| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | విభీషణుండు రావణునకుఁ బరాంగనాపహృతి పాపంబని చెప్పుట |
| ఉ. | అచ్చటుఁబాసి సానుచరుఁడై దశకంఠుఁడు మున్నుతాఁ జెఱల్ దెచ్చిన కామినీమణుల దివ్యవిమానము డించునంతలో వచ్చి విభీషణుండు దగవా పరకాంతల బల్మిఁ బట్టఁగా? హెచ్చెనె దీన శౌర్య? మిది యేల యొనర్చితి? రాక్షసేశ్వరా! | 120 |
| ఉ. | అంగన లిందు నీకుఁగొదవా? త్రిదివాంగన లేమి బ్రాఁతి? పు ణ్యాంగనలం బతివ్రతల నార్యుల భార్యలఁదెచ్చి గాసి సే యంగ నఘంబు వాటిలు మహాపయశంబును నగ్గలించు దా నం గడతేఱు నాయువు ఘనద్యుతియున్ సిరియుం బ్రతాపమున్ | 121 |
| ఉ. | అంటిన మండుచుండుట మహానలకీలలు సేరఁబోయినన్ గంటు వహించి యూరుపుసెగల్ నిగిడించుటఁ గాలభోగినుల్ జంట వహింప నాయువు వెసన్ గొనుటన్ గనిపించు మృత్యువుల్ గంటికి లెస్సయున్నఁ బరకాంతలు మేలని కోరవచ్చునే? | 122 |
| ఉ. | ఏ నరుఁ డెప్పు డేమి ఘటియించునొ దత్ఫల మప్పుడే కదా వానికిఁబ్రాప్తమౌ ననెడి వార్త యథార్థతఁజెందె నియ్యెడన్ దాని వచింతు దృష్టముగ దానవనాయక! విన్ము సీమలోఁ జానల నెల్లఁబట్టి రభసంబున నీ విటఁదెచ్చునంతలోన్ | 123 |
| ఉ. | మానక మాల్యవంతుని కుమారికిఁ గూరిమిపట్టియైన కుం భీనస బల్మిఁగైకొని యభీతిమెయిన్ మధుఁడేఁగె నిప్పురిన్ దానవు లడ్డమైన నసిధార నడంచి పరాంగనేచ్ఛ నా త్మానుజఁ గోలుపోయితిగదన్న! విరోధులు చుల్క సేయఁగన్ | 124 |
| ఉ. | అమ్మధుఁడేగుదెంచునపు డబ్ధిమునింగి సమాధినుంటి నే నమ్మెయి మేఘనాదుఁడును యజ్ఞవిధిం జలియింపకుండె నీ తమ్ముడు సుప్తుఁడై యెదిరిఁదన్ను నెఱుంగఁడు గాన వానికిం గ్రమ్మఱి పోవఁగల్గె నలుగం దగ దాతనిమీఁద నింకిటన్ | 125 |
| తే.గీ. | ఏల యని యంటివేని దైత్యేంద్ర! మించి మన సహోదరిఁ గొనిపోయె మధుఁడు వానిఁ బట్టి చంపిన నపకీర్తి బంధుహాని యగు, నుపశమింత మని తెల్పు ననుజుఁగినిసి | 126 |
| ఉ. | మంచి వివేకి వెంత నయమార్గముఁదెల్పెద వే వసించు ప్రో లించుకయైన భీతి వహియింపక యొక్కఁడు సొచ్చి దైత్యులన్ ద్రుంచి సహోదరిన్ బలిమితోఁ గొనిపోయి చెలంగు చున్కి యా లించి సహింపవచ్చునె? భళీ! మధుదానవుఁ డింత హెచ్చునే? | 127 |
| ఉ. | చిచ్చొడిఁ గట్టినట్టు చెడు సింహసటాచ్ఛట లూడ్చు పూన్కికిం జొచ్చుమదాంధు పోల్కిఁదన శూరత రావణుమీఁదఁ జూపఁగా వచ్చెఁగదా మధుండు బహువాక్కులకుం బనియేమి? యిప్పుడే యచ్చెడు గున్నచోటికి రయంబున నేఁగి మదంబడంచెదన్ | 128 |
| వ. | అని దురాగ్రహగ్రహావేశంబున నొడలెఱుంగుక కనుగొనల మిడుంగుఱులు సెదర నదరిపడి యప్పది మొగంబుల పొలదిండి మన్నెవాఁడు తన సన్నిధి నవికస్థలన్యస్త హస్తుండగు ప్రహస్తునింగనుంగొని యిట్లనియె | 129 |