| ఇతిహాసములు | రంగనాథరామాయణము | బాలకాండము |
|
జనకానుమతి సభాసదులెల్ల వినఁగ మునివసిష్ఠునిఁ616జూచి ముదమొప్పఁబలికె: 617“మునినాథ! మీ చేత ముదమార వింటి మనఘాత్ము దశరథునన్వయక్రమము. సన్నుతికెక్కు నీ జనకునన్వయము సెన్నొంద మీ కేనుజెప్పెద వినుఁడు: నిర్మలచరితుఁడు నీతికోవిదుఁడు ధర్మశీలుండు నుత్తమగుణాన్వితుఁడు 618విమలమూర్తి త్రిలోక విశ్రుతకీర్తి నిమి యను రాజు మానితతేజుఁడొప్పు; నతనిపుత్త్రుఁడు మిథి; యతనికి జనకుఁ; డతని కుదావసుం 619డనుమహారాజు; వర్ధిష్ణుఁ డాయుదావసునకు నంది వర్ధనుండుదయించె వంశదీపకుఁడు; పొలుపార నతనికిఁబుట్టె సుకేతుఁ; డలఘువిక్రముఁడగు నా సుకేతునకు రాజర్షియగు దేవరాతుఁడెల్లెడల రాజిల్లె; మఱి బృహద్రథుఁడు దత్సుతుఁడు; నతనినందనుఁడు మహావీరుఁ; డతని సుతుఁడయ్యె సుధృతి; యా సుధృతికి ధృష్ట కేతుఁ;డాతని కురుకీర్తి హర్యశ్వుఁ; డాతనికిని మరుం; డా మరునకును సుతుఁడు ప్రతీంధకక్షోణీశుఁ; డతని సుతుఁడు కీర్తిరథుండు; సుతుఁడావిభునకు దేవమీఢుండు; తదీయుఁడౌ 620విబుధుఁ; డావిబుధునిపుత్త్రుఁడగు మహీధ్రునకుఁ గీర్తిరాతుఁడు; వానికిని మహారోముఁ డార్తిదూరుఁడు; వాని కా స్వర్ణరోముఁ; డా స్వర్ణరోముండు హ్రస్వరోమాఖ్యు భాస్వరగుణశాలిఁబడసె; నాతనికి 621నీ జనకుండును నీ కుశధ్వజుఁడు పూజితకీర్తులై పుట్టి; రా పిదప జనకుఁబట్టముగట్టి సంతోషమంది మునివృత్తి హ్రస్వరోముఁడు దపంబునకుఁ జన సుధన్వుండను సాంకాశ్యవిభుఁడు తనరిన మిథిలపై దండెత్తి వచ్చి సీతాసమేతంబు శివుని విల్లడుగ దూతఁబుత్తెంచినఁ ద్రోపించి వెడల గాసిల్లి జనకుండు కయ్యంబులోన నా సుధన్వునిఁజంపి యధికతేజమునఁ బొలుపొంద సాంకాశ్యపురిఁగుశధ్వజుని నెలమిఁబట్టముగట్టె నింపార.”ననుచు జనకునివంశంబు సద్వర్తనంబుఁ గొనియాడి యా సీతగుణములు వొగడి విశదప్రతాపుని విమలభాషణుని దశరథుఁగనుఁగొని:“దశరథాధీశ! నీ తనూజుని రాము నిత్యాభిరాము సీతతోడుతఁబెండ్లి సెలువొప్పఁజేసి యలఘుకీర్తులు వొందు.”మను శతానందు పలుకుల దశరథపతి యుత్సహించి ఘనుని వసిష్ఠుని గాధినందనునిఁ గనుఁగొని వారితోఁగడువేడ్కఁబలికెఁ: “జారువిచారుఁడీ జనకభూవిభుని మీరడుగుండు సౌమిత్రి కూర్మిళను;[వా.రా. సర్గ 72] బ్రకటగుణోన్నతుల్ భరతశత్రుఘ్ను లకుఁగుశధ్వజుకూఁతులను నడుగుండు.” అన వారు జనకున కత్తెఱంగెల్ల వినుపించి యనుమతి వేడ్కతోఁబడసి జనకునివాక్యముల్ సంతోషమడర దనతోడఁజెప్ప నా దశరథుండలరె. |