| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“వనిత సెమర్పదు; వాడదు మోము; తనువల్లి గందదు; తలఁక దింతయును. బొలఁతి ధరించిన పుష్పమాలికలు నలుఁగవు;2438తెరలదు నాతి మైపూఁత.” యనుచు దైత్యులు కపు లందంద2439నిక్కి కనుఁగొంచు నడలుచుఁగళదశ్రులగుచు “జగతీశుఁడీ పుణ్యసతి నింతపలుకఁ దగ”దంచు:“నీ తెంపుదగ.”దంచునుండఁ గోమలిఁదగ నెత్తికొని వచ్చి ప్రీతి రాముసన్నిధి నిల్పి రాముతో ననియె: “నీవె దైవంబును; నీవె ప్రాణంబు; నీవె చుట్టంబును; నీవె సర్వంబుఁ గానుండు; నొండొకగతిఁజిత్తవృత్తిఁ గాన దీ కల్యాణి; కడుముద్దరాలు; రావణుపనుపున రాక్షసస్త్రీలు వేవురు వేవేలవిధముల వచ్చి తఱిమి నొప్పింతురు; దారుణక్రియల వెఱపింతు; రలఁతురు;వెడ్డ వెట్టుదురు; ఇన్నియుఁజేయంగ నెంతయు సాధ్వి తన్నింత మఱవదు; తలఁక దెంతయును; నీ యందె చిత్తంబు నిలిపి సర్వంబు నీ యధీనము సేసి నిల్చె నీ యింతి. కైకొమ్ము నెమ్మి నీ కమలాక్షి నింకఁ; గైకొనకుండుట గాదు ధర్మంబు.” అని పావకుఁడు వల్క నా రామవిభుఁడు తన మది2440నొక్కింత దడవు చింతించి యాది దేవుండు బ్రహ్మాదులు వినఁగ నా దేవసభలోన నప్పుడిట్లనియె: “నీ యింతిదెసఁ బాప మింతయు లేదు; నా యెడఁదప్ప దున్నత చిత్తురాలు; వెఱపును భక్తియు విమలశీలంబు నెఱుకయు ధైర్యంబు నీ యింతియందుఁ గల! దెఱుంగుదు; నటుగాక దైత్యునకు మెలఁతుకఁగదియరామియునెఱుంగుదును. “అధిగతబహుదోషుఁడగు దశగ్రీవుఁ డధికబలోన్మత్తుఁడై కొనిపోయి తనవినో 2441దారామతరుమధ్యసీమ నునిచినజానకి నూరక తెచ్చె నిలమీఁద రఘురాముఁ;2442డిట్టికాముకుఁడు గలఁడె?దుష్కీర్తికిఁగలఁగఁడేమియును”? నని లోకమునఁబుట్టు నపవాదమునకు జనకజ నిబ్భంగి శాసింపవలసెఁ. గలశంకలన్నియుఁగడతేఱె; నింక మెలఁతుకఁగైకొంటి; మీ మాట వింటి”. నని సమీపంబున నా దేవి నుండఁ బనిచి రాఘవుఁడు చూపఱు సూడ నొప్పె దివినుండి రోహిణీదేవియుఁదాను నవిరళప్రభనొప్పు నమృతాంశుపగిది. నప్పుడు సకలలోకారాధ్యచరణుఁ డొప్పుమహోల్లాస ముల్లంబు నిండ[వా.రా. సర్గ 122] శ్రీమహాదేవుఁడాశ్రితకల్పతరువు రాముఁగనుంగొని రాగిల్లి పలికె: “నెవ్వఁడుద్యోగించు నింతటిపనికి? నెవ్వఁడు సాధించు నీ జగద్ధితము? లోకకంటకుఁడుఁ ద్రిలోకభీకరుఁడు నాకాదిలోక ప్రణామసాధకుఁడు రావణుఁడఖిలవిద్రావణబలుఁడు; రావణు మర్దింపరా దెవ్వరికిని? వీనితోఁబగగొని వీనిపై విడిసి వీని నివ్విధిఁజంపి వీనిఁగాల్పించి బలవిక్రమక్రమప్రౌఢిమ మెఱయఁ గలరె లోకమున నెక్కడనైన మగలు? ఆ రావణునిఁజంపి తనఘ! నీ వలన నీ రేడు జగములు నిటమీఁద బ్రదికె. మీ తండ్రి దశరథమేదినీ నాథుఁ డేతెంచె దివినుండి యీ యొప్పు సూడ. నదె విమానారూఢుఁడై యున్నవాఁడు త్రిదశగణాధీశదీప్తుఁడై వాఁడె. యా జగద్ధితకృత్యుఁడగు సత్యనిధికిఁ బూజానమస్కారములు సేయఁబొమ్ము.” |