ఇతిహాసములు ఉత్తరరామాయణము ఇంద్రజిత్తు మాహేశ్వర క్రతువు నొనర్చుట
ఇంద్రజిత్తు మాహేశ్వర క్రతువు నొనర్చుట
మ.దశకంఠుం డిటు లన్నికుంభిళ కుదాత్తప్రీతితో నేఁగి యం
దు శుచిప్రోద్ధత హోమధూమకలితాస్తోకార్చిరుద్దీప్తయూ
పశతాకీర్ణముఖార్హమండపగతుం బ్రత్యగ్రయజ్ఞోపవీ
తశిఖాకృష్ణమృగాజినాన్వితు సుతున్‌ దర్శించి ప్రేమంబునన్‌
112
మ.అవలోకంబున కుత్సవం బడర డాయం బోవు నాలోన భా
ర్గవక్లప్తాహుతి వర్ధమానదమునః క్రాంతిం బ్రకాశించు నా
హవదీక్షానిధి మేఘనాదుఁ డనుమోదాయత్తునిం దండ్రిఁ జూ
చి వినీతిన్‌ బ్రణత్తోత్తమాంగుఁడయి మోడ్చెన్‌ రెండు హస్తంబులన్‌
113
వ.అప్పుడు114
చం.ఇరువది చేతులం గొడుకు నెంతయుఁ గూర్మిని గౌఁగిలించి, వే
మఱు నడునెత్తి మూర్కొనుచు మై పులకింప, ముదశ్రువర్షముల్‌
గురియుచు, మోము సారెఁ గనుఁగొంచు సెగం దనువెల్ల గాసిగాఁ
జిరముగ నీడ నేమిపనిసేసెదు? వత్స! గణింపు నావుడున్‌
115
మ.దితిజాచార్యుఁడు వల్కెనాతనికిఁ బంక్తిగ్రీవ! నీ పట్టి దీ
క్షితుఁడై మౌనముఁ దాల్చినాఁడు మును పగ్నిష్టోమముఖ్యంబులౌ
క్రతువుల్‌ పెక్కొనరించె నీశ్వరుని నారాధించి మాహేశ్వర
క్రతువుంజేసిన శంభుఁడీతనికి సాక్షాత్కారమయ్యెన్‌ దుదిన్‌
116
మ.తన కీ రీతిఁబ్రసన్నుఁడైన శివుచే దంభూతవామాంగుచేఁ
గనియెన్‌ కామగమౌ నదృశ్యరథ మక్షయ్యాస్త్రతూణీరముల్‌
ధనువున్‌ దామసి పేరి మాయయుఁ దదస్త్రంబున్‌ రణాజయ్యవ
ర్తనమున్‌ నీ సుతుఁ డీ మఖంబయిన నిన్‌ దర్శించి మాటాడెడిన్‌
117
ఉ.ఈ తరుణాగ్నిహోత్రి గృతకృత్యతఁ జెంది సమస్తశత్రుసం
ఘాతము నుగ్గుసేయు దశకంఠ! యదృశ్యరథాధిరూఢుఁడై
శాతశిలీముఖంబు లురుచాపముఁ జేకొని మింట నిల్చినన్‌
నీ తనయాగ్రణిన్‌ బొదువ నేరఁడు శూలియు నంచుఁదెల్పినన్‌
118
చం.అరుసముఁజెందియున్‌ హృదయ మచ్చటివారి కెఱుంగ నీక యా
సురవిభుఁ డా భృగూద్వహునిఁ జూచి యి దెల్లను మంచి దైన న
ధ్వరములు సేసి శత్రులగు వాసవముఖ్యుల గెల్చె నా సుతుం
డరి భజనంబు సల్పఁ దగునయ్య సురారులకంచుఁ బల్కుచున్‌
119
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju