“భూమీశ! బ్రహ్మకుఁబుట్టె; మరీచి
యా మరీచికిఁబుట్టె నమరఁగశ్యపుఁడు;
నతని కర్కుఁడు సుతుఁ;డాజగదాప్త
మతికి వైవస్వతమనువు జన్మించె;
నతనికిఁనిక్ష్వాకుఁడను మహారాజు;
నతనికి మఱి కుక్షి యనునాత్మజుండు;
కుక్షి యన్ భూమీశుకొడుకు వికుక్షి;
యక్షతాత్ముఁడు బాణుఁడతని నందనుఁడు;
నతనికి ననరణ్యుఁ; డతనికిఁబృథుఁడు;
చతురమానసుఁడు ద్రిశంకుఁడాతనికి;
సతతపుణ్యుఁడు హరిశ్చంద్రుఁడాతనికి;
నతనికి లోహితుండను రాజవర్యుఁ;
డతనికి ధుంధుమారావనీ నాథుఁ;
డతనికి యువనాశ్వుఁడనునరేశ్వరుఁడు;
నతనికిఁబ్రియభార్య లతిరూపవతులు సతులిద్దఱుకుఁ బుత్త్రసంతతి లేమి
నంతట నా రాజు నఖిలసన్మునుల సంతతి కొఱకునై సరగ రప్పించి
యా మహాత్ములకును నర్ఘ్యపాద్యములు ప్రేమతోఁదగనిచ్చి ప్రియవాక్యములను
ఘనులార! నన్నును గరుణించి మీరు దనయుల నాకును దయసేయవలయు
నని విన్నవించిన నా రాజునకును ననువొంద నమ్మును లపు డిట్టులనిరి
ఐంద్రయాగముసేయు మవనీశ! భక్తి సాంద్రంబుగాఁబుత్త్రసంతతి గలుగు
నన జన్నమున కప్పు డఖిలవస్తువుల ననువొందఁ దెప్పించె నా క్షణంబునను
నైంద్రయాగంబను నా మఖంబపుడు సాంద్రానుమోదులై సంయమీశ్వరులు
పుత్త్రలాభంబుకై పొలుపొంద నంత చిత్రయజ్ఞము దారు సేయంగ నందు
జలములు మంత్రించి జలకుంభములను నలరార నియతిచే నటు దాఁచియుండ
ధరణీశుఁ డా రాత్రి దప్పితో నంత మఱపొంది యా యజ్ఞమందిరమందు
గలశంబులో నీళ్లు గ్రక్కునఁద్రావ జలహీనమగు కలశంబును జూచి
యెవరు ద్రావిరి జలంబెటుపోయె ననుచుఁ బ్రవిలాత్ములు వారు భావనిరీక్ష
నరసి యా నృపతియే యా నీరు ద్రావు టెఱిఁగి చోద్యంబంది యిది దైవమాయ
యని చూచుచుండఁగ నా నృపాలకుఁడు ఘనమగు గర్భంబు గడువేగఁదాల్చె
గర్భ మంతటఁబడి కడుఁజోద్యమలర నర్భకుండుదయించె నా రాజు చచ్చెఁ
గడఁగుచు ఋషులెల్లఁగడుదుఃఖమంది సడలనియమ్మంత్రసామర్థ్యములను
బనివడి యువనాశ్వు బ్రతికించి రంత ననుపమశుభమూర్తియై యుండె నతఁడు
వరుసతోడుతఁజక్రవర్తి చిహ్నంబు లరుదార నుండెడి యా పుత్త్రుఁజూచి
యితఁ డేడు దీవులు నేలు నటంచుఁ జతురత ఋషులెల్ల సంతోషపడిరి
అల యువనాశ్వుండు నా మౌనిజనుల కెలమితో ధనరాసు లిచ్చినఁజనిరి
తల్లియే లేనికతంబున బాలుఁ డల్లన నాఁకొని యట నేడ్చుచుండ
వరుస నా యింద్రుండు వచ్చి తానప్పు డరయంగ నా శిశువాఁకలిదీరఁ
బెనుపొందఁగా నోరఁబెనువ్రేలు వేగ నునిచిన నమృతంబు నొయ్యనఁద్రావ
సుధ గ్రోలుటయుఁజేసి శుభయుతుపేరు బుధులతో మాంధాతభూమీశుఁడనుచు
నతనికి నామధేయంబటుచేసి యతివేగమునఁ బోయె నా బిడౌజుండు
అంత నా మాంధాత యలపూర్ణచంద్రు నంతటిప్రభతోడ నతిశయిల్లుచును
రూఢిగా యౌవనారూఢుఁడై యంత గాఢశౌర్యస్ఫూర్తిఁ గడుఁదేజరిల్లి
రావణాదుల బహురణముల గెలిచి భూవలయంబెల్లఁ బొందుగా నేలి
విష్ణునిభక్తుఁడై వెలసి యాగములు జిష్ణుబలంబునఁజేయుచునుండె
నా రాజునకు విమలాంగి యన్ సతికి భూరితేజోయుతుల్ పుత్త్రరత్నములు
నరయంగ ముచుకుందుఁ డా సుసంధియును దరుణు లేఁబండ్రును దగ జనియింప
సుదతులప్రాయంబు సొరిది వచ్చినను ముదమున సౌభరిమునిపతి కిచ్చె
నతివల కగ్రజుఁడగుముచుకుందుఁ డతివేడ్క హరిభక్తుఁడై యేఁగె దివికి
నాతనిసోదరుం డా సుసంధియును నాతత పుణ్యాత్ముఁడై భువినేలె
నతనికి ధ్రువసంధి.......... ..........
అతనికి మాంధాత యనుమహీవిభుఁడు;
సుతుఁడు మాంధాతకు సుతుఁడు సుసంధి;
యతనికి ధ్రువసంధి; యన్నరేంద్రునకు
సితకీర్తిరతుఁడు ప్రసేనజిత్తుండు;
దొరయఁబ్రసేనజిత్తుకు భరతుండు;
నరయ నా భరతున కసితుండు వుట్టె;
నతఁడు రాజ్యముసేయ నాతని శత్రు
లతులపరాక్రములైన హైహయులు,
దారుణాకారులు తాళజంఘులును,
నారంగ శశిబిందు లనువారుఁగూడి
యతిఘోరయుద్ధంబు నతులతఁజేసి యతనినె యనిలోన హతుఁజేసి చనిరి
అంత నాతని సతులతి దుఃఖమంది మంత్రుల రాజ్యంబు మఱి తీర్పనునిచి
మేలిమి నుండిరి మెలఁత లిద్దఱును గాళిందియనుసతి గర్భమై యున్న
మేలోర్వలేక యా మెలఁతలందొకతె చాలంగ సవతిమచ్చరమునఁజేసి
గర్భిణియైయున్న కాళింది కపుడు ..........
యతిఘోరముగఁబోరి యనిలోన నతని
హతుఁజేయ నారాజునతివ లిద్దఱును
గర్భిణులై యుండఁగడగి యొండొకతె
గర్భంబుఁజెఱుప నొక్కతె విచారించి
.......... నా విషమున గర్భమట వీడి పడక
తావేగి వేదనఁదల్లడం బంది ..........
యోవక విషము ప్రయోగించె; నంత
నా వనితయుఁ దుషారాద్రికి నరిగి
చ్యవనునిఁగాంచి యా సంయమీంద్రునకు
నవిరళభక్తిఁ బుత్త్రార్థిని యగుచు
నందంద కాళింది యనునాతి మ్రొక్కఁ
బొందుగాఁగరుణ నా పుణ్యుండు సూచి:
“ప్రతిపక్షభయదుండుఁబరమధార్మికుఁడు
నతులతేజుండు మహాత్ముండునగుచుఁ
బొగడొంద గరముతోఁబుత్రుండు నీకు
నగుఁగాక కాళింది!”యనుచు దీవింప
వలగొని యమ్మునీశ్వరునికి మ్రొక్కి
యెలమితోఁదనయింటి కేఁగి యా యింతి
యతిముదంబున నున్న యా శుభాంగికిని సుతుఁడుదయించెను శుభముహూర్తమున
గరమొప్పఁబుత్త్రునిఁగాంచె; నాతండు
గరముతో జన్మించెఁగాన లోకమున
సతతంబు విలసిల్లె సగరుఁడన్ పేర;
నతనికిఁదనుజన్ముఁడసమంజసుండు;
..........గాంచి కాళింది గరముతో ముదమందెఁ గడుసంభ్రమమున
నాతండు శత్రుల నణఁచి రాజ్యంబు చేతోముదంబునఁజేయుచునుండ
అతనితనూజాతుఁడంశుమంతుండు;
అతనిపుత్త్రుఁడు దిలీపావనీవిభుఁడు;
అతని కున్నతపుణ్యుఁడగు భగీరథుఁడు
సుతుఁ;డతనికిఁగకుత్స్థుండను రాజు;
అతని సూనుఁడు రఘువను మహీపాలుఁ;
డతనిపుత్త్రుఁడు పురుషాదుఁడన్ రాజు
కమనీయసితకీర్తి కల్మాషపాదుఁ;
డమితవిక్రముఁడైన యా ధార్మికునకుఁ
బంకజహితవంశపాథోధివిధుఁడు
శంకణుండనఁబుట్టెఁ జతురత; నతని
సుతుఁడు సుదర్శనక్షోణీశచంద్రుఁ;
డతనితనూజాతుఁడగ్నివర్ణుండు;
అతనికి శీఘ్రగుం; డతనికి మరువు
సుతుఁ; డాతనికిఁబ్రశుశ్రుకుఁడు; నాతనికి
సుతుఁడయ్యె నంబరీషుండనురాజు;
సుతుఁడాతనికి నహుషుఁడు; నహుషునకు
సుతుఁడు యయాతి విశ్రుతయశోధనుఁడు
నతనికి నాభాగుఁ; డతనికి నజుఁడు;
నతనికి నతిరథుండగు దశరథుఁడు
సుతుఁడయ్యె; సఫలనిస్తులమనోరథుఁడు
రాముఁ డీదశరథరాజతనూజుఁ;
డేమనివర్ణింతు నే నింక నితని?
నితనికి నీ కూఁతునీఁ గంటి; వీవు
కృతకృత్యుఁడవు; శుభాంకితమయ్యెఁ గులము.”
నని యిట్లురఘువంశ మభినుతి సేయ
విని శతానందుండు విమలమానసుఁడు[వా.రా. సర్గ 71]
సంతోషమునఁబొంది సమయజ్ఞుఁడగుచుఁ
బంతంబు మెఱసి శుంభద్వాక్యసరణి
|