ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
నారదాగమనము
దనునంత సూర్యసహస్ర సంకాశుఁ
డన నొప్పి కృష్ణమృగాజినం బమర,
మెఱుఁగులు గల శుభ్రమేఘంబుఁబోలె
నెఱయుపింగళజటానిచయంబు వెలుఁగఁ,
బొనర నుదుట నూర్ధ్వపుండ్రంబు వెట్టి,
తనరంగఁగౌపీనదండముల్‌ దాల్చి,
రమణమై నొప్పునారాయణమంత్ర
మమలమై తనవీణయందొప్ప మ్రోయఁ,
దనతోడి యోగీంద్రతతి నాకసమున
నునిచి, చిత్తంబున నుల్లాస మొదవఁ,
బరమ యోగీంద్రుండు పరతత్త్వవేది
పరమపావనమూర్తి పరమవైష్ణవుఁడు
నారదుఁ డా రామనరనాథుఁగాన
గారవంబున వచ్చి కరములు మొగిచి
వలగొని యా రామవసుమతీశునకుఁ
దలకొన్న భక్తితోఁదగ విన్నవించె:
“దేవ! నిన్‌ బ్రహ్మాది దేవతలెల్ల
నా వార్ధిమధ్యంబునం దొప్పఁగాంచి
రావణబాధాపరంపరల్‌ సెప్పఁ
గా విని వారిపైఁగరుణించి నీవు
వారిఁబ్రోచుటకు రావణునిఁద్రుంచుటకు
ధారుణిఁబుట్టితి దశరథేశునకు.
నటుగాన నీ విటు లలమటఁబొంద
నిట తగునయ్య? మహీపాలవర్య!
నీ నామ మాత్మలో నిలిపినంతటనె
భూనాథ! యజ్ఞానములు పొంద823వనిన
నీకు నజ్ఞాన824ంబునెపమైనఁ గలదె?
చేకొని నిను నీవు చింతింతుగాక!
నారాయణుఁడవు; పూర్ణజ్ఞాన నిధివి;
చారుకౌస్తుభరత్న సహితవక్షుఁడవు;
ననిశంబు లక్ష్మికి నాటపట్టయిన
ఘనతరాంగంబులు గలుగు దేవుఁడవు;
నాదిదేవుఁడవు; సర్వాంతరాత్ముఁడవు;
వేదవేద్యుండవు; విశ్వరూపుఁడవుఁ;
దలఁ825చు యోగీశ్వరధ్యానంబులందు
నలువొందు సచ్చిదానందరూపుఁడవు.
ధరణి యంఘ్రులు; వియత్తలము మస్తకము;
పరపైననిటలంబు పద్మాసనుండు;
కన్నులు చంద్రుండుఁగమలమిత్రుండు;
నున్నతంబగుచున్న యూర్పు మారుతము;
వదనంబు శిఖి; ప్రణవంబు
వెలసిన హృదయంబు; వీనులు దిశలు;
మహనీయధర్మంబు మనసు; దేవతలు
బహుజయస్థితిగల్గు బాహుసమృద్ధి;
గొనకొన్న బ్రహ్మాండకోటులు గుక్షి;
తనరారు తొడలు మిత్రావరుణులును;
నశ్వులు నొగిజాను లాత్మలోఁజూడ;
విశ్వంబు నీ రోమవితతి చింతింప.
నిదె చూడుమా 826దేవ! యెల్లదేవతలుఁ
గదిసి కిన్నరయక్షగంధర్వ827వరులు
నాదిగా వచ్చి జయంబు నీ828కొఱకు
మేదినీశ్వర! కోరి మింట నున్నార.
లకలంక మతివి గ మ్మజ్ఞాన ముడిగి;
సకలరాక్షసులను సమయింపు వేగ.
వారక నరులైనవారు సంసార
పారంబుఁజేరు నుపాయంబు లేక
829బాళి నా శాపాశబద్ధులైరేని
నీ లీల830యని నటియించుట కాక
నీవేల యీ సర్పనిచయంబుచేత
భావింపఁగాఁగట్టుపడుదు శ్రీరామ!
నీ వాదిమూర్తివి; నీ మూర్తిఁదలఁపు.
నీ వాహనంబైన నీ కేతువైన
గరుడుండు వచ్చిన గరుడనిచేత
నురగపాశములెల్ల నూడు నీక్షణమె.”
యని చెప్పి దీవించి యా నారదుండు
చనియెఁ గ్రమ్మఱ సుధాసాగరంబునకు.

  1. వెఱచు
  2. మే నెపమునఁగలదు?
  3. వీరె
  4. పతులు, మునులు
  5. దెసకు
  6. బారయా, భారసా… నీ రీతి యని
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )