదరలాక్షి కొకతె
నుదుటఁగస్తురిలేఖ నుతముగాఁదీర్చె నెదుట నద్దముఁబెట్టె నెలనాఁగ యొకతె
కురులు నున్నఁగ దువ్వి కొప్పమర్చుచును విరులందు నొక తన్వి వింతగాఁదరిమె
వాసించుబాగాలు వడి నాకు మడుపు లా సతీజనమణి కందిచ్చె నొకతె
అలినీలవేణికి నందంబుగాను మొలనూలిఘంట లిమ్ముల మ్రోయ నిడియెఁ
గులుకుఁబాలిండ్లపై గొప్ప ముత్యముల విలసిల్లు హారముల్ వేసె నొక్కరితె
కాంత గట్టిన చంద్రకావివల్వలను వింతగా నెరి నొప్ప వెసఁదీర్చె నొకతె
యీ మాడ్కి చెలికత్తె లెలమిఁగైసేయ హేమపీఠంబున నెలమితో నుండ
నప్పుడు కళ్యాణి నవనినందనను దప్పక వీక్షించి తల్లి దా నపుడు
కనకసౌధ గవాక్షకలితగా నపుడు వనజాక్షిఁదోడ్కొని వచ్చె నా యెడకు
నెప్పుడు వీక్షింతు మినవంశజాతు నెప్పుడు గనుగొందు మేము రాఘవుని
నని వారలందఱు హర్షంబుతోడ ఘనగవాక్షములందుఁగనుఁగొని రంత
రాముని లోకాభిరాముని దివ్య ధామునిఁగన్గొని తరలాక్షులపుడు
ఘనశౌర్యరూపముల్ గలిగినవానిఁ గనకచేలునిమాడ్కిఁగళలొప్పువాని
జోక పువ్వులవిల్లుఁజొనిపినవాని జ్యాకిణాంకితహస్తజలజుఁడౌవాని
రూపంబు లొక్కట రుచిరవర్ణముల నేపార వేఱుఁగా నెన్నఁగవచ్చు
శ్రీపతియంశజుల్ క్షితిపాలసుతులు భూపాలరత్నముల్ పొలుపారుటౌర
జనకజ దగు రామచంద్రున కిరవు ఒనరుసౌమిత్రికి నూర్మిళయనుచుఁ
దనరుఁగాకని వారు దగనెన్నికొనుచు ననుపమప్రేమతో నటఁజూచుచుండ
నమరేంద్రసభఁబోలు నా సభనడుమ నమరంగ మందస మటఁజేర్చి రపుడు
సభలోన నునుపంగ జనకభూవిభుఁడు
శుభమూర్తి నా గాధిసుతుని వీక్షించి:
“కిన్నర గంధర్వ గీర్వాణ యక్ష
పన్నగ రాక్షసప్రవరులెవ్వరును
ఎక్కువెట్టఁగఁ జాల రీ చాప మనినఁ
దక్కిన నరులకుఁ దలఁపంగఁదరమె?
కౌశిక!రామలక్ష్మణులకుఁజూపు
మీ శరాసన.” మన్న నెలమి నమ్మౌని
రామచంద్రునిఁజూచి: “రఘువీర!వత్స!
యీ మహాధనువెత్తి యెక్కిడితివియు.”
మాదివరాహమై యవలీల గోఱ మేదినీతలమెత్తి మెఱసిన నీకుఁ
దనర నీ విల్లెంత తలపోయ ననఘ! యని యిట్లు మునివరుఁడానతిచ్చినను
మనువంశతిలకుఁడు మఱి వేగఁబుత్తు నని మునిసభలోన నా రాజుక్రియను
సౌమిత్రియును దాను జయ్యన లేచి ప్రేమయుఁదమకంబు పెనఁగొనుచుండఁ
జెలఁగుచుఁదనమీఁది చెఱఁగు రాఁదిగిచి మొలనూలు బిగఁజుట్టి మోహనాకృతులఁ
దిరముగా నిగ్గులు దిశల శోభిల్ల నరవిందలోచనుం డసమసాహసుఁడు
మొలనూలిఘంటలు మురువుమించగను మలఁగుచు నవరత్నమాలికల్ పొరల
బాహుపుర్లుంగ రాల్పటుకంకణములు బాహువులంగుళావళి కాంతు లీన
నమరంగఁగర్ణభూషాదులకాంతిఁ గొమరారుచెక్కిళ్లు గుదిగొని మెఱయ
నలకలు పెడతల నట నృత్యమాడి తళుకొందు బంగారుతనుకాంతు లీనఁ
గోటిమన్మథలీలఁగొమరు దీపింప నీటుగా నటువచ్చి నెఱి యెల్లరెఱుఁగ
జనకునిసభలోన జననుతంబైన ..........
మనియిట్లు మునివరుఁ డానతిచ్చినను
మనువంశతిలకుండు మందస దెఱచి
ధరణిభరంబెల్లఁ దనమీఁదఁ బెట్టి
చిరనిద్రఁబడియున్న శేషాహియనఁగఁ,
గాలమేఘములోనఁ గదలక రుచులు
దూలక పొలుచువిద్యుద్దండ మనఁగ
నిరుపమాకారత నిండారి యందుఁ
గరమొప్పు విల్లెత్తి గవుసెన దిగిచి
గర్వించి తనుదివ్వఁగడఁగి యేతెంచు
నుర్వీశబలము లాహుతులుగా మ్రింగి
యరుణరత్నప్రభలను మంటలొలుకఁ
బెరుగుచు నిలుచున్న పెనుఁజిచ్చువోలె
నక్కజంబగు చాప మవలీల రాముఁ
డెక్కువెట్టుచు నుండ నెఱిఁగి కౌశికుఁడు:
“హరునిచాపము రాముఁడతిసత్త్వయుక్తిఁ
బెరిగి నేఁ డిదె యెక్కుపెట్టుచున్నాఁడు:
అదరకు భూదేవి! యాత్మలో నీవు;
చెదరి చలింపకు శేషాహి! నీవు;
కడఁక ధరింపుము కమఠేంద్ర! నీవు;
కడు నేమరకుఁడు దిక్కరులార! మీరు;
గడగడవడఁకకు కమలబాంధవుఁడ!
జడియకుఁడీ జంతుసంతతులార!
యనియనిపల్కుచో నా మేటివిల్లు
గొనయమెక్కించి కైకొనక రాఘవుఁడు
తన బాహుసత్త్వంబు దర్పంబు మెఱసి
జనకుతో ననియె నా చాపంబు సూపి:
“యిది చాలఁజులకన; యిది చాలఁబ్రాఁత;
యిదిచాలనిస్సార; మిది చాల నలఁతి;
తెగగొన నిలువదు; దీని నా యెదురఁ
బొగడితి పలుమాఱు భూపాల!”యనుచు
సురలుఖేచరులు భూసురులఁగిన్నరులు
నరులును నృపవరుల్ నలిఁబర్వి చూడ
నెడపక తన జయంబెల్లెడఁ జాటు
వడువున విలుగుణధ్వని సెలంగించి
సీతగుణంబులు సెవి సోఁకె ననఁగఁ
జేతివింటిగుణంబు సెవి సోఁకఁదిగిచి.
వడి రక్కసులపట్టు వదలె నన్నట్టు
పిడి పట్టు వదలినఁబెటిలి పేడెత్తి
పెళపెళధ్వనులును బెటపెట ధ్వనులుఁ
గలయ దిక్కులఁబర్వఁగా విల్లు విఱిగె.
విఱిగె రాజన్యుల విపులమానములు;
పఱియలువాఱె భూభాగమంతయును;
చిదిసె దిగ్గజములు; శేషాహిమ్రొగ్గె
బెదరె భూతములుఁ; గంపించె లోకములు;
జనకుఁడు రామలక్ష్మణులును గాధి
తనయుండు నొగిఁదక్కఁదక్కినవారు
బిట్టుల్కి మూర్ఛిల్లి పృథివిపైఁబడిరి
నెట్టనఁబొడము నా నిష్ఠురధ్వనికి.
జనకభూవరుఁడంత సంతోషమంది
ఘనవిస్మయముతోడఁగౌశికుఁజూచి:
“నామాట దప్పక నా ముద్దుఁగూఁతు
నీ మహితాత్మున కిచ్చెద నింకఁ
|