| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
కొందఱ నమ్ములఁగొని కాఁడ నేసి, కొందఱ గదలెత్తుకొని బిట్టు వ్రేసి, కొందఱ శూలముల్ గొని తూరఁబొడిచి కొందఱ శక్తులఁగొని నిగుడించి, యందఱ నీ క్రియ నవనిపైఁగూల్చి యందంద పేర్చి తీవ్రాస్త్రఘట్టనల నిగ్రహించుచు నుండ నెఱి నింద్రజిత్తు నుగ్రబాణంబుల కోర్వని కపులుఁ గలఁగఁబాఱెడుకపుల్ కంపించుకపులుఁ దలఁకెడు కపులును దాఁగెడుకపులుఁ గలిగి యప్పుడు చూడఁగపిసేనకెల్లఁ బ్రలయకాలంబైన భంగియై తోచె. దనుజేంద్రతనయుఁడెంతయుఁబ్రతిలేక తనరుబ్రహ్మాస్త్రమంత్ర ప్రభావమున నున్న వానరసేనయును జంపివైచి యున్నత1467జయమున నుగ్రుఁడైయార్చె. గపికోటి నొచ్చినఁగడఁగి సౌమిత్రి కుపితుఁడై యన్నఁగన్గొని విన్నవించె: “దేవ! బ్రహ్మాస్త్రంబు దీపింపఁజేసి రావణసహిత మీ రాక్షసకోటి నంతయుఁజంపెద నానతియిమ్ము చింతింప నేటికిఁజెచ్చెర.”ననుడు: “వీనిమాయలఁజేసి వీనిరూపంబుఁ గానని యప్పుడు కడఁగిలోకములు భస్మంబు సేయుచు బ్రహ్మాస్త్ర మరుగు విస్మయంబుగ బలావిర్భావ మొప్పఁ; గావున వీనికై కడఁగి లోకముల నీ వేల కాల్చెదు నిష్ఠురవృత్తి? నీ రాక్షసుఁడు బ్రహ్మ యిచ్చిన వరము కారణంబునఁజేసి కపి1468సేనఁజంపె. ననయంబు మన మింక నా బ్రహ్మవరము మనమున నొక కొంత మన్నింపవలయు.” ననుచుండ నింద్రజి త్తారఘుకులులఁ గనుదెఱవనిమూర్ఛ గదురంగ నేసె. గర్వితుండగు దశకంఠనందనుఁడు పర్విననీలాభ్రపటలంబు గాఁగ నడరించు కార్ముకజ్యానినాదంబు లుడుగక వెస మ్రోయునుఱుములు గాఁగ వడిఁబూంచి దైత్యుండు వైచుచునున్న బెడిదంపుశక్తులు పిడుగులు గాఁగ నగణితదివ్యశస్త్రావళియందు మిగిలినదీప్తులు మెఱుఁగులు గాఁగఁ బొరిఁబొరిఁబుంఖానుపుంఖంబు లగుచు నరుదెంచు బాణమ్ము లతివృష్టి గాఁగ గఱుల నొప్పిన సెలకట్టియలెల్లఁ దఱచుగా నాడుచాతకములు గాఁగఁ గనకరత్నప్రభాకలితమౌ చాప మనువొంద నింద్రశరాసంబు గాఁగ 1469నసదృశలీల నయ్యగచరులందు వెసఁగ్రమ్ము నెత్తురు వెల్లువ గాఁగఁ బంబి హారములకుఁబాసినమౌక్తి కంబులు నెఱి వడగండ్లును గాఁగ నురలినమకుటమహోజ్జ్వలమణులు పరగిన యింద్రగోపంబులు గాఁగ లాలితంబగు కాహళానినాదములు వాలిన కేకారవంబులు గాఁగ సమధికపటహోగ్రసన్నాహ రవము రమణీయమండూక రావంబు గాఁగ నసమున రఘుపతి హలికుఁడై1470పేర్చి యసురుల విపుల దేహక్షేత్రములను నడరి లోకంబెల్ల నలరంగ1471ముట్టి విడువక యమ్ములు వెదవెట్టుకొఱకు వచ్చిన తొలకరి వానకాలంబు నచ్చున నొప్పారె నా సమయంబు. “కాన కదా యింకఁగడఁగి రాఘవుఁడు మానక బాహుసమగ్రత మెఱసి కలనికి నద్దశకంధరుఁదెచ్చి తలకోఁత కోసి యుద్దండత నుఱుయుఁ దలపోయు.”ననినచందమునఁజిత్రంబు వెలయ డెబ్బదిరెండు వెల్లువలైన వనచరవరుల భూవరుల జయించి ఘనతరజ్యానాదకలితుఁడై మగుడి యాలంబు సాలించి యా యింద్రజిత్తుఁ డా లంకలోపలి కరిగె నవ్వుచును. మనుజేశు దురవస్థ మది1472 విచారించి కనుఁగొనఁజాలక1473కన్నులు మొగిచి[వా.రా. సర్గ 74] కొని తొలఁగిన మాడ్కిఁగ్రుంకె నర్కుండు వనచరవరముఖవనజముల్ 1474ముడుఁగఁ గపికోటిచే లంక గాలుచో ధూమ ముపమింప నీ గతి నుండు నన్మాడ్కిఁ గడు నగ్గలముగ లోకంబెల్ల 1475నిండి తడయ కెంతయు నంధతమసంబు వర్వె. నప్పుడు తొడఁగి బ్రహ్మాస్త్రమంత్రంబు నొప్ప జపింపంగ నొకటియుఁగాక యున్న విభీషణుం డుర్వరఁగూలి యున్న సుగ్రీవాదియోధులఁజూచి: “వనచరులార! గీర్వాణారిసుతుఁడు వనరుహగర్భునివరమునఁజేసి పన్ని యేయుటయును“బ్రహ్మాస్త్రశక్తి మన్నింపఁదగు.”నని మనమునఁదలఁచి వంచించి యా రామవసుమతీనాథుఁ డించుక సైఁచినాఁడింతియ1476”యనుడు వాయుసూనుఁడు బ్రహ్మవరమునఁజేసి యా యింద్రజిత్తు దివ్యాస్త్రసంతతులఁ జావకుండుట విభీషణుతోడ ననియె: “భావింత మిప్పుడు భండనభూమి నిట పడ్డవారిలో నెవ్వరు గలరొ పటు బాణహతులయ్యు బ్రదికినవార!” లని యిద్దఱును గూడి యంధకారమునఁ గొనకొని మండెడుకొఱవులు1477వట్టి కొని కలనెల్లను గ్రుమ్మరు1478నపుడు ననయంబు నా సంగరావనిలోన నందంద యుడుగక యాడునట్టలును గ్రందుగా మాంసముల్ 1479గఱచుభూతములు బెడిదంబుగా నార్చుభేతాళములును నడరెడురక్తంబు లానుడాకినులుఁ గండలు1480కబళించు కంకగృధ్రములు నొండొండ యెలుఁగించు నురుసృగాలములుఁ గెడసి నెత్తురులుగ్రక్కెడు భల్లుకములు నుడుగక యందంద యొరలు క్రోఁతులును 1481గుదిసి కాళులు దన్నికొనుబలీముఖులుఁ గదిసిన1482దంతముల్ గల ప్లవంగములు లావఱి పడిన గోలాంగూలములును భావింపరాని రూపముల వానరులుఁ గీలాలవారిఁదోఁగిన యద్రిచరులుఁ గేలిమై దూళి బ్రుంగిన నగచరులు1483ఁ బదుర1484నేఁబండ్రను బ్రదర మొక్కటను గుదులుగ్రుచ్చినక్రియఁగూలినకపులు నంతంతఁదుత్తుమురైన శైలములు నింతింతలైన మహీరుహములును ఖండంబులైన రాక్షసులశూలములు దండిగాఁదునుకలై ధరఁబడ్డ గదలు నిండంగ సామజనికరముల్ సమర మండలిఁబడియున్న మఱి వెఱఁగంది కనుఁగొని ఖిన్నులై కడుదుఃఖమడర ననిరి విభీషణహనుమంతు లపుడు: “వలయుకార్యము జాంబవంతుని నడుగ వలయుఁ; గార్యంబు లవల నాతఁడెఱుఁగు; నతఁడున్నయెడ యింక నరయుద;మరసి యతఁడు సెప్పినత్రోవ నరుగుద.”మనుచుఁ గలనెల్ల వెదకుచుఁగనుఁగొని రపుడు బలితంపు శరశయ్యఁబడియున్నవానిఁ. గని జాంబవంతు డగ్గఱి దైత్యనాథుఁ డనియెను బెద్దయు నార్తుఁడై యపుడు: “బ్రదికియున్నాఁడవె? పలుకంగఁగలవె? యిదె ఋక్షరాజ! మమ్మెఱుఁగుదే?”యనిన దానవుశరహతి దర్పంబు దూలి హీనస్వరమున ఋక్షేశుఁడిట్లనియె: “స్వరవిశేషంబు విచారించి బుద్ధిఁ బరికించి నీ వని పలికెదఁగాని కన్నుల నమ్ములు గాఁడుటఁజేసి సన్న దృష్టులు; విభీషణ! కానరావు; చెవులకు నింపుగాఁజెప్పుము నాకుఁ; బవమానసూనుండు బ్రదికియున్నాఁడె?” యనవుడు వెఱఁగంది యా జాంబవంతు కనియె విభీషణుఁడతి సంభ్రమమునఁ! “గడువెఱఁగయ్యెడు; ఘనుఁడైన రాము నడుగక లక్ష్మణు నడుగక యినజు నడుగక యంగదు నడుగక యతని నడుగుట యే తలంపగు ఋక్షరాజ!” యనుడు:“విభీషణ! హనుమంతుఁడొకఁడు తనువుతో నుండినఁదరుచరులెల్ల బ్రదుకుదు; రాతఁడు బ్రదుకఁడేనియును బ్రదికియుండియునైన బ్రదుకరు కపులు.” ననుమాట విని ముదంబంది వాయుజుఁడు తన పేరుసెప్పి పాదములకు మ్రొక్కె. మ్రొక్కిన నెఱిఁగి యిమ్ముల ఋక్షరాజు తక్కక యాత్మ ముదంబునఁబొంది తనుఁబునర్జాతుఁగాఁదలపోసి యనియె ననిలనందనుతోడ నర్థి దీపింపఁ: “దలపోయ వాయునందన! నీవు దక్కఁ గలుగునే యొక్కఁడీ కపులకు దిక్కు! అదిగాన నీ విప్పుడంబుధి దాటి వదలక యా హిమవంతంబుఁగడచి హేమకూటంబును ఋషభపర్వతము నా మేరువును రజతాద్రియుఁగడచి శ్వేతాచలము దాటి శీఘ్రత మెఱసి యాతతంబగు లవణాంబుధి దాటి యరిగి శాకద్వీపమవ్వలి కేఁగి తరఁగల నొప్పు సుధావార్ధి దాటి చంద్రశైలద్రోణశైలమధ్యమున సాంద్రదీధితుల నుజ్జ్వలత వహించి తిరమైన యా యోషధీశైలమెక్కి కరమొప్ప సంజీవకరణి, విశల్య కరణియు, సంధానకరణి, సౌవర్ణ కరణియు, నా నాల్గు గల వౌషధమ్ము. లవి దెచ్చి యీ వానరావలినెల్లఁ బవనతనూభవ! బ్రదుకంగఁజేసి రాగంబు నొందింపు రామలక్ష్మణుల వేగంబె.” యనవుడు విని వాయుసుతుఁడు |