| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
దడయక పెండ్లికై దశరథాధీశుఁ గడుసమ్మదమున నిక్కడికి రావింతు.” నని దశరథునకు నత్తెఱంగెల్ల వినుపించి తోడ్తేర వేడ్కతో నపుడు తన యాప్తమంత్రులఁదడయక పనుపఁ బనిపూనివారుఁ దత్పరబుద్ధి నేఁగి[వా.రా. సర్గ 68] జవనాశ్వములమీఁద సాకేతపురికి దివసత్రయమున కేతెంచి వేగమునఁ దనయులసేమంబుఁ దలపోసి పోసి వనరుచు నున్న యా వసుధేశుఁగాంచి వినతులై జనకభూవిభుఁ డంపినట్టి జననుతవస్తువుల్ సన్నిధిఁబెట్టి: “నీకుమారుఁడు శౌర్యనిధి రామచంద్రుఁ డా కౌశికుని యాగమర్థి రక్షించి జనకుజన్నముఁజూడఁజనుదెంచి యందు మునులు రాజన్యులు ముదముతోఁజూడ ధర సురాసురులకు ధరియింపరాని హరువిల్లు మోపెట్టి యవలీల విఱిచె; విఱిచిన జనకభూవిభుఁ డిచ్చె సీత నఱలేక తన కూఁతు నా రాఘవునకుఁ; బ్రియమారఁబెండ్లికై పిల్వఁబుత్తెంచె; రయమున విచ్చేయు రాజన్యతిలక!” యనవుడుఁ దనమది నానందమంది జనపతి పెండ్లికిఁజాటింపఁ బనిచి ఘనరత్నభూషణకనకాంబరములు జనకుమంత్రులకు నుత్సవమొప్ప నిచ్చి యారంగఁ గులగురుఁడైన వసిష్ఠు ధీరాత్ముఁడగు వామదేవు జాబాలి ఘనునిఁగశ్యపుని మార్కండేయు మహిమఁ దనరుకాత్యాయనుఁ దనయమాత్యులను నిమ్ములఁబిలిపించి యింపారఁబలికె: “సమ్మదంబడర విశ్వామిత్రునొద్దఁ దేజంబుతోడ విదేహుగేహమున రాజిల్లుచున్నారు రామలక్ష్మణులు. అందు రాముఁడు రాజులందఱుఁబొగడ నెందు నసాధ్యమౌ నిందుశేఖరుని చాపంబు విఱిచిన జనకుండు సీత నేపార రామున కీ నిశ్చయించి యెలమిఁబెండ్లికి మమ్ము నేఁగుదెండనుచుఁ బొలుపార వీరలఁబుత్తెంచినాఁడు; జననుతంబగుఁగదా జనకుసంబంధ.” మనిన నందఱుమెచ్చి. రా మఱునాఁడు[వా.రా. సర్గ 69] మొగి వసిష్ఠాదిసన్ములతోఁ గూడఁ దగు బంధురాజన్యతతులతోఁగూడ రమణీయదివ్యాంబరములతోఁగూడఁ గమనీయరత్న సంఘములతోఁగూడఁ గరి రథ భట తురంగములతోఁగూడఁ బరమాప్తపదమంత్రిపతులతోఁగూడ వినుతపుణ్యాంగనా వితతితోఁగూడ ననుపమ వైభవంబలరఁ గైసేసి కరమొప్ప రథమెక్కి కల్యాణమునకు నరనాథతిలకుఁడానంద ముప్పొంగఁ గడఁ గెలంకుల గజస్కంధంబులెక్కి కొడుకులు ముత్యాలగొడుగులనీడఁ బరమసమ్మదమున భరతశత్రుఘ్ను లిరువురుఁగొలిచి రా నేపు దీపింపఁ గ్రందుగా నిండి మంగళవాద్యకోటు లందంద మ్రోయ మహాభూతి మెఱసి యెడనెడ విడుదు లనేక వస్తువుల నడపింప మంత్రులు నాల్గుపైనములఁ జనియె నమ్మిథిలకు;జనకుండు నంత నినకులాధిపునకు నెదురుగా వచ్చి కొనిపోయి వేడ్కలు కొనలొత్త నపుడు జనపతి కుచితోపచారముల్ సేసి: “నా కూఁతు దశరథనరనాథచంద్ర! నీ కుమారునికిచ్చి నిన్నుఁబెండిలికి నిట విల్వఁబంచిన నీవు విచ్చేసి; తటుగాన యేను గృతార్థుండ నైతి. నీ వసిష్ఠమహామునీంద్రుఁడీ వామ దేవాదిమునులు నేతెంచుటఁజేసి నా కోర్కి సిద్ధించె; నా జన్మమొప్పె; నా కులంబతిపావనంబయ్యె నేఁడు; రవికులోత్తములైన రాజులతోడి యవిరళసంబంధమది నాకుఁగల్గె; నెల్లి పెండిలిలగ్న; మిష్టులఁబిలిచి తెల్లంబుగాఁబ్రవర్తింపంగవలయు.” ననవుడు దశరథుండతని వాక్యముల కనురాగమునఁబొంది; “యట్లకా.”కనుచు జనకుఁడమర్చిన సదనరాజమున ననురక్తి వసియించె; నంత నక్కడికిఁ గడుఁబ్రీతి రామలక్ష్మణులు దోనడవ నడరి విశ్వామిత్రుఁడరుగుదెంచుటయు ననఘుఁడు దశరథుండమ్మహామునికి వినతుఁడై తగఁబల్కె వినయంబుతోడఁ: “దనరార నీ దయ ధన్యుండనైతి ననఘాత్మ!”యన విని యా కౌశికుండు: “అకలంకచరితుండవైతి వీ వధిప; సుకృతంబుఁగావించి శుద్ధుండవైతి; రవికులోత్తముఁడైన రాముండు పుత్త్రుఁ డవుట విశేషించి యధికశుద్ధుఁడవు. క్రతురక్షణార్థమై రామలక్ష్మణుల హితబుద్ధినాఁడు మాకిచ్చితి వీవు; నెమ్మది నున్నారు నీ సుతుల్; వీరి నెమ్మిఁగైకొను.” మన్న నృపతికి వారు నా లోన మ్రొక్కిన నలరి దీవించి యాలింగనము సేసె ననురాగమునను. జనకుండు నా దివసంబున నంతఁ దన యాగకర్మమంతయు నెఱవేర్చి మఱునాఁడు కల్యాణమంటపవేది నెఱసి మంత్రులుఁదాను నెమ్మిఁగొల్వుండి[వా.రా. సర్గ 70] యిమ్ములఁదన పురోహితు శతానందు సమ్మదంబునఁజూచి జనకుండు వలికె: “ననఘాత్మ! నాతమ్ముఁడగు కుశధ్వజుఁడు గనుఁగొనవలయు నీ కల్యాణ;మతఁడు దిరముగా నిక్షుమతీ తీరభూమిఁ బొరినొప్పు సాంకాశ్యపురి నున్నవాఁడు.” అని పిల్వఁబంపిన నా కుశధ్వజుఁడు 607దనరారు వేడుకఁ దగ నేఁగుదెంచి యనఘమానసుఁడు శతానందునకును జనకభూవిభునకు సద్భక్తి మ్రొక్కి యెలమి608నమ్మానవాధీశుసమ్మతిని నలువొంద సింహాసనమునఁగూర్చుండె. నంత సుదామనుండనుమంత్రి జనకుఁ డెంతయు ముదమున నీక్షించి: “నీవు సని వసిష్ఠునితోడ సచివులతోడఁ దనయులతోఁగూడ దశరథేశ్వరుని వెరవారఁదోడ్కొని వేగ ర.”మ్మనిన నరిగి యాతఁడు ప్రీతి నమ్మహీపతికి 609వినయంబుతో మ్రొక్కి: “వేడ్కతో నన్ను జనకుఁడు వుత్తెంచె జనలోకనాథ! మీ యుపాధ్యాయులు మీ తనూభవులు మీ యమాత్యులు మీరుమెఱసిరావలయు.” ననిన నా దశరథుండందఱతోడఁ జని సుఖాసీనుఁడై జనకుతో ననియెఁ: “బరగ వసిష్ఠుండు పరమదేవతయు గురువు నీ యిక్ష్వాకుకులమునకెల్ల; సర్వజ్ఞుఁడగుట నీ సంయమీశ్వరుఁడు సర్వకార్యములకుఁ జాలు మా.”కనిన నప్పుడు దశరథునన్వయక్రమము చెప్ప నూహించి వసిష్ఠుఁడిట్లనియె: |