| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | సూర్యాస్తమయవర్ణనము |
| మ. | తరుణాదిత్యుల నిగ్రహించుటకుఁగా దండెత్తె నాదిత్యభీ కరుఁ డిప్పంక్తిముఖాసురుం డితని రంగద్దోఃప్రతాపంబు నే జరఠాదిత్యుఁడ నోర్వ నేర్తునె? వృధాచండత్వ మింకేల?నన్ కరణిన్ భానుఁడు మందరశ్మి యగుచున్ గాన్పించెఁ దోడ్తోడుతన్ | 149 |
| సీ. | హంసఖ్యఁగనుట దివ్య స్రైణఘుసృపం - కిలనభోనదిఁగ్రీడ సలిపె నేమొ? యాకాశమణి యౌట నాత్మారుణప్రభా - శ్రేణి గన్పడఁ బ్రకాశించెనేమొ? ప్రతిసంధ్యల నెదుర్చు ప్రబలమందేహదై - త్యులఁదాఁకి నెత్తుటదోఁగె నేమొ? యపరదిక్పతి మిత్రుఁ డనుమైత్రిఁ గెంబట్టు - దనకొసంగినఁ గప్పుకొనియె నేమొ? | |
| గీ. | సప్తసప్తిఖురాఘాత చరమశైల కటకగైరిక ధాతురాగముల నెరసి తనువు నిండిన రక్తిఁ గైకొనియెనేమొ? యనఁగ నరుణిమ జఠరార్కుఁ డపుడు మెఱసె | 150 |
| మ. | అపరక్ష్మాధర మెక్కవచ్చు సరసీజాప్తున్ విలోకించి భీ తిపరీతంబయి తద్గుహాకుహరవర్తిష్ణుత్వమున్ మాని తూ రుపు గట్టెక్కఁగఁ బోవు చీఁకటుల బారుంబోలి నీడల్ సుదూ రపథాక్రాంతి వహించె భానుతనయాప్రస్ఫీతకుల్యారుచిన్ | 151 |
| సీ. | అబ్జినీకాంతశోకాంధకారము నిజో - దరసంగిభృంగకైతవ మనంగఁ జక్రవాకీజాతిస్మరశాతశరహేతి - శోణపక్షప్రభాశ్రేణిఁదెల్ప ఖగపంక్తి దనవియోగమునఁ గాంచు విరాగ - మహిఘోరతరుకోటరాప్తి నుడువ దినలక్ష్మి తుదను జెందిన వివర్ణత్వంబు - వికచకైరవకాంతి విస్తరింప | |
| గీ. | నచల సంఖ్యాశ్వములె కాని యమితవాజి వితతి లేదని కాండాధిపతిని వేఁడు కొనెడు తలఁపున నరిగెనో యనఁగ బశ్చి మాంబునిధి వ్రాలె రుచిమాలి యంశుమాలి | 152 |
| మ. | ఇనుఁ డస్తంగతుఁడైనఁ బాంధజనులన్ హింసింప మారుండు గూ ర్చిన కెందామర మొగ్గగుంపులొ? జగాచెంగల్వపూముల్కులో? యనఁ జండాంశు నిపాత నిస్సహనతావ్యాసంగ బాహ్యప్రవ ర్తనభాగ్బాడబకీలికీలరుచి సంధ్యారాగముల్ రాజిలెన్ | 153 |