| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“దేవ! యీ దైత్యుండు దేవారిసుతుఁడు రావణుకంటెను రణగరిష్ఠుండు; చతురంగములయందు సమరంబు సేయ నతి నిపుణుండు వీఁడవనీశతిలక! యరుదైన వేదశాస్త్రాదివిద్యలను బరిణతుం; డెంతయుఁబరతత్త్వవేది; లంక యీ వీరునిలావునఁజేసి శంక లేకెపుడు నిశ్చలవృత్తి నుండు; ననిమిషు లలిగిన ననిఁజావకుండ వనజాసనునిచేత వరముఁగొన్నాఁడు; దివ్యాయుధంబుల దివ్య1382శస్త్రముల దివ్యమంత్రంబుల దీపించువాఁడు; మీఱి యింద్రాద్యనిమిషులను నూఱు మాఱులు గెలిచిన మగఁటిమివాఁడు; వాసవు వజ్రంబు వరుణుపాశంబు నా సమవర్తి యుదగ్రదండంబు ధనపతిగదయు నీతని 1383శస్త్రసమితి ననిశంబుఁగడుఁబ్రతిహతములై యుండు; మనుజాశనుఁడు ధాన్యమాలినియందుఁ గనినపుత్త్రుం; డతికాయుండు వీఁడు. ఈ దానవునిచేత నీ కపులెల్ల మేదినీనాయక! మెదుగక మున్నె సమరంబులో వీనిఁజంపుట లెస్స యమితవిక్రమకేళి.” నని చెప్పుచుండ వాఁడంత1384ఁబటుగుణధ్వని దిక్కు1385లద్రువ వాఁడిమిమై నట వచ్చుట సూచి ఖండనోదగ్రుండు గవయుండు గోము ఖుండును జ్యోతిర్ముఖుండుఁగుముదుఁడు మరుదాత్మజుండును మైందుండు నలుఁడు శరభుండు నీలుండు శతబలి గజుఁడు నాదిగాఁగలుగు మహాకపివరులు మేదినీజంబులు మేటిశైలములు వడి నెత్తికొని యప్డు వానికి నెదురు నడవఁగా నటు చూచి నవ్వి దానవుఁడు: |