| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | దశమస్కంధము - పూర్వభాగము |
| క. |
తెలిపితివి సోమసూర్యుల, కులవిస్తారంబు, వారికులము ధరిత్రీ శుల నడవళ్లును వింటిమి, కలరూపము లెల్ల మాకుఁ గడువెఱఁగులుఁగన్. |
3 |
| క. |
శీలము గల యదుకులమున, నేలా పుట్టెను మహాత్ముఁ డీశుఁడు విష్ణుం? డే లీల మెలఁగె? నెయ్యే, వేళల నే మేమి సేసె వివరింపు తగన్. |
4 |
| క. |
భవములకు మందు, చిత్త, శ్రవణానందము, ముముక్షుజనపదము, హరి స్తవము పశుఘ్నుఁడు దక్కను, జెవులకుఁ దని వయ్యె ననెడి చెనఁటియుఁ గలఁడే. |
5 |
| క. |
మా పెద్దలు మును వేల్పులు, నోపని భీష్మాదికురుకులోత్తమసేనా కూపారము నేకోలము, ప్రాపున లంఘించి రొక్క బాలపదముగాన్. |
6 |
| క. |
మా యమ్మ కుక్షి గురుసుత, సాయకపీడితుఁడ నైన జడు నన్నుం గౌం తేయకురుకులము నిలుపఁగ, నా యుత్తముఁ డాత్తచక్రుఁడై రక్షించెన్. |
7 |
| ఆ. |
కలసి పురుషమూర్తి కాలరూపములను, లోకజనుల వెలిని లోన నుండి జన్మమృత్యువులను సంసారముక్తుల, నిచ్చు నతనిచరిత మెల్లఁ జెపుమ! |
8 |
| సీ. |
ఊహించి రాముఁడు రోహిణికొడుకంచు నప్పుడు యోగీంద్ర! చెప్పి తీవు దేవకికడుపున నే వెరవున నాతఁ డుండెను దేహంబు నొండు లేక? తనతండ్రియిలువాసి వనజాక్షుఁ డేరీతి మందకుఁ బోయె? నే మందిరమున నుండి యెయ్యది సేయుచుండెను? దన మేనమామ కంసుని నేల నామ మణఁచె |
|
| ఆ. |
నెన్ని యేండ్లు మనియె నిలమీఁద మనుజుఁడై?, యెంద ఱైరి భార్య? లెట్లు మెలఁగె? మఱియు నేమి చేసె? మాధవుచారిత్ర, మెంత గలదు? నాకు నేర్పరింపు. |
9 |
| వ. | అని మఱియు నిట్లనియె. | 10 |
| ఆ. |
నీ ముఖాంబుజాతనిర్ముక్తహరికథా, మృతముఁ ద్రావఁ ద్రావ మేను వొదలె, వంత మానె, నీరువట్టు నాఁకలియును, దూరమయ్యె, మనము దొంగలించె. |
11 |
| వ. | అని పలుకుచున్న రాజుమాటలు విని, వైయాసి యిట్లనియె. | 12 |
| క. |
విష్ణుకథారతుఁ డగునరు, విష్ణుకథల్ చెప్పునరుని వినుచుండునరున్ విష్ణుకథాసంప్రశ్నము, విష్ణుపదీజలముభంగి విమలులఁజేయున్. |
13 |
| సీ. |
రాజేంద్ర! విను తొల్లి రాజలాంఛనముల వేలసంఖ్యల దైత్యవిభులు దన్ను నాక్రమించిన భార మాఁగఁజాలక భూమి గోరూపయై బ్రహ్మఁ జేరఁబోయి కన్నీరు మున్నీరుగా రోదనము సేయఁ గరుణతో భావించి కమలభవుఁడు ధరణి నూఱడఁ బల్కి ధాత్రియు వేల్పులుఁ గదలిరా విష్ణునిఁ గాన నేఁగి |
|
| తే. |
పురుషసూక్తంబుఁ జదివి యద్భుతసమాధి, నుండి యొకమాట విని వారిజోద్భవుండు వినుఁడు వేల్పులు ధరయు నే విన్నయట్టి, పలుకు వివరింతు నని ప్రీతిఁ బలికెఁ దెలియ. |
14 |
| క. |
యాదవకులమున నమరులు, మేదినిపైఁ బుట్టఁ జనుఁడు మీ యంశములన్ శ్రీదయితుఁడు వసుదేవున, కాదరమునఁ బుట్టి భార మంతయుఁ బాపున్. |
15 |
| క. |
హరిపూజార్థము పుట్టుఁడు, సురకన్యలు భూమియందు సుందరతనులై హరి కగ్రజుఁడై శేషుఁడు, హరికళతోఁ బుట్టుఁ దత్ప్రియారంభుండై. |
16 |
| ఆ. |
ఈ ప్రపంచ మెల్ల నే మాయచే మోహి, తాత్మ మగుచు నుండు నట్టిమాయ కమలనాభు నాజ్ఞఁ గార్యార్థమై నిజాం, శంబుతోడఁ బుట్టు జగతియందు. |
17 |
| వ. | అని యిట్లు వేల్పుల నియ్యకొలిపి పుడమిముద్దియ నొడంబఱిచి తమ్మిచూలి తనమొదలి నెలవునకుం జనియె, నంత యదువిభుం డయిన శూరసేనుండనువాఁడు మథురాపురంబు తనకు రాజధానిగా మాథురంబులు శూరసేనంబు లనియెడు దేశంబు లేలెం బూర్వకాలంబున. | 18 |
| క. |
ఏ మథురయందు నిత్యము, శ్రీమన్నారాయణుండు సెలఁగుఁ బ్రియముమై నా మథుర సకలయాదవ, భూమీశుల కెల్ల మొదలిపురి యయ్యె నృపా! |
19 |
| సీ. |
ఆ శూరసేనున కాత్మజుం డగు వసుదేవుఁ డా పురి నొక్క దినమునందు దేవకిఁ బెండ్లియై దేవకియును దానుఁ గడువేడ్క రథమెక్కి కదలువేళ నుగ్రసేనునిపుత్త్రుఁ డుల్లాసి కంసుండు చెల్లెలు మఱఁదియు నుల్లసిల్లి హరులపగ్గములఁ జేనంది రొప్పఁదొడంగె, ముందట భేరులు మురజములును |
|
| ఆ. |
శంఖపటహములును జడిగొని మ్రోయంగఁ, గూఁతుతోడి వేడ్క కొనలు సాఁగ దేవకుండు సుతకు దేవకీదేవికి, నరణ మీఁదలంచి యాదరించి. |
20 |
| వ. | సార్థంబు లయినరథంబుల వేయునెనమన్నూటినిఁ, గనకదామసముత్తుంగంబు లయిన మాతంగంబుల నన్నూటినిఁ బదివేలతురంగంబులను, విలాసవతు లయిన దాసీజనంబుల నిన్నూటి నిచ్చి యనిచినం గదలి వరవధూయుగళంబు దెరువునం జను సమయంబున. | 21 |
| క. |
పగ్గములు వదలి వేగిర, మగ్గలముగ రథముఁ గడపు నా కంసుఁడు లో బెగ్గిలి యెగ్గని తలఁపఁగ, దిగ్గన నశరీరవాణి దివి నిట్లనియెన్. |
22 |
| క. |
తుష్టయగు భగిని మెచ్చఁగ, నిష్టుఁడవై రథము గడపె, దెఱుఁగవు మీఁదన్ శిష్టయగు నీ తలోదరి, యష్టమగర్భంబు నిన్ను హరియించుఁ జుమీ! |
23 |
| వ. | అని యిట్లాకాశవాణి పలికిన నులికిపడి భోజకులపాంసనుండైన కంసుండు సంచలదంసుండై యడిదంబు బెడిదంబుగాఁ బెఱికి జళిపించి దెప్పరంబుగ ననుజ కొప్పుఁ బట్టి కప్పరపాటున నొప్పఱం దిగిచి యొడిసి పట్టి, తోఁబుట్టువని తలంపక తెంపు సేసి తెగవ్రేయ గమకించు సమయంబున వసుదేవుండు డగ్గఱి. | 24 |
| క. |
ఆ పాపచిత్తు మత్తుం, గోపాగ్నిశిఖానువృత్తుఁ గొనకొని తన స ల్లాపామృతధారావి, క్షేపంబునఁ గొంత శాంతుఁ జేయుచుఁ బలికెన్. |
25 |
| ఉ. |
అన్నవు నీవు చెల్లెలికి, నక్కట మాడలు చీర లిచ్చుటో మన్నన సేయుటో, మధురమంజులభాషల నాదరించుటో, మిన్నుల మ్రోఁతలే నిజము, మేలని చంపకు మన్న మాని రా వన్న! సహింపు మన్న! తగ దన్న! వధింపకు మన్న! వేఁడెదన్. |
26 |
| వ. | అదియునుం గాక. | 27 |
| మ. |
చెలియల్, గన్నియ, ముద్దరా లబల, నీ సేమంబు చింతించు ని ర్మల, దీనిన్ బయలాడుమాటలకు నై మర్యాదఁ బోఁదట్టి, స త్కులజాతుండవు పుణ్యమూర్తి వకటా! గోపంబు పాపంబు, నె చ్చెలి నోహో! తెగవ్రేయఁ బాడియగునే? చింతింపు భోజేశ్వరా! |
28 |
| సీ. |
మేనితోడన పుట్టు మృత్యువు జనులకు, నెల్లి నేఁడైన నూఱేండ్ల కైనఁ దెల్లంబు మృత్యువు దేహంబు పంచత నందఁ గర్మానుగుండై శరీరి మాఱుదేహము నూఁది, మఱి తొంటిదేహంబుఁ బాయును దన పూర్వభాగ మెత్తి వేఱొంటిపైఁ బెట్టి వెనుకభాగం బెత్తి గమనించు తృణజలూకయును బోలె, |
|
| ఆ. |
వెంటవచ్చు కర్మవిసరంబు, మును మేలుకన్నవేళ నరుఁడు గన్న విన్న తలఁపఁబడిన కార్యతంత్రంబు కలలోనఁ, బాడితోడఁ గానఁబడిన యట్లు. |
29 |
| క. |
తన తొంటికర్మరాశికి, ననుచరమై బహువికారమై మనసు వడిం జను, నింద్రియములతెరువులఁ, దనువులు పెక్కైనఁ జెడవు తనకర్మంబుల్. |
30 |
| ఆ. |
జలఘటాదులందుఁ జంద్రసూర్యాదులు, గానఁబడుచు గాలిఁ గదలు భంగి నాత్మకర్మనిర్మితాంగంబులను బ్రాణి, గదలుచుండు రాగకలితుఁడగుచు. |
31 |
| క. |
కర్మములు మేలు నిచ్చును, గర్మంబులు గీడు నిచ్చు, గర్తలు దనకుం గర్మములు బ్రహ్మ కైనను, గర్మగుఁడై పరులఁ దడవఁగా నేమిటికిన్? |
32 |
| క. |
కావునఁ బరులకు హింసలు, గావింపఁగ వలదు తనకుఁ గల్యాణముగా భావించి పరుల నొంచినఁ, బోవునె? తత్ఫలము పిదపఁ బొందక యున్నే? |
33 |
| మత్త. |
వావిఁ జెల్లెలుగాని పుత్త్రికవంటి దుత్తమురాలు, సం భావనీయచరిత్ర, భీరువు, బాల, నూత్నవివాహ సు శ్రీవిలాసిని, దీన, కంపితచిత్త నీకిదె మ్రొక్కెదం, గావవే! కరుణామయాత్మక! కంస! మానవవల్లభా! |
34 |
| వ. | అని మఱియు సామభేదంబులగు పలుకులు పలికిన వినియు వాఁడు వేఁడిచూపుల రాలు నిప్పులు గుప్పలు గొన ననుకంపలేక, తెంపుసేసి చంపకగంధిం జంపఁ జూచుట యెఱింగి మొఱంగెడితెఱంగు విచారించి తనలో నిట్లనియె. | 35 |
| క. |
‘ఎందును గాలము నిజ మని, పందతనంబునను బుద్ధిఁ బాయక ఘనులై యెందాఁక బుద్ధి నెగడెడి, నందాఁకఁ జరింపవలయు నాత్మబలమునన్. |
36 |
| వ. | అని నిశ్చయించి | 37 |
| సీ. |
ఆపన్నురాలైనయంగన రక్షించి సుతుల నిచ్చెద నంట శుభము నేఁడు మీఁ దెవ్వఁ డెఱుఁగును? మెలఁత ప్రాణంబుతో నిలిచిన మఱునాఁడు నేరరాదె సుతులు పుట్టిర యేని సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చెనేని బ్రహ్మచేతను వీఁడు పా టేమియును లేక యుండునే? సదుపాయ మొకటి లేదె? |
|
| తే. |
పొంత మ్రాఁకులఁ గాల్పక పోయి వహ్ని, యెగసి దవ్వులవాని దహించుభంగిఁ గర్మవశమున భవమృతికారణములు, దూరగతిఁ బొందు, నిఁక నేల తొట్రుపడఁగ? |
38 |
| క. |
కొడుకుల నిచ్చెద నని సతి, విడిపించుట నీతి, వీఁడు విడిచినమీఁదం గొడుకులు పుట్టినఁ గార్యము, దడఁబడదే? నాఁటి కొక్క దైవము లేదే? |
39 |
| క. |
ఎనిమిదవచూలు వీనిం, దునుమాడెడి నంచు మింటఁ దోరపుఁబలుకుల్ వినఁబడియె, నేల తప్పును?, వనితను విడిపించు టొప్పు వైళం బనుచున్. |
40 |
| క. |
తిన్ననిపలుకులు పలుకుచుఁ, గ్రన్నన తగఁ బూజ చేసి కంసు నృశంసున్ మన్నించి చిత్త మెరియఁ బ్ర, సన్నాననుఁ డగుచుఁ బలికె శౌరి నయమునన్. |
41 |
| క. |
“లలనకుఁ బుట్టినకొమరుని, వలనం దెగె దనుచు గగనవాణి వలికె నం చలిగెద వేని మృగాక్షికిఁ, గల కొడుకులఁ జంప నిత్తుఁ గ్రమమున నీకున్”. |
42 |
| వ. | అని యిట్లు పలికిన విని కంసుండు కంపితావతంసుండై సంతసించి గుణగ్రాహిత్వంబు గైకొని కొందలమందు చెలియలిముందల విడిచి చనియె, వసుదేవుండును బ్రదుకు మందలఁ గంటి ననుచు సుందరియుం దానును మందిరంబునకుం బోయి డెందంబున నానందంబు నొందియుండె, నంతఁ గొంతకాలంబు సనిన సమయంబున. | 43 |
| క. |
విడువక కంసుని యెగ్గులఁ, బడి దేవకి నిఖిలదేవభావము దన కే ర్పడ నేఁట నొకని లెక్కను, గొడుకుల నెనమండ్ర నొక్కకూతుం గనియెన్. |
44 |
| వ. | అందు. | 45 |
| ఆ. |
సుదతి మున్ను గన్న సుతుఁ గీర్తిమంతునిఁ, బుట్టుతడవ కంసభూవరునకుఁ దెచ్చి యిచ్చెఁ జాల ధృతి గల్గి వసుదేవుఁ, డాసపడక సత్యమందు నిలిచి. |
46 |
| క. |
పలికిన పలుకులు దిరుగక, సొలయక వంచనము లేక సుతుల రిపునకుం గలఁగక యిచ్చిన ధీరుం, డిల వసుదేవుండు దక్క నితరుఁడు గలఁడే? |
47 |
| ఆ. |
మానవేంద్ర! సత్యమతికి దుష్కరమెయ్య?, దెఱుక గలుగువాని కిష్ట మెయ్య? దీశభక్తిరతుని కీరాని దెయ్యది?, యెఱుక లేనివాని కేది కీడు? |
48 |
| వ. | ఇట్లు సత్యంబుఁ దప్పక కొడుకు నొప్పించిన వసుదేవునిపలుకునిలుకడకు మెచ్చి కంసుం డిట్లనియె. | 49 |
| ఆ. |
కొడుకు నీవు మరలఁ గొనిపొమ్ము వసుదేవ!, వెఱపు లేదు నాకు వీనివలన, నల్గ వీనికి, భవదష్టమపుత్త్రుండు, మృత్యువఁట! వధింతు మీఁద నతని. |
50 |
| వ. | అనిన నానకదుందుభి నందనుం గొని చనియు నానందంబు నొందక, దుష్టస్వభావుండగు బావపలుకులు వినియు నులుకుచుండె, నంత. | 51 |
| సీ. |
ఒకనాఁడు నారదుం డొయ్యన కంసునియింటికిఁ జనుదెంచి యేకతమున ‘మందలోపల నున్న నందాదులును, వారిభార్యలుఁ బుత్త్రులు బాంధవులును దేవకి మొదలగుతెఱవలు వసుదేవుఁ డాదిగాఁగల సర్వయాదవులును, సురలు గాని, నిజంబు నరులుగా రని చెప్పి ‘కంసుండ! నీవు రక్కసుఁడ వనియు |
|
| ఆ. |
దేవమయుఁడు చక్రి దేవకీదేవికిఁ, బుత్త్రుఁడై జనించి భూతలంబు సెఱుపఁ బుట్టినట్టి చెనఁటిదైత్యుల నెల్లఁ, జంపు’ ననుచుఁ జెప్పి చనియె దివికి. |
52 |
| క. |
నారదుమాటలు విని పె, ల్లారాటముఁ బొంది యదువు లనిమిషు లనియున్ నారాయణకరఖడ్గవి, దారితుఁడగు కాలనేమి దా ననియు మదిన్. |
53 |
| మ. |
కలఁగంబాఱి మఱందిఁ జెల్లెలి నుదగ్రక్రోధుఁడై పట్టి బ ద్ధులఁ గావించి హరిం దలంచి వెన్‌స తోడ్తో వారు గన్నట్టి పు త్త్రులఁ జంపెన్, గురు నుగ్రసేను యదుఁ దద్భోజాంధకాధీశు ని ర్మలు బట్టెం గడు వాలి యేలెఁ జలమారన్ శూరసేనంబులన్. |
54 |
| ఆ. |
తల్లిఁ దండ్రి నైనఁ దమ్ముల నన్నల, సఖుల నైన బంధుజనుల నైన రాజ్యకాంక్షఁజేసి రాజులు సంపుదు, రవనిఁ దఱచు జీవితార్థు లగుచు. |
55 |
| వ. | మఱియును బాణ భౌమ మాగధ మహాశన కేశి ధేనుక బక ప్రలంబ తృణావర్త చాణూర ముష్టి కారిష్ట ద్వివిద పూతనాది సహాయసమేతుండై కంసుండు గదనంబున మదంబు లడంచిన వదనంబులు వంచికొని, సదనంబులు విడిచి యదవలై, యదువులు పదవులు వదలి నిషధ కురు కోసల విదేహ విదర్భ కేకయ పాంచాల సాల్వ దేశంబులు సొచ్చి, మచ్చరంబులు విడిచి కొందఱు కంసునిం గొలిచి నిలిచి, రంత. | 56 |
| క. |
తొడితొడిఁ గంసుఁడు దేవకి, కొడుకుల నార్వుర వధింప గురుశేషాఖ్యం దొడవగు హరిరుచి యా సతి, కడుపున నేడవదియైన గర్భం బయ్యెన్. |
57 |
| వ. | అ య్యవసరంబున విశ్వరూపుండగు హరి దన్ను నమ్మినయదువులకుం గంసునివలన భయంబు గలుగు నని యెఱింగి యోగమాయాదేవి కిట్లనియె. | 58 |
| సీ. |
‘గోపికాజనములు గోపాలకులు నున్న పసులమందకుఁ బొమ్ము భద్ర! నీవు వసుదేవుభార్యలు వరుసఁ గంసునిచేత నాఁకలఁ బడియుండ నందుఁ జొరక తలఁగి రోహిణియనుతరళాక్షి నందగోకులమందు నున్నది గుణగణాఢ్య దేవకికడుపున దీపించు శేషాఖ్య మైన నా తేజ మీ వమరఁ బుచ్చి |
|
| ఆ. |
నేర్పు మెఱసి రోహిణీదేవి కడుపునఁ, జొనుపు దేవకికిని సుతుఁడ నగుదు నంశభాగయుతుఁడనై, యశోదకు నందు, పొలఁతి కంత మీఁదఁ బుట్టె దీవు. |
59 |
| క. |
నానావిధసంపదలకుఁ, దానకమై సర్వకామదాయిని వగు నిన్ మానవులు భక్తిఁ గొలుతురు, కానుకలును బలులు నిచ్చి కల్యాణమయీ! |
60 |
| వ. | మఱియు నిన్ను మానవులు దుర్గ భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవి కన్యక మాయ నారాయణి యీశాన శారద యంబిక యను పదునాలుగు నామంబులం గొనియాడుదు రయ్యైస్థానంబులయం’దని యెఱింగించి, సర్వేశ్వరుండగు హరి పొమ్మని యానతిచ్చిన మహాప్రసాదం బని యయ్యోగనిద్ర యియ్యకొని మ్రొక్కి చయ్యన ని య్యిల కయ్యెడ వాసి వచ్చి. | 61 |
| తే. |
దేవకీదేవి కడుపులోఁ దేజరిల్లు, దీప్తగర్భంబు మెల్లనఁ దిగిచి యోగ నిద్ర రోహిణికడుపున నిలిపి చనియెఁ, గడుపు దిగె నంచుఁ బౌరులు గలఁగఁబడఁగ. |
62 |
| వ. | అంత. | 63 |
| ఆ. |
బలము మిగులఁ గలుగ ‘బలభద్రుఁ’డన లోక, రమణుఁ డగుటఁ జేసి ‘రాముఁ’ డనఁగ సతికిఁ బుట్టె గర్భసంకర్షణమున ‘సం, కర్షణుం’ డనంగ ఘనుఁడు సుతుఁడు. |
64 |
| వ. | తదనంతరంబ. | 65 |
| క. |
ఆనకదుందుభి మనమున, శ్రీనాథుం డంశభాగశిష్టతఁ జొరఁగన్ భానురుచి నతఁడు వెలిఁగెను, గానఁగఁ బట్టయ్యె భూతగణములకు నృపా! |
66 |
| ఉ. |
ఆవసుదేవుఁ డంతఁ దనయం దఖిలాత్మక మాత్మభూతముం బావనరేఖయున్ భువనభద్రమునై వెలుఁగొందుచున్న ల క్ష్మీవిభుతేజ మచ్చుపడఁ జేర్చినఁ దాల్చి నవీనకాంతితో దేవకి యొప్పెఁ బూర్వయగుదిక్సతి చంద్రునిఁ దాల్చుకైవడిన్. |
67 |
| వ. | అనిన విని తర్వాతి వృత్తాంతం బెట్లయ్యె నని రా జడిగిన శుకుం డిట్లనియె. | 68 |
| క. |
గురుతరముగఁ దనకడుపునఁ, సరసిజగర్భాండభాండచయములు గల యా హరి దేవకికడుపున భూ, భరణార్థము వృద్ధిఁ బొందె బాలార్కుక్రియన్. |
69 |
| వ. | అంత. | 70 |
| సీ. |
విమతులమోములు వెలవెలఁ బాఱంగ విమలాస్యమోము వెల్వెలుకఁ బాఱె మలయు వైరులకీర్తి మాసి నల్లన గాఁగ, నాతిచూచుకములు నల్ల నయ్యె దుష్టాలయంబుల ధూమరేఖలు పుట్ట లేమయారున రోమలేఖ మెఱసె నరిమానసముల కాహారవాంఛలు దప్ప వనజాక్షి కాహారవాంఛ దప్పె |
|
| తే. |
శ్రమము సంధిల్లె రిపులకు శ్రమము గదుర, జడత వాటిల్లె శత్రులు జడను వడఁగ, మన్ను రుచి యయ్యెఁ బగతురు మన్నుసొరఁగ, వెలఁదియుదరంబులో హరి వృద్ధిఁ బొంద. |
71 |
| వ. | మఱియును. | 72 |
| సీ. |
సలిల మా యెలనాఁగ జఠరార్భకునిఁ గానఁ, జనిన కైవడి ఘర్మసలిల మొప్పె, నొగిఁ దేజ మా యింతియుదరడింభకుఁ గొల్వఁ గదిసినక్రియ దేహకాంతి మెఱసెఁ బవనుఁ డా కొమ్మగర్భస్థుని సేవింప నొలసె నా మిక్కిలియూర్పు లమరెఁ గుంభిని యా లేమకుక్షిగు నర్చింపఁ జొచ్చుభంగిని మంటి చొరవ దనరె |
|
| ఆ. |
గగన మిందువదనకడుపులో బాలు సే, వలకు రూపు మెఱసి వచ్చినట్లు బయలువంటినడుము బహుళ మయ్యెను బంచ, భూతమయుఁడు లోనఁ బొదల సతికి. |
73 |
| వ. | తదనంతరంబ. | 74 |
| సీ. |
అతివకాంచీగుణం బల్లన బిగియంగ వైరివధూగుణవ్రజము వదలె మెల్లన తన్వంగిమెయిదీవ మెఱుఁగెక్క దుష్టాంగనాతనుద్యుతు లడంగె నాతి కల్లన భూషణములు పల్పలన గాఁ బరసతీభూషణపంక్తు లెడలెఁ గలకంఠి కొయ్యన గర్భంబు దొడ్డుగాఁ బరిపంథిదారగర్భములు వగిలెఁ |
|
| తే. |
బొలఁతి కల్లన నీళ్ళాడు ప్రొద్దు లెదుగ, నహితవల భ్ల్ల లైదువలై తనర్చు ప్రొద్దు లన్నియుఁ గ్రమమునఁ బోవఁ దొడఁగె, నువిదకడుపున నసురారి యుంటఁజేసి. |
75 |
| వ. | ఇవ్విధంబున. | 76 |
| ఆ. |
జ్ఞానఖలునిలోని శారదయునుబోలె, ఘటములోని దీపకళికవోలె భ్రాతయింట నాఁకఁ బడియుండె దేవకీ, కాంత విశ్వగర్భగర్భ యగుచు. |
77 |
| వ. | అంత న క్కాంతాతిలకంబు నెమ్మొగంబుతెలివియును, మేనిమెఱుంగును, మెలఁగెడిసొబగునుం జూచి వెఱఁగుపడి తఱచు వెఱచుచుఁ గంసుండు దనలో నిట్లనియె. | 78 |
| క. |
కన్నులకుఁ జూడ బరువై, యున్నది యెలనాఁగగర్భ ముల్లము గలఁగన్ ము న్నెన్నఁడు నిట్లుండదు, వెన్నుఁడు సొరఁబోలు గర్భవివరములోనన్. |
79 |
| ఉ. |
ఏమి దలంచువాఁడ? నిఁక నెయ్యది కార్యము? నాఁడు నాఁటికిం గామినిచూలు పెంపెసఁగె? గర్భిణిఁ జెల్లెలి నాఁడుపేద నే నేమని చంపువాఁడఁ? దగ వేలని చంపితినేని శ్రీయు ను ద్దామయశంబు నాయువును ధర్మమునుం జెడిపోవకుండునే? |
80 |
| క. |
వావి యెఱుంగనిక్రూరుని, జీవన్మృతుఁ డనుచు నిందసేయుదు, రతఁడుం బోవును నరకమునకు, దు, ర్భావముతో బ్రదుకు టొక్క బ్రదుకే తలఁపన్? |
81 |
| వ. | అనినిశ్చయించిక్రౌర్యంబువిడిచి ధైర్యంబు నొంది గాంభీర్యంబు వాటించి శౌర్యంబు ప్రకటించుకొనుచు దిగ్గనం జెలియలిం జంపునగ్గలిక యెగ్గని యుగ్గడించి మాని మౌనియుంబోలె నూరకుండియు. | 82 |
| ఆ. |
‘పాపరాని దొడ్డపగ పుట్టె, నిఁక నెట్టు, లిందుముఖికిఁ జక్రి యెపుడు పుట్టుఁ బుట్టినపుడె పట్టి పురిటింటిలోఁ దెగఁ, జూతు’ ననుచు నెదురు సూచుచుండె. |
83 |
| వ. | మఱియు వైరానుబంధంబున నన్యానుసంధానంబు మఱచి యతండు. | 84 |
| క. |
తిరుగుచుఁ గుడుచుచుఁ ద్రాగుచు, నరుగుచుఁ గూర్చుండి లేచు చనవరతంబున్ హరిఁ దలఁచి తలఁచి జగ మా, హరిమయ మని చూచెఁ గంసుఁ డాఱనియలుకన్. |
85 |
| వ. | వెండియు. | 86 |
| సీ. |
శ్రవణరంధ్రముల నే శబ్దంబు వినఁబడు నది హరిరవ మని యాలకించు, నక్షిమార్గమున నెయ్యది సూడఁబడు నది హరిమూర్తి గానోపు నంచుఁ జూచుఁ, దిరుగుచో దేహంబు తృణమైన సోఁకిన హరికరాఘాతమో యనుచునులుకు, గంధంబు లేమైన ఘ్రాణంబు సోఁకిన హరిమాలికాగంధ మనుచు నదరుఁ, |
|
| ఆ. |
బలుకు లెవ్వియైనఁ బలుకుచో హరిపేరు, పలుకఁబడియె ననుచు బ్రమసి పలుకుఁ దలఁపు లెట్టివైనఁ దలఁచి యా తలఁపులు, హరితలంపు లనుచు నలుగఁ దలఁచు. |
87 |
| వ. | ఆయ్యవసరంబున ననుచరసమేతులైన దేవతలును, నారదాదిమునులునుం గూడి నడవ నలువయును, ముక్కంటియు నక్కడకు వచ్చి దేవకీదేవిగర్భంబున నర్భకుండై యున్న పురుషోత్తము నిట్లని స్తుతియించిరి. | 88 |