ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
విభీషణుఁడు రావణునకు హితోపదేశ మొనర్చుట
నవధరింపుము దేవ! యసురాధినాథ!
యవనిజఁదెచ్చిన యంతనుండియును
దుర్నిమిత్తంబులు దోచుచున్నవియు;
నిర్ణయం బట్టిది నిక్కువంబరయ:
హోమకుండంబుల నున్న త్రేతాగ్ను
లేమియు వెలుఁగవ యీ దివసముల
నా గుండములు సొచ్చి యలమిచుట్టియును
సాగిలిపడియుండు సర్పముల్‌ పెక్కు
ఉడుగని మదముల నొలసి తుమ్మెదలఁ
గడునొప్పు నమ్మదకరులెల్ల నిపుడు
కడు మేను డిల్లమై కంబాలతోడ
మెడలెత్తుకొని138స్రుక్కి మెదలకున్నవియు.
నున్నతస్థితిగల యుత్తమాశ్వములు
కన్నుల నొగి నీళ్లు గాఱుచునుండఁ
గవణంబు నీరును గడ్డియు నుడిగి
జవసత్త్వములు139దూలి సడలియున్నవియు.
నటుగాన యిన్నింటి కసురాధినాథ!
సట140లేల? విను మొక్కశాంతి చెప్పెదను:
శ్రీరామునకు నిమ్ము సీతఁగొంపోయి;
నేరమి వట్టఁ డా నృపకుంజరుండు;
నెందు141నీతిజ్ఞున కిది లెస్స కార్య.
మిందఱు నెఱుఁగరా యిది బుద్ధియగుట
దనుజేశ! నీ చిత్తధర్మంబు నూది
వినుమని చెప్పంగ వెఱతురుగాక!
నాకుఁబోరాదు దానవనాథ! కాన
నీకుఁజెప్పితి నిట్లు నీతిమార్గంబు.”
నని బుద్ధిచెప్పిన యవ్విభీషణుని
వినుతవాక్యంబులు 142వీనులు సొరక:
“యెవ్వరిదిక్కున నే భయంబెఱుఁగ;
నెవ్విధంబున సీత నీను రామునకు.
దుర్జయుండగు నాకు దురములో 143నతఁడు
నిర్జరుల్‌ తోడైన నిలుచునే?”యనుచుఁ
గోపంబు దీపింపఁగొల్వంత విడిచి
వేపోయె దానవవిభుఁడు లోపలికి.
మఱునాఁడు144లేచి క్రమ్మఱ రావణుండు
మఱవక సంధ్యాసమాధులు దీర్చి[వా.రా. సర్గ 11]
యనుజునివచనంబు లాత్మఁజింతించి
తన మంత్రులును దానుఁదలపోయఁదలఁచి
భానుమండలనిభ ప్రభ గలయట్టి
మానైన దివ్యవిమానంబు నెక్కి
కమనీయబహురత్నఖచితంబు లగుచుఁ
గొమరారు 145నప్పైఁడి146కుంభముల్‌ మెఱయ
వెన్నెల147 నురువున విరచించి148నటుల
నున్నతచ్ఛత్రంబు లొప్పారుచుండఁ
గంకణఝణఝణత్కారంబు లెసగ
నంకించి చామర లతివలు వీవఁ
బెక్కుతూర్యంబులు పెల్లుగా మ్రోయఁ
బెక్కండ్రు సుభటులు పెంపారఁగొలువఁ
149గ్రందు గాకుండంగఁగట్టికివారు
సందడి జడియ నైశ్వర్యంబు మెఱయఁ
జనుదెంచి బహుమంత్రిసహితంబుగాఁగ
మనుజాశనుఁడు సభామంటపంబునకు
‘నర్కవంశజు శరాహతిఁదెగి మీఁద
నర్కబింబముఁజొత్తు’నని తెల్పుకరణిఁ
జొచ్చి సింహాసనస్థుండయి పిలువఁ
బుచ్చె నాయకుల నప్పుడు పడవాళ్ల.
వారలుఁ దమ రథావళులపై నెక్కి
వారణంబుల నెక్కి వాజుల నెక్కి150
తమ తమ తూర్యనాదములతో వచ్చి
క్రమమున మంటపాంగణములయందు
దమ వాహములు డిగ్గి తనరుసింహములు
కొమరారఁగా గిరిగుహఁజొచ్చుకరణి
నా మంటపము చొచ్చి యా దానవేంద్రు
చే మన్ననలుగాంచి చిత్తంబు లలర
నుచితాసనమ్ములనుండి151ప్రధాను
లుచితంబు లెఱిఁగింప నుత్తమంబనుచు:
“దేవ! నేఁడెంతయుఁదెలిసియున్నాఁడు
దేవరతమ్ముఁ డుద్దీపితబలుఁడు
ఘనుఁడైన యా కుంభకర్ణుం.”డనంగ
విని:“పిల్వుఁ.”డనవుడు వేగ వారేఁగి:
“దేవారి సభకు నేతెంచి కొల్వుండి
దేవ! నిన్‌ బిలువఁబుత్తెంచె.”నావుడును
గొడుకులు కుంభ నికుంభులు గొలువఁ
గడువేగమునఁగుంభకర్ణుఁడేతెంచి
మణిమయంబై దివ్యమహిమంబు గలిగి
గణికాసమూహంబు గాననాదముల
నెంతయునొప్పారి యెసగినమంట
పాంతరంబునను సింహాసనస్థలిని
నున్న యన్నకు మ్రొక్కి యొగిఁగొల్వు సొచ్చి
యున్నతాసనమున నున్న యా వేళ
నన్నతోడనె వచ్చి యా విభీషణుఁడు
క్రన్ననఁగూర్చుండెఁగనకపీఠమున.
నప్పుడు రావణుండమరవల్లభుని
యొప్పెల్లఁగైకొనియుండి ప్రహస్తుఁ
గనుఁగొని పలికె:“లంకాపురంబునకుఁ
బనుపడఁగాఁబెట్టు బలువైనకాపు.[వా.రా. సర్గ 12]
మఱియు నీ కడ నెల్ల మార్గంబులందు
గిఱికొన్నకోటవాకిళ్ల నెల్లెడల
జతనమైయుండ రాక్షసవీరవరులఁ
బ్రతిదివసంబు లోపలను వెల్పలను.”
అని దానవాధీశుఁ డా కుంభకర్ణుఁ
గనుఁగొని పల్కె నుత్కంఠ దీపింప:

  1. క్రుస్సి
  2. మాని
  3. మేది, మేల
  4. నీత
  5. విననింపుగాక
  6. నెదిరి
  7. రేపు
  8. బంగారుకుండలు
  9. గుబ్బలు
  10. నూలున
  11. నట్టి-యు
  12. వందిమాగధులు గైవారంబుసేయ, దందడిగొనక బ్రద్దలువారుసేరి
  13. విమలచామరములు వెలఁదులు వట్టఁ, దమ తమ విభవముల్‌ తగనొప్ప మెఱసి
  14. పడాలు - రు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )