| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
అనుచు విలాపింప నఖిల వానరులు మనముల శోకాబ్ధిమగ్నులై.రంత ననికిఁగ్రమ్మఱవచ్చె నా మేఘనాదుఁ డను బుద్ధి దూరస్థులైన వానరులు ఘనతరాంజనశైలకల్పుఁడై యున్న తనుఁజూచి వెరవ గదాపాణి యగుచు సైన్యమధ్యంబునఁజరియించు కపుల దైన్యంబుఁబాపుచుఁదగ విభీషణుఁడు[వా.రా. సర్గ 50] ఏతెంచి రవిసూతి నీక్షించి పలికె: “నీ తెఱంగునఁమీకు నేల శోకింపఁ? గైకొని యిది యుద్ధకాలంబు గాని శోకింప వేళయే సుగ్రీవ, మనకు? దుర్ణివారోర్మిబంధురమైన జలధిఁ గర్ణధారుఁడు లేని కలము చందమున మన సైన్యమున్నది; మన కింక వేగ ననికి నుద్యోగించు టదియె కార్యంబు.” అన విని యంగదుఁడా విభీషణునిఁ గనుఁగొని: “నీ మాట గడునుత్తమంబు; నరనాథతనయులు నాగపాశమ్ము లురువడిఁబెనఁగొన నుర్విపై నొఱగి బాణక్షతంబుల బలువిడి వెడలు శోణితంబుల బ్రుంగి సోలియున్నార. లీ దాశరథుల మీ రేమఱకుండుఁ; డాదిత్యుఁడుదయాద్రి కరు821దేకమున్న యేను రాక్షసకోటినెల్ల నిర్జించి జానకిఁదెచ్చెద జననాథు కడకు; హనుమంతుఁడాదిగా నఖిలవానరులఁ గొని కవాటములతోఁగోటలతోడఁ దోరణశ్రేణులతోఁగూడ లంకఁ దోరంపుఁబిడికిళ్లఁదుమురు సేసెదను; విస్మయంబుగ బంధువితతితోఁగూడ భస్మంబు సేసెదఁబంక్తికంథరుని; నా విక్రమంబును నా భుజాబలము భూవరువలన నా పూనుభక్తియును దెల్లంబుసేయుదుఁ దెగువతో నెల్లి యెల్ల భూతంబులు నీక్షింపనిమ్ము. మలయజ కేయూరమహితానుభూతిఁ బలుమాఱుఁగన్న నా బాహుదండమ్ము లనవరతంబును నధికదర్పమునఁ దనరుచున్నవి రఘూత్తముకార్యమునకు; రావణు నిర్జించి రఘువీరుఁడలర నీ విభీషణు లంక నెలమి నిల్పెదను; గాదేని నాజి రాక్షసునిచేఁజచ్చి పోదును సౌమిత్రిపోయినత్రోవ.” నన విని సుగ్రీవుఁడంగదుఁజూచి: “తనయ! నీ వింక నీ దశరథాత్మజులఁ గొనిపొమ్ము కిష్కింధకును వేగ;మేనుఁ జని యింద్రజిత్తుని సకలరాక్షసుల రావణు నిర్జించి రఘురాముదేవి నే విధంబుననైన నేఁదెత్తు వేగ.” ననిన సుగ్రీవుని నా రామవిభునిఁ గనుఁగొని ఖిన్నులై కపులు భీతిల్లి మునుకొని శోకాబ్ధి మునుఁగ సుషేణుఁ డనువాఁడు వలికె నయ్యందఱఁజూచి: “యీ నాగపాశంబు822లెల్లఁబాయుటకు వానరేశ్వరులార! వలను సెప్పెదను: దొల్లి దేవాసురోద్ధురసంగరమున నెల్లదేవతలకు నివి గట్టియున్న దేవత లప్పుడు దివ్యౌషధముల చే వాని బాధఁబాసిరి కట్లువీడి. యా యౌషధము లిప్పుడమృతాబ్ధి కవలఁ బాయకున్నవి ద్రోణపర్వతస్థలిని. హనుమంతుఁబుచ్చుఁడీ యాతఁడు వోయి కొనివచ్చు; మీ రిట కుందంగ వలవ.” |