ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణుడు మధుండనురాక్షసుని మీఁద దండెత్తుట
రావణుడు మధుండనురాక్షసుని మీఁద దండెత్తుట
సీ.సంగరోచితగజస్యందనాశ్వపదాతి - వితతి సన్నద్ధమై వెడలఁజేయు
హితమంత్రి సైన్యాధిపతులు మున్నుగఁగల - వారిఁ బిల్వఁగఁ బడవాళ్ళఁబనుపు
నేఁడింత దెలిసియున్నాఁడఁట మన కుంభ - కర్ణు రప్పింపు మిక్కార్య మెంచి
యా విభీషణుఁగొల్చి యేమఱ కీ లంకఁ - గావఁగాఁ దగుసేనఁగాపుఁబెట్టు
 
గీ.మనకుఁదోడుగ మయపుత్త్రి తనయుఁ డేఁగు
దేర నీ వేఁగి పయనంబు దెలుపు మాజి
మధుఁ దొలుత గెల్చి మఱి మీఁద మఘవు గెల్వ
స్వర్గమున కేఁగ వలె నన్న సరగ నతఁడు
130
కం.దొర సెలవిచ్చిన క్రమమునఁ
బరివారము నెల్లఁగూర్చి పణవహుడుక్కా
మురజజయానక ఢక్కా
ద్యురువాద్యరవంబుతో మహోద్ధతి వెడలెన్‌
131
వ.అప్పుడు132
సీ.వెసఁ జేర్చి నలువదివేల యక్షౌహిణుల్‌ - నడచువేగంబునఁ బుడమి వడఁకఁ
గరి హరిరథ భుజంగఖరాదిగత యోధ - జనులహుంకృతి నాకసంబు వగుల
ఛత్త్ర చామరకేతు సంతతచ్ఛాయల - మార్తాండబింబంబు మఱుఁగువడఁగ
సైన్యరజోజాత సాంద్రాంధకారంబు - భటకృపాణప్రభాపటలి నడఁగ
 
గీ.నగ్రమున నుగ్రబలశాలి యగ్రసుతుఁడు
కుంభకర్ణుండు నడుమ నుజ్జృంభలీల
నేఁగుదేరఁగ దశకంఠుఁ డేఁగి మధుని
పట్టణము మీఁద విడిసెఁ దిక్పాలు రదర
133
కం.మధుదైత్యుని పురమున కి
వ్విధమునఁజని కోటచుట్టు విడిసి మహోగ్ర
క్రుధ యోద్ధ లడర దశముఖుఁ
డధికోద్ధతి వాని వీటి కరిగెం బెలుచన్‌
134
ఆ.వె.అరిగి మధుని యంతిపురమునఁ బొడగాన
కచట నిచట నరయు నంతలోన
నా విధంబు విని భయభ్రాంతయై తన
యన్న రోష మడఁతు నని తలంచి
135
కం.మానితవేణీజితకుం
భీనస యనలాభిధాన ప్రియనందన, కుం
భీనస యెదురుగ వచ్చి ద
శానను చరణముల వ్రాలి యార్తి నడలినన్‌
136
కం.అడలార్చి పంక్తిముఖుఁ డ
ప్పడతుక వడి లేవనెత్తి బాలా! నీకున్‌
జడుపేల? యేఁడి మధుఁ డె
క్కడనున్నాఁ డనినఁ బడుచు కళవళపడుచున్‌
137
ఉ.కన్నుల శోకబాష్పములు గ్రమ్మఁగఁబల్కె మధుండు బల్మిమై
నన్నిటఁ దెచ్చుకొన్నపుడె నా విభుఁడయ్యె నతండు క్రూరుఁడై
న న్ననుఁజూచి తాళుటయె నాయము కాదని త్రుంచితేని నో
యన్న! సహింపనేర్తునఁటె? యన్న!మహావిధవాత్వదుఃఖమున్‌
138
ఉ.ఏదొక కార్యముం బదర కించుక తాల్మివహించి చేసినన్‌
ఖేదము సెంద దా నృపతికిన్‌ నను సోదరి గారవించి ము
త్తైదువఁ జేయ నింపొదవినట్లయినన్‌ మధుఁగావుమంచు న
గ్గాదిలితోడు వేఁడ దశకంఠుడు నవ్వుచుఁబల్కెఁ గ్రమ్మఱన్‌
139
ఉ.నెమ్మది వంతమాను తరుణీ! మధుఁగాచితి నిన్నుఁగూర్చి నీ
కమ్మల కెగ్గునేఁ దలఁప గ్రక్కున నా రజనీచరాగ్రణిన్‌
రమ్మను మింద్రు మీఁద బవరం బొనరింపఁగ నేఁడె పోవలెన్‌
నమ్ము మదీయభాష లనినన్‌ వనితామణి సంతసించుచున్‌
140
మ.చని యాభ్యంతర కేళికా గృహమహాశయ్యాస్థలిన్‌ నిద్రవో
వు నిజాధీశు వినిద్రుఁజేసి పటుసత్త్వుండైన మాయన్న యిం
ద్రునిపైఁ బోవుచునుండి నిన్నుఁ దనకెంతో కూర్మిమైఁ దోడు ర
మ్మని ప్రార్థింపఁగ వచ్చె నా విని మధుం డానందముం బొందుచున్‌
141
ఉ.ఆ దశకంఠుఁ జేరఁజని యర్చనలిచ్చి యథోచితంబుగా
సాదరభాషలం బడసి యందఱకుం దగ విందుఁబెట్టి యా
మోదము నెయ్యమున్‌ వినయముం గనిపించిన హృష్టచిత్తుఁడై
యా దినశేష మాతని గృహంబున నిల్చి క్రమించి వేకువన్‌
142
మ.మధురాలాపములన్‌ సహోదరిని సమ్మానంబు గావించి ప్రే
మధురాంచన్మతి నామె వీడుకొని సమ్యగ్బాహుశౌర్యంబునన్‌
మధునింబోలు మఱందిఁదోడ్కొని మహామాత్యుల్‌ భటుల్‌ బంధు ల
మ్మధునిం గూడి పలాశు లాదటఁ జనం బౌలస్త్యుఁ డుప్పొంగుచున్‌
143
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju