ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
విభీషణుఁడు రాక్షసవీరులకు హిత ముపదేశించుట
“యురువడింపకుఁడొ హోహో మానుమానుఁ
డరసి కార్యముచూత.”మని విభీషణుఁడు
చిత్తంబులోనఁబేర్చినయింద్రియముల
నొత్తి యడంచినయోగియుఁబోలెఁ,
బరగ గర్జించు నుత్పాత మేఘముల
నిరవునఁబెట్టిన యింద్రునిమాడ్కి,
ననువొంద నెప్పటియట్ల కూర్చుండఁ
బనిచి129కార్యము ముట్టఁబలికె వారలకుఁ:
“బెనుపొందఁగా సామ భేద దానములఁ
గొనరాని కార్యంబు గొనకొనెనేని
మఱికదా దండం130బుమాయలు దలఁచి
నెఱపుట; మున్నె దుర్నీతి యేమిటికి?
నెసగంగ శాత్రవుఁడేమఱియుండు
దెస శత్రుగెలువంగఁ దీరుఁ; గాదేని
131నాతఱి నొక శత్రుఁడతనిపై విడియ
నే తెఱంగుననైన నేతెంచెనేని,
దానిపై నతనికి దైవశక్తియును
హీనమైయున్న నే పెడలింపవచ్చు.
నెన్నఁడు నేమఱఁ; డెదు రెందులేదు;
మున్నె 132దైవంబు రాముఁడు; కాక మఱియు
హరువిల్లు విఱిచినయట్టి సాహసుఁడు;
పరమవివేకి; దోర్బల జయాధికుఁడు;
మీ చేతసాధ్యుఁడే మిహిరకులేశుఁ
డేచి మీ రీ గతి నెన్ని యాడినను?
గడలేని యా వార్ధిఁగాలువకరణి
వడి దాటిరాఁడె యా వాయునందనుఁడు?
వచ్చి యీ లంకలో వలసిన మాడ్కి
నచ్చెరువంది మీరందఱుఁజూడ
నేమేమిచేసెనో యెఱుఁగరా మీరు?
రామునివీట శూరత్వంబు చూప
నతఁడొక్కవానరుఁ; డట్టి వానరులు
నతనికి నెక్కుడైనట్టి వానరులు
నా వానరుల కెక్కుడైనవానరులు
భావింపఁగా లెక్కపఱుపంగరారు.
మీరు రాఘవుని నెమ్మెయి నోర్చువారు?
వారని కోపంబువలన నేపారి
యెదురును దన్నును నెఱుఁగక పలుకు
టిది వివేకమె దానవేశ్వరులార!
రామలలో నభిరామ యా సీత
రామునిదేవి నరణ్యమధ్యమున
భయమున రామునిఁబలుమాఱుఁజీఱ
రయమునఁదెచ్చె నీ రాక్షసేశ్వరుండు.
మతిలోనఁదలపోయ మనకీడె కాక
యితనికిఁజేసిన యెగ్గేమి యతఁడు?
ఖరదూషణాదులఁగడికండలుగను
ధరణిపైఁ గూల్చెఁగదా యని మీరు
తలఁచెద; రతనిపై దైత్యులపోకఁ
దలఁ133పరు; వారిపై దాడిపోఁదగునె?
తమనేరమిని వారు ధరణిపైఁగూలి
యమరలోకముఁజేరి; రది చెప్పనేల?
మేటివానరు లిట మీఱకమున్నె
కోటలు వారిచేఁ గూలకమున్నె
సౌమిత్రిబాణవ134జ్రము రాకమున్నె
రామునికోపాగ్ని రాఁజకమున్నె
యా యగ్నిచే లంక యణఁగకమున్నె
యీ యసురావళి యీల్గకమున్నె
సీతఁబుచ్చుట లెస్స శ్రీరాముకడకు.
సీతఁదెచ్చినకీడు చేసేతఁగుడుపు.
ధర్మాత్ముఁడా రామధరణీశ్వరుండు;
ధర్మంబువలననె తగ నుండు జయము.”
నని పెక్కుభంగుల నవ్విభీషణుఁడు
దనుజవీరులబల్కి దశకంఠుఁజూచి:
“తలపోయ సుఖమును ధర్మంబుఁజెఱుప
వలఁతియై పెరుగు దుర్వ్యసనంబు విడువు;
సుఖముఁగీర్తియుఁజేయు సురుచిరధర్మ
మఖిలనీతిజ్ఞుండ వగుచుఁగైకొనుము;
చలము మానుము; సుప్రసన్నుండ వగుము;
కులమెల్ల రక్షించుకొనఁ జూచెదేని
జనకజ విడువు; మా జననాథుతోడ
మనకేల వైరంబు మదిమది నుండి.”
యని విన్నవించిన నతని వాక్యములు
విన బుద్ధిపుట్టక వెసఁగొల్వు విడిచి
రావణుఁడంతఃపురంబున కరిగె.
నా విభీషణుఁడంత నా మఱునాఁడు[వా.రా. సర్గ 10]
ప్రథమసంధ్యావిధుల్‌ పరిపాటిఁదీర్చి
రథమెక్కి నలుగడ రాక్షసుల్‌ గొలువ
రమణీయచిత్రతోరణరాజవీథిఁ
గమనీయశిల్పముల్‌ గనుఁగొంచు వచ్చి
పటుహేషితంబులుఁబటుబృంహితములుఁ
బటహశంఖాదుల పటునినాదములు
సేవా గతాంగనా శింజితంబులును
సావాసులడరించు చండహుంకృతులు
సూతమాగధవంది శుభకీర్తనములు
నాతత భట సంకులాలాపములును
మాతంగనిశ్వాసమారుతోద్ధూత
కేతనాంశుకపటాత్కృతు లోలి బెరయ
బధిరదిగ్భాగమై బహుళోర్మిజలధి
విధమున మ్రోయంగ విశ్వాసులైన
రాక్షసవీరుల135రక్షచే నమరి
నక్షత్రపరివృత నవసౌధ136 మగుచుఁ
దెఱపి లే కిభములుఁదేరులు హరులు
గిఱికొన్న నగరివాకిటఁదేరు డిగ్గి
137యాజ్యపాత్రాదుల నర్చితు లగుచుఁ
బూజ్యగుణంబుల భూసురోత్తములు
పుణ్యాహవాచన పూర్వంబులైన
పుణ్యశాంతులు సేయఁబొరిఁగనుంగొనుచు
మనసొప్ప నాస్థానమంటపంబునకుఁ
జనుదెంచి యన్నకు సద్భక్తి మ్రొక్కి
యలరి యాతఁడు సూప నర్హపీఠమున
నెలమిమైఁగూర్చుండి యేకాంత మెఱిఁగి
మంత్రులసన్నిధి మహనీయమంత్ర
తంత్రజ్ఞుఁడనియె నా దశకంఠుతోడ:

  1. శౌర్యము వుట్టఁ
  2. పు మాయలఁబెనఁచి
  3. నా తల
  4. రాముఁడు దైవమూలంబు గాన
  5. పుచు
  6. ర్ష
  7. లక్షల
  8. మనఁగ
  9. పాద్యాదివిధుల సంభావితుండగుచు- వేద్యంబుగాఁగ నుర్వీ సుపర్వాళి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )