| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నంత మందోదరి యాదిగా దనుజ కాంతలు గూడి లంకాపురి వెడలి[వా.రా. సర్గ 113] యడుగులకెంజాయ లవనిపైఁదొరుగఁ దడఁబడి మేఖలాదామముల్ సడల, నఱగౌనులసియాడ, నలసయానము2353లు మెఱయ, లోయలఁతల మెయిదీగ లులియ, హారముల్ దెగిరాల, నశ్రుపూరములు తోరంబులై యొల్కఁ,దొలఁగఁబయ్యెదలు, వీడిన వేణులు వెన్నుల నొరయ, వాడిన మోములు వఱువట్లు వట్ట, మొకములు నురములు మొగిమోఁదుకొనుచుఁ, బ్రకటరోదనములు బహువిలాపములుఁ, గుది2354యక రోదసీకుహరంబు నిండఁ, గదిరెడుశోకాగ్నిఁ గ్రాఁగుచు వచ్చి, విఱిగిన రథములు, వికలభావమునఁ బఱియలై పడిన కపాలకుంభములుఁ, దునిసినచేతులుఁ, దునియలైయున్న 2355తనువులు, నుఱుమైన దంతిదంతములుఁ జిదిసినతలలు, విచ్ఛిన్నంబులైన గదలును, బొడియైన ఘనకంకటములు దెగిన గుండియలు, నుద్ధృతమస్తకములు, బగిలినగళములు, భగ్నశస్త్రములుఁ, బ్రేవులప్రోవులుఁ,బిశితఖండములు, జీవముల్ విడిచియుఁజెలువొందు2356కరులు, హయములచిద్రుపలు, నద్రిశృంగములు2357 బయిఁబయిఁబడిన కబంధబృందములు, నిలువక పాఱెడునెత్తురు2358టేర్లఁ గలసి మెండుగఁబాఱుకరటి2359తుండములు, నడ్డంబు నిడు2360పులై యద్రులక్రింద గ్గ్రుడ్డులు 2361వెలువడఁగూలినభటులుఁ, జేకొనిశవములఁజిఱ్ఱుముఱ్ఱాడు కాక ఘూకానేక కంకగృధ్రములు, రామశరక్షత రక్తపానములు సోమపానము లని సోలుభూతములు, రామునిఁగికురించి రాక్షసేశ్వరుఁడు భూమిజఁదెచ్చుటఁబొగడు భూతములు, శిరములు వదియను జేతు లిర్వదియు నరుదార నొకరిత్తయట్టఁ బొందించి: “దైతేయకులనాథ! తగదు; రామునకు సీత ని.”మ్మని బుద్ధిసెప్పుభూతములుఁ, గ్రోఁతిబొందులు సొచ్చి క్రోఁతులై వచ్చి బ్రాఁతిగాఁగరటికబంధముల్ దెచ్చి వడిఁబేర్చి ఘనరక్తవార్ధిలో వైచి కడఁకతో సేతువుఁగట్టు భూతములు, “నారాయణుఁడ నేను; నాకులు మీరు మీరు రాక్షసు;”లని మేరలు సేసి పనివడి కరటికబంధంబు దెచ్చి ఘనతఁబ్రేవులు శేషుఁగాఁ2362జేసిచుట్టి కోరి రక్తాబ్ధిలోఁగొనితెచ్చి వైచి ధీరత మించి మథించు భూతములు, “మా రాముబాణనిర్మథితమాం2363సముల కీ రాదె నీ నాక; మేల యిచ్చెదవు సొలవక మేఁక2364నంజుళ్లకు?”ననుచు నలి నింద్రుదెసఁజూచి నవ్వుభూతములు, “మదిఁజేవ గలిగి కుమారతారకులు కదిసినసంగరాంగణముఁజూచితిమి; యదయులై విషకంధరాంధకాసురులు కదిసినసంగరాంగణముఁజూచితిమి; త్రిదశేంద్రవృత్రులు దెగువమై మెఱసి కదిసిన సంగరాంగణముఁజూచితిమి. యీ మాంసఖండంబు లీ కబంధంబు లీ మహారక్తంబు లీ వింతచవులుఁ బొడగానమే.”మని పొంగియొం2365డొండ యడరుచు2366ఁదొడరుచు నాడు భూతములు, రవికులాధిపుఁడైన రాము విక్రమముఁ దివుటమైఁగడఁగి కీర్తించు భూతములు, “నీ రామువిక్రమం బేటి విక్రమము? ఘోరాహవంబులు కోటులు సలిపి వరమాంసరక్తప్రవాహముల్ వఱపి పరితృప్తి గావించుపంక్తి కంధరుని ననిమొనఁదెగటార్చె; నా చవులింక మన కెందుఁగల!”వని మఱుఁగుభూతములు, నురుతరధ్వజదండయుగళముల్ నిలిపి పొరిఁబొరిఁబ్రేవులు పొందొంద ముడిచి పరమసమ్మదముతోఁబ్రమదలుఁదారు సరసడోలాకేళి సలుపుభూతములు, నెమ్ములు నమ్ములు నెడగల్గఁద్రోసి యిమ్మైనచోటుల2367నెలమితో నిలిచి ప్రియమొప్పఁబ్రియులును బ్రియలునుగూడి ప్రియరక్తపాన సంభృతకేళిఁదేలి ‘చెలువొప్ప రాముఁడు సీతతోఁగూడి వెలయుఁగా!’కంచు దీవించు భూతములుఁ గలిగి భయంకరాకారమైయున్న కలహరంగముఁజొచ్చి కడు2368ఁజోద్యమంది పనవుచు నేడ్చుచుఁబతిఁబేరుకొనుచుఁ జనుదెంచి యందు రాక్షసవధూజనము తునిసి నెత్తుటఁదొప్పఁదోఁగిన కేలు తనుపారు కిసలయతల్పంబు గాఁగ, నకలంకతరములై యడరి పైఁబర్వు మకుటారుణోదగ్ర మణిగణప్రభలు తనువెక్కఁగప్పినఁదద్దయు నొప్పు ఘనధాతు వస్త్రనికాయంబు గాఁగ, నలవడఁబర్వి సర్వాంగంబులందుఁ దలకొన్న మెదడు చందనచర్చగాఁగఁ, జతురసంఘట్టనజాతా2369స్థిరజము ప్రతిలేనిపుష్పపరాగంబుగాఁగఁ, దాలసముత్తాలదండముల్ విఱిగి వ్రాలి2370తూలెడు రథధ్వజసమూహములుఁ గోమలవిమలదుకూలఖండములు వేమఱుఁబై వీచువీవనల్ గాఁగ, నంతంతఁ జుట్టును నవనిపై నున్న దంతావళోరుముక్తాఫలావళులు వరుసతోఁబడిసిపో వైచినఁజెదరి కరమొప్ప మల్లికాకళికలు గాఁగ, నరుదుగాఁబర్విన యా రామచంద్రు శరచంద్రికలచేత సంతాప మంది వీరలక్ష్మీఘనవిరహాగ్నిఁగ్రాఁగి ధారుణిఁబడియున్న దశకంఠుఁగనిరి. కని యంత శోకాబ్ధికరడులఁదేలి దనుజేశుపైఁబడి దానవాంగనలు |