ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రామరావణుల మొదటి సమరము
నట రావణుండును నమ్మూర్ఛ దెలిసి
చటులబాణాసన సన్నద్ధుఁడయ్యె.
సౌమిత్రి యటు పరిశ్రాంతి నొందుటకు
నా మర్కటులు భీతి1034నలికి పాఱుటకు
రావణుండేచి పై రాకకు రామ
దేవుండు గోపంబు దీపింపఁబేర్చి
భీకరగుణరవస్ఫీతుఁడై వేగ
నాకారి కెదురుగా నడచుట సూచి
యనిలతనూభవుండనియె రామునకు:
“నినకులాధీశ్వర! యీ రావణుండు
నరదంబుపైనుండు యాలంబు సేయ
వెరవగునే నీకు విభుఁడ! కాల్నడను?”1035
ననవుఁడు గడఁకతో హనుమంతు నెక్కి
యనిమిషకరిమీఁది యమరేంద్రుకరణి
నొప్పి గుణధ్వని యొప్పారఁజేసె
నప్పుడు కోపించి యాటోప మెసగ.
రావణుఁడుగ్రుఁడై రాము నీక్షించి
పావకజ్వాలోగ్రబాణజాలములఁ
గురిసిన, రాఘవక్షోణీశుఁడలిగి
యురుబాణముల నేసె. నురువడి వాని
నింద్రారి దెగనేసె. నేసిన రామ
చంద్రుఁడుద్ధతి నర్ధచంద్రబాణమున
దనుజేశుకోదండదండంబుఁదునిమి
సునిశితభీకరాశుగపంచకమున
మర్మముల్‌ నొప్పింప, మఱియును నొక్క
ధర్మంబుఁగొని యార్చి దశకంధరుండు
పటుబాణమొక్కటఁబవననందనుని
నిటలతటంబేసె1036నిజశక్తి మెఱసి.
యనిలజుఫాల ముగ్రాస్త్రంబు దాఁకఁ
గనుఁగొని కోపించి కాకుత్స్థకులుఁడు
భల్లంబు దొడిగి యాపంక్తికంధరుని
విల్లంతలోపల విఱుగంగ నేసి
యొక్కట సారథి నొకట నశ్వముల
నొక్కట నరదంబు నొకటఁబతాక
నొక్కట గొడుగును నొకట1037ఁజామరల
గ్రక్కున నేసి చూర్ణంబు గావించి
మనుజనాయకుఁడు సమంత్రకశరము
దనుజునివక్షంబుఁదాఁక నేయుటయు
నా రాముశర1038మున నా రావణుండు
వారక కడునొచ్చి వడవడ వడఁకి
యనికి నిశ్చేష్టితుండగు దశకంఠుఁ
గని యర్ధచంద్రమార్గణ1039ము సంధించి
దశదిశలందును దనరినదైత్యు
దశ యడఁగించుచందముఁజూపుకరణిఁ
ద్రిదశులు మెచ్చ నుద్దీప్తకోపమునఁ
బదిమకుటంబులుఁబడి డొల్ల నేసె.
నేసిన మదిలోన నెంతయు స్రుక్కి
భాసురమకుటప్రభావళిఁబాసి
1040గ్రద్దనఁజేయు నక్కయ్యంబుఁదక్కి
1041తద్దయు నిశ్చేష్ట దశకంఠుఁడుండె.
నప్పుడు రాఘవుం డనియె రావణున:
“కిప్పుడు కపులతో నిబ్భంగిఁబోరి
కడు డస్సినాఁడవు; కాన నిన్‌ జంప;
విడిచితి; నీ వింక వేగంబ మరలి

  1. డరి
  2. నా మీఁద వడి నెక్కి నాకారి కెదుర - రామ, విచ్చేయుట రాజధర్మంబు - అనవుడు…
  3. నిపుణుఁడై
  4. నస్త్రముల
  5. హతి
  6. మరి వోసి
  7. క్రందుగఁ
  8. చెందిన భీతి నిశ్చేష్టితుండైన
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )