| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | తన భర్తను జంపిన రావణుని శూర్పణఖ దూఱుట |
| చం. | విమతజయంబుఁ గాంచి చని వీడు సొరంగనె, పుష్పకస్థిత ప్రమదల యార్త నాదములు వాటిలె వారికిఁదోడు వంత డ య్యు మనముతోడ శూర్పణఖయున్ విలపించుచు వచ్చి యన్న పా దములఁబడెన్ దృగశ్రుజలధారలు గాల్వలు గట్టి పాఱఁగన్ | 99 |
| ఆ.వె. | పడిన యనుజనెత్తి బాష్పాంబుధారలఁ దుడిచి యాదరణము దోఁప మాట లాడఁ దొడఁగు నద్దశాస్యుకర్కశ చిత్త మెఱిఁగి చెలియ లళికి యిట్టు లనియె | 100 |
| ఉ. | వీరులు లేరొ? యెందుఁ బ్రతివీరులపైఁ జనరో? జయింపరో? యీరస మెత్తి నీవలె నికృష్టతఁ జెంది మఱింది నొంచిరే? శూరత నీకుఁ జూపఁదగు చోటులు లేవె? మహోగ్రపాపముల్ దూఱును సైఁచి నా బ్రదుకుఁద్రుంగఁగఁ చేసితి వేమి సేయుదున్ | 101 |
| చం. | పరు లొనరించు పాపములఁబాపి హితాశ్రితబంధుకోటిఁ ద త్పరమతిఁబ్రోవ నోపుదని బాంధవులందఱు నమ్మియున్నచోఁ గరుణఁదొఱంగి నీతియును గాంచక వారల నీవ త్రుంప నె వ్వరు నిను నౌను గాదనెడువారు? నిశాచరచంద్ర! యీయెడన్ | 102 |
| కం. | బలియురగు దొరలు తమ గా దిలి చెల్లెండ్రకు ధనంబుఁదెత్తురు గా కి ట్టుల మఱదిం బొరిగొని నీ వలె వైధవ్యంబుఁదెచ్చువారలు గలరే? | 103 |
| కం. | అని దూఱెడి చెలియలిఁగను గొని యతఁ డనుఁ దుములమునను గుఱు తెఱుఁగక డా సిన నీ పెనిమిటిఁ దునిమితి వెనుక నెఱిఁగి పొక్కిపడితి వెలఁదిరొ! యచటన్ | 104 |
| కం. | చేదప్పిన కార్యములకు వేదనఁబొందుదురె? చాలు విడువు మిఁక మనః ఖేదము విధిఁ దప్పింపం గాఁదరమే నీకు నాకు? గామిని చెపుమా! | 105 |
| ఉ. | ఏమి కొఱంత నీకు? జలజేక్షణ! కోరిన యెల్ల వస్తువుల్ ప్రేముడి నే నొసంగెదఁ దపింపకు నా యనుజాతవైన ని నీ మహిఁదేఱి చూడఁగలరే? సురమానవదైత్యదానవ గ్రామణు లిచ్చ వచ్చిన ప్రకారమునం జరియింపు మెయ్యెడన్ | 106 |
| చం. | మన పినతల్లిపట్టి ఖరమానవభోజివరుండు దండకా వనమున దూషణాద్యనుజవర్గముతో వసియింపఁబోయెడిన్ జను మతఁ డాదరించు నిను సర్వధనంబును నేను బంచెదన్ వనజదళాక్షి! నా కడకు వచ్చుచుఁ బోవుచునుండు మెప్పుడున్ | 107 |
| కం. | నే నొకటియు నతఁడొకటియు నే నీకు మృగాక్షి! యని యనేకగతుల స మ్మానించి ఖరుని రక్ష స్సేనాన్వితుఁ బిలిచి దనుజశేఖరుఁ డనియెన్ | 108 |
| చం. | కవి వచియించె రాక్షసనికాయ్యముగాఁగల దంచు దండకా టవి యటుగాన నిల్వు మచటన్ బదునాలుగువేల రక్కసుల్ భవదనుజన్ములుంగొలువఁ బాళెము పట్టొకచో రహింప నీ యవరజ దీని శూర్పణఖ నారసికొంచు సమాదరంబునన్ | 109 |
| చం. | త్రిశిరుఁడు మంత్రి దూషణుఁడు ధీరుఁడు నీ దళవాయి యంచు న ద్దశముఖుఁ డాతనిం బనుపఁదారును నేఁగి బలంబుతోఁ జతు ర్దశభువనంబులుం దలఁక దారుణవృత్తి ఖరుండు దండకా ప్రశములపాలి మృత్యువయి రాజ్యము సేయుచునుండె నయ్యెడన్ | 110 |
| ఉ. | ఆ దశకంఠుడంతఁ దన యంతిపురం బొకయింత సొచ్చెనో లేదొ? నిజాగ్రపుత్త్రుఁడట లేమి నికుంభిళ నధ్వరక్రియో త్పాదనకాంక్ష నున్కి విని తానునునేఁగెఁ దదాననేక్షణా హ్లాదపరీతబుద్ధియయి యచ్చటి కందఱు వెంబడింపఁగన్ | 111 |